
Photo Courtesy: BCCI
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆట తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో కనీస పోరాట పటిమ కనిపించలేదని.. సీఎస్‌కే చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన అని ఘాటుగా విమర్శించాడు. ఇప్పటికైనా మూస పద్ధతి, ముతక ఆట తీరుకు చరమగీతం పాడాలని సూచించాడు.
వరుసగా ఐదు ఓటములు
కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో సీఎస్‌కే పరాజయ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన చెన్నై జట్టుకు.. ఆ తర్వాత విజయమే కరువైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైన సీఎస్‌కే.. శుక్రవారం కేకేఆర్ చేతిలోనూ పరాజయాన్ని చవిచూసింది.
సొంత మైదానం చెపాక్‌లో ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది. ఒక ఐపీఎల్ సీజన్‌లో చెన్నై ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం.. తమకు కంచుకోటైన చెపాక్‌లో హ్యాట్రిక్ పరాజయాలు చవిచూడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, మాజీ చీఫ్ సెలక్టర్ సీఎస్‌కే తీరును ఎండగట్టాడు.
పృథ్వీ షాను తీసుకోండి
‘‘సీఎస్‌కే చరిత్రలోనే ఇదొక చెత్త ఓటమి. పవర్ ప్లేలో అయితే.. ఏదో టెస్టు మ్యాచ్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆడారు. ప్రతి ఒక్కరు అదే తీరు. సమయం మించిపోతోంది. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పృథ్వీ షా వంటి ఆటగాళ్లను ఎందుకు తీసుకోకూడదు?!
ఇలాంటి సమయంలో అలాంటి వాళ్లే అవసరం. ఈ విషయం గురించి మీరు ఎందుకు ఆలోచించరు?.. లేదా ఇలాంటి గందరగోళం, పేలవమైన ఆట తీరు కూడా వ్యూహంలో భాగమే అంటారా?’’ అంటూ చిక్కా ఓ వైపు సూచనలు ఇస్తూనే.. మరోవైపు.. సీఎస్‌కే నాయకత్వ బృందానికి చురకలు అంటించాడు.
మహేంద్ర సింగ్ ధోని మరోసారి
కాగా ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన సీఎస్‌కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని మరోసారి కెప్టెన్సీ చేపట్టాడు. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో అతడే సీఎస్‌కేను ముందుండి నడిపించనున్నాడు.
మరోవైపు.. ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. క్రమశిక్షణా రాహిత్యం, వరుస వైఫల్యాల కారణంగా ప్రస్తుతం కఠిన దశను ఎదుర్కొంటున్నాడు. జాతీయ జట్టుకు ఎప్పుడో దూరమైన పృథ్వీ.. ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.
రూ. 75 లక్షల కనీస ధర
ఒకప్పుడు కోట్లు పలికిన ఈ ఆటగాడు రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చినా పది ఫ్రాంఛైజీలలో ఒక్కటీ పృథ్వీ షాను పట్టించుకోలేదు. అయితే, తనదైన రోజున అద్భుతంగా ఆడే ఈ ఓపెనింగ్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని.. క్రిష్ణమాచారి సీఎస్‌కేకు సూచించడం గమనార్హం.
కాగా పృథ్వీ షా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. చివరగా 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం