బంగ్లాతో రెండో టెస్టు.. పాక్‌ సంచలన స్పిన్నర్‌ ఎంట్రీ | Desperate Pakistan Announce Big Changes In Team Ahead 2nd Test Vs Bangladesh | Sakshi
Sakshi News home page

Pak vs Ban: బంగ్లాతో రెండో టెస్టు.. పాక్‌ జట్టులోకి ఆ ఇద్దరు

Published Wed, Aug 28 2024 7:14 PM | Last Updated on Wed, Aug 28 2024 8:31 PM

Desperate Pakistan Announce Big Changes In Team Ahead 2nd Test Vs Bangladesh

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌, బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కమ్రాన్‌ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా పాకిస్తాన్‌ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. 

వారిద్దరు తిరిగి జట్టులోకి 
బంగ్లాదేశ్‌ స్పిన్‌ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్‌ ఓడిన పాక్‌ తొలి జట్టుగా షాన్‌ మసూద్‌ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్‌ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్‌ అహ్మద్‌, కమ్రాన్‌ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్‌ విషయంలో సందిగ్దం నెలకొంది. 

నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్‌
ఇక వీరితో పాటు ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్‌ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్‌, కమ్రాన్‌ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్‌, ఆల్‌రౌండర్‌ ఆమీర్‌ జమాల్‌ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.

కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్‌-ఏ జట్టుతో పాక్‌ షాహిన్స్‌ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్‌ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్‌ చేశాడు. కానీ వికెట్‌ తీయలేకపోయాడు. కాగా అబ్రార్‌ అహ్మద్‌ ఇప్పటి వరకు పాక్‌ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్‌ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్‌నెస్‌ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్‌ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్‌ షా ఆఫ్రిది.

చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్‌.. టాప్‌-10లో ముగ్గురు భారత స్టార్లు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement