
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ పాత్ర చాలా కీలకం. ఈ ఇద్దరు దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తూ జట్టు విజయానికి పటిష్టమైన పునాది వేస్తున్నారు.
ఈ సీజన్‌లో సాయి ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. గిల్ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
ఈ సీజన్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకున్న సాయి-గిల్ ద్వయం.. ఇవాళ (ఏప్రిల్ 12) లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో 120 పరుగులు జోడించిన సాయి-గిల్ జోడీ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తొలి వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించిన తొలి జోడీగా రికార్డు నెలకొల్పింది. అలాగే ఈ సీజన్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగులు జోడించిన జోడీగానూ రికార్డుల్లోకెక్కింది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యాలు
గిల్-సాయి సుదర్శన్- 120 (తొలి వికెట్‌కు)
పూరన్-మార్ష్- 116 (రెండో వికెట్‌కు)
స్టబ్స్-కేఎల్ రాహుల్- 111* (ఐదో వికెట్‌కు)
శాంసన్-జురెల్- 111 (నాలుగో వికెట్‌కు)
రహానే-నరైన్- 103 (రెండో వికెట్‌కు)
ఈ మ్యాచ్‌లో గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంతవరకు గుజరాత్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది.
13వ ఓవర్ తొలి బంతికి సాయి ఔటయ్యే సమయానికి గుజరాత్ స్కోర్ 120 పరుగులుగా ఉండగా.. 17వ ఓవర్ ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. రూథర్‌ఫోర్డ్ (6), షారుక్ ఖాన్ (1) గుజరాత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో బట్లర్ 16, సుందర్ 2 పరుగులకు ఔటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ 2, దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది.
తుది జట్లు..
లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్