బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు పేసర్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా ఒక్కడికే స్థానం ఇచ్చారు సెలక్టర్లు.
కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు షాన్ మసూద్. అయితే, ఆ టూర్ అతడికి చేదు అనుభవం మిగిల్చింది. అతడి కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడే సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది.
బంగ్లాపై పైచేయి
బంగ్లాతో ఇప్పటి వరకు 13 టెస్టుల్లో పన్నెండు గెలిచి ఘనమైన టెస్టు రికార్డు కలిగి ఉన్నా.. పాకిస్తాన్ ఈ సిరీస్‌లో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే మరింత వేగంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌తోనే ఆస్ట్రేలియన్ జాసన్ గిల్లెస్పి పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు.
యువ సంచలనానికి చోటు
ఇక ఆగష్టు 21 నుంచి రావల్పిండి వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం పాకిస్తాన్ సోమవారమే తమ తుదిజట్టును ప్రకటించింది. ఓపెనర్లుగా అబ్దుల్ షఫీక్, సయీమ్ ఆయుబ్.. వన్‌డౌన్‌లో షాన్ మసూద్ ఆడనున్నారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన సౌద్ షకీల్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా ఆ తర్వాతి స్థానాల్లో ఆడనున్నారు.
ఇక పేస్ విభాగంలో షాహిన్ ఆఫ్రిది, నసీం షా, యువ సంచలనం ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ బరిలోకి దిగనున్నారు. కాగా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా పాక్ తరఫున అరంగేట్రం చేసిన షెహజాద్ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మెరిశాడు. అయితే, ఇప్పుడే మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత 14 మందికి తగ్గించింది. ఆమీర్ జమాల్ వెన్నునొప్పి కారణంగా దూరం కాగా.. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను బంగ్లాదేశ్-ఎ జట్టుతో బరిలోకి దించనుంది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తుదిజట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాహీన్ షా ఆఫ్రిది.
చదవండి: చాంపియన్స్ ట్రోఫీ వరకు ఇషాన్‌కు టీమిండియాలో నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment