సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త కెప్టెన్సీ, ఆటగాళ్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వల్లే ఈ గతి పట్టిందంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు షాన్ మసూద్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో మొత్తంగా పేసర్లతో దిగడం, రెండో టెస్టులో ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలను తప్పుపడుతున్నారు.
ఓటమికి బాధ్యత నాదే
జట్టు ఆట తీరు చూస్తే సరైన ప్రణాళిక, వ్యూహాలు లేకుండానే బరిలోకి దిగినట్లు కనిపించిందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడంపై కెప్టెన్ షాన్ మసూద్ స్పందిస్తూ.. ‘‘స్వదేశంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరాం. కానీ తీవ్ర నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియాలో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం.
ఓటమికి బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. కానీ టెస్టు క్రికెట్‌ను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా లేనట్లు అనిపించింది. ఆటగాళ్లు గెలవాలనే లక్ష్యంతోనే ఆడినా... ఫలితాలు అనుకూలంగా రాలేదు.
ఆ అంశాలతో సంబంధం లేదు
టెస్టు ఫార్మాట్ ఆడుతున్న బౌలర్లకు తరచూ అవకాశాలు ఇవ్వాలి. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం. ఇకపై మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలనుకుంటున్నాం. లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడతాం. జట్టు ఎంపిక, డ్రెస్సింగ్ రూమ్ వంటి అంశాలతో ఫలితాలకు సంబంధం లేదు. బంగ్లాదేశ్ జట్టు మా కంటే మెరుగైన ఆటతీరు కనబర్చింది. ఈ విజయానికి వారు అర్హులు’’అని పేర్కొన్నాడు.
వాళ్లిద్దరిని తప్పించడం సరైందే
ఇక రెండో టెస్టు నుంచి షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను తప్పించిన తమ నిర్ణయాన్ని షాన్ మసూద్ సమర్థించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఫాస్ట్ బౌలర్లపై పనిభారం ఎక్కువగా మోపడం సరికాదని పేర్కొన్నాడు. అయినా ఎల్లప్పుడూ ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధారపడకూడదని.. మిగతా వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు.
తొలిసారి బంగ్లా గెలుపు
కాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ పేస్ త్రయం మీర్ హమ్జా, మొహమ్మద్ అలీ, ఖుర్రం షెహజాద్ వికెట్లు పడగొట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పాక్‌పై బంగ్లా టెస్టుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment