Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది.
టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్‌ను జోష్ హాజిల్‌వుడ్ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్‌ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్‌ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు.
అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్‌రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు.
తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది.
ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.
కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment