బంగ్లాతో సిరీస్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌ అతడే | Pak Vs Ban Test Series: PCB Announce Team Not Babar This 29 Year Old To Lead | Sakshi
Sakshi News home page

Pak vs Ban: బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌ అతడే

Published Wed, Aug 7 2024 11:21 AM | Last Updated on Wed, Aug 7 2024 11:34 AM

Pak Vs Ban Test Series: PCB Announce Team Not Babar This 29 Year Old To Lead

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. పదిహేడు మంది ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది. కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో భాగంగా పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ జరగాల్సి ఉంది.

పాక్‌- బంగ్లా సిరీస్‌ నిర్వహణపై సందిగ్దం
ఇందుకోసం బంగ్లాదేశ్‌ పాక్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్‌ సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో పెను రాజకీయ సంక్షోభం నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు విధ్వంసకాండకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి.. దేశం వీడారు షేక్‌ హసీనా.

అయినప్పటికీ జనాగ్రహజ్వాలలు చల్లారలేదు. షేక్‌ హసీనాతో సత్సంబంధాలు ఉన్న ప్రముఖుల ఇళ్లకు నిప్పుపెట్టడం సహా మరికొంతమందిని కడతేర్చారు. అంతేకాదు.. ఈ అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాక్‌- బంగ్లా సిరీస్‌ నిర్వహణపై సందిగ్దం నెలకొంది.

ఈ క్రమంలో పాక్‌ బోర్డు తాము సురక్షితంగా బంగ్లా ఆటగాళ్లను తీసుకువెళ్తామని చెప్పినా.. బంగ్లా బోర్డు నుంచి స్పందన రాలేదని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్‌ మాత్రం బుధవారమే జట్టును ప్రకటించడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థానంలో నిలవాలంటే ఈ సిరీస్‌ తప్పనిసరికావడంతో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.

కెప్టెన్‌ అతడే
ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత బాబర్‌ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్‌ మసూద్‌ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు బాబర్‌ తిరిగి వన్డే, టీ20 పగ్గాలు చేపట్టడంతో టెస్టుల్లోనూ అతడినే పునర్నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోర్డు మాత్రం మసూద్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. సౌద్‌ షకీల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది.

బంగ్లాతో సిరీస్‌ నేపథ్యంలో దాదాపు 13 నెలల విరామం తర్వాత యువ పేసర్‌ నసీం షా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా పాక్‌- బంగ్లా జట్ల మధ్య రావల్పిండిలో తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్‌నెస్‌ సాధిస్తేనే), అబ్దుల్లా షఫిక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్‌ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement