బంగ్లాదేశ్- పాకిస్తాన్ టెస్టు సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది. బంగ్లాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టు పాకిస్తాన్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రధాని షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనకారుల ఆందోళనలు సోమవారం మిన్నంటాయి. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు.
ఈ క్రమంలో వారి డిమాండ్లకు తలొగ్గిన హసీనా.. తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21 నుంచి బంగ్లా- పాక్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ నుంచి విమాన ప్రయాణం అంత సురక్షితం కాదన్న వార్తల నేపథ్యంలో.. ఆటగాళ్లు పాక్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్ క్రికెటర్లను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో పాటు.. అదనంగా మరికొన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పీసీబీ బంగ్లా బోర్డుకు చెప్పింది.
రావల్పిండిలో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఆఫర్ చేసింది. కానీ ఇంత వరకు అటువైపు నుంచి స్పందన రాలేదు. బంగ్లా బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఉందని తెలిసింది. బోర్డు కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాయి. 2019-2020లో బంగ్లాదేశ్ జట్టు చివరిసారిగా పాకిస్తాన్‌లో పర్యటించింది.
కాగా షేక్ హసీనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారిపై కూడా నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొర్తజా ఇంటికి ధ్వంసం చేసి.. నిప్పు అంటించారు. ఈ మాజీ పేసర్ కెరీర్ ఎదుగుదలలో హసీనా పాత్ర కూడా ఉందని సమాచారం.
అదే విధంగా.. అధికార అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా రెండుసార్లు(2019, 2024) గెలిచాడు కూడా! ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబరులో జరగాల్సిన మహిళా టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment