Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. పాక్‌ క్రికెటర్‌ చర్య వైరల్‌ | Pak vs Ban 2nd Test: Shakib Al Hasan Laughs As Abrar Runs out To Bat This Fear | Sakshi
Sakshi News home page

Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్‌ క్రికెటర్‌ పరుగులు

Published Tue, Sep 3 2024 12:03 PM | Last Updated on Tue, Sep 3 2024 12:43 PM

Pak vs Ban 2nd Test: Shakib Al Hasan Laughs As Abrar Runs out To Bat This Fear

పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. పాక్‌ టెయిలెండర్‌ అబ్రార్‌ అహ్మద్‌ మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన తీరు బంగ్లా శిబిరంలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ అబ్రార్‌ చర్యకు స్పందించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..

తొలి టెస్టులో ఘన విజయం
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ వెళ్లిన బంగ్లాదేశ్‌.. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. పది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి పాక్‌పై టెస్టుల్లో విజయం సాధించింది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌ను మొదలుపెట్టిన పర్యాటక జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసి.. ఆ దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు పాక్‌ను ఆలౌట్‌ చేసిన బంగ్లాదేశ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే పరిమితం చేసింది.

రెండో మ్యాచ్‌లోనూ అదరగొడుతూ
సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పేసర్లు హసన్‌ మహమూద్‌ ఐదు, నషీద్‌ రాణా నాలుగు వికెట్లతో చెలరేగి.. పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెన్నువిరిచారు. ఈ క్రమంలో.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్రమంలో స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ హడావుడిలో అతడి చేతి గ్లౌజ్‌ కిందపడగా.. వెంటనే దానిని తీసుకుని మరింత వేగంగా క్రీజు వైపునకు పరిగుతీశాడు.

ఆలస్యమైతే అవుటే.. షకీబ్‌ నవ్వులు
ఆ సమయంలో బౌలింగ్‌ చేస్తున్నది మరెవరో కాదు బంగ్లా మాజీ కెప్టెన్‌ షకీబల్‌ హసన్‌. అబ్రార్‌ హడావుడికి అదే కారణం. ఏమాత్రం ఆలస్యం చేసినా టైమ్డ్‌ అవుట్‌ కింద అవుట్‌ అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన అబ్రార్‌.. అలా పరిగెత్తగానే.. షకీబల్‌ నవ్వడం గమనార్హం. కాగా వన్డే ప్రపంచకప్‌-2023 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌ సమయంలో షకీబ్‌.. టైమ్డ్‌ అవుట్‌ కింద అప్పీలు చేసి ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే.

నాడు లంక బ్యాటర్‌కు చేదు అనుభవం
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్‌ అవుటైనా.. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చే ఆటగాడు.. మూడు నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే.. టైమ్డ్‌ అవుట్‌ రూల్‌ కింద అవుటైనట్లుగా ప్రకటిస్తారు. నాడు మాథ్యూస్‌ షకీబ్‌ కారణంగా ఇలా అవుటై.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అది దృష్టిలో పెట్టుకునే అబ్రార్‌ కూడా షకీబ్‌కు భయపడి ఉంటాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: 'పాకిస్తాన్ జ‌ట్టుకు క్యాన్స‌ర్‌.. ఆ న‌లుగురు చాలా డేంజ‌రస్‌'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement