అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి? | "I Never Seen So Much Money...": Aakash Chopra Comments On Rishabh Pant Failures And Price Tag Trolls | Sakshi
Sakshi News home page

నా జీవితంలో ఒకేసారి అంత డబ్బు కళ్ల చూడలేదు.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?

Published Sat, Apr 12 2025 2:52 PM | Last Updated on Sat, Apr 12 2025 3:21 PM

IPL 2025 I Never Seen So Much Money: Aakash Chopra on Pant Failures

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్‌ పంత్‌ (Rishabh Pant). ఈ టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను దక్కించుకునేందుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. మెగా వేలంలో ఇతర జట్లతో పోటీపడి మరీ లక్నో యాజమాన్యం పంత్‌ను భారీ ధరకు దక్కించుకుంది.

ఐపీఎల్‌-2025లో కెప్టెన్‌గా పంత్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, సారథిగా ఫర్వాలేదనిపిస్తున్న ఈ టీమిండియా స్టార్‌.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో అతడి కెప్టెన్సీలో లక్నో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది.

19 పరుగులు
ఇక బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ చేసిన పరుగులు మొత్తం కలిపి కేవలం 19. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్‌ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్నో జట్టు శనివారం సొంత మైదానం ఏకనా స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా పంత్‌ బ్యాట్‌ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా రిషభ్‌ పంత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రైస్‌ ట్యాగ్‌’ పంత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందా? అన్న నెటిజన్ల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే.. నా జీవితంలో ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదు.

కాబట్టి.. అతడిపై ఒత్తిడి ఉంటుందో లేదో నేను అంచనా వేయలేను. అయితే, ఓ ఆటగాడిపై ఇలాంటివి కచ్చితంగా ప్రభావం చూపుతాయా? అంటే అవుననీ చెప్పవచ్చు. డబ్బు (ప్రైస్‌ ట్యాగ్‌) లేదంటే కెప్టెన్సీ భారం అతడిపై ఒత్తిడి పెంచుతుండవచ్చు. కారణం ఏదైనా పంత్‌ దానిని అధిగమించాలి.. గానీ తప్పించుకోకూడదు.

 అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
గత మ్యాచ్‌లో పంత్‌ బ్యాటింగ్‌కు వెళ్లకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీజులోకి వెళ్తేనే కదా.. పరుగులు వస్తాయో.. రావో తెలిసేది. కనీస ప్రయత్నానికి కూడా వెనుకాడితే ఎలా?.. అతడు బ్యాటింగ్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం ఎంతమాత్రం సరికాదు’’ అని ఆకాశ్‌ చోప్రా విమర్శించాడు.

కాగా గత మ్యాచ్‌లో లక్నో జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఆతిథ్య కేకేఆర్‌.. పంత్‌ సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (28 బంతుల్లో 47), మిచెల్‌ మార్ష్ (48 బంతుల్లో 81) దంచికొట్టగా.. నికోలస్‌ పూరన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (36 బంతుల్లో 87 నాటౌట్‌) ఆడాడు.

అయితే, మిడిలార్డర్‌లో వచ్చే పంత్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. నాలుగో స్థానంలో అబ్దుల్‌ సమద్‌ (6).. ఐదో స్థానంలో డేవిడ్‌ మిల్లర్‌ (4 నాటౌట్‌)ను ఆడించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో 238 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ 234 రన్స్‌కే పరిమితం కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పంత్‌ సేన జయభేరి మోగించింది. ‌

చదవండి: IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. అతడు సీజన్‌ మొత్తానికి దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement