సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్‌లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.
కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్‌లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.
టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదు
టెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్‌పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్‌నూ తప్పించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.
తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?
వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్‌కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపిక
అదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.
సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.
సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టు
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).
సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టు
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).
చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
Comments
Please login to add a commentAdd a comment