
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, డెత్ ఓవర్లలో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీసుకున్న నిర్ణయాలే లక్నో ఓటమికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.
49 బంతుల్లో 63 రన్స్
లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై (LSG vs CSK)తో తలపడ్డ పంత్ సేన.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఐడెన్ మార్క్రమ్ (6) విఫలం కాగా.. మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. అయితే, ఇన్‌ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో నాలుగో స్థానంలో ఆడిన పంత్ 49 బంతుల్లో 63 రన్స్ చేయగా.. ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) అతడికి సహకారం అందించారు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ (నాలుగు ఓవర్లలో 13 రన్స్) పొదుపుగా బౌలింగ్ చేశాడు. పేసర్లలో మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు చెన్నై తడబడింది.
శివం దూబేతో కలిసి ధోని
ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఓ మోస్తరుగా ఆడగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరు లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఇలాంటి తరుణంలో శివం దూబేతో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
రవి బిష్ణోయిని కాదని..
ఈ క్రమంలో ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయానికి 44 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన లక్నో సారథి పంత్ బౌలింగ్ చాయిస్ విషయంలో తప్పటడుగు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రవి బిష్ణోయిని కాదని.. పేస్ ద్వయం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్‌ను నమ్ముకున్నాడు.
ఇక దూబే (37 బంతుల్లో 43), ధోని (11 బంతుల్లో 26) వారి బౌలింగ్‌లో పరుగులు పిండుకుని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి పంత్ నిర్ణయంపై స్పందించాడు.
నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
‘‘నేను పంత్‌తో ఏమీ మాట్లాడలేదు. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి నన్ను పిలుస్తాడేమోనని రెండు, మూడు సార్లు అతడికి దగ్గరగా వెళ్లాను. కానీ తన ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. కాబట్టి నన్ను పట్టించుకోలేదేమో!
ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మా కంటే అతడే గొప్పగా పరిస్థితులను అంచనా వేయగలడు. అందుకే తన నిర్ణయం సరైందనే భావనతో ముందుకు వెళ్లి ఉంటాడు.
ఏదైమైనా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను, రాఠి, మార్క్రమ్ ఉన్నాం. కాబట్టి అదనపు స్పిన్నర్ అవసరం లేదు. ఇక మహీ భాయ్ గురించి చెప్పేదేముంది?!.. బంతి తన ఆధీనంలో ఉందంటే దానిని బౌండరీకి తరలించడమే తరువాయి’’ అని రవి బిష్ణోయి పరోక్షంగా పంత్ నిర్ణయాన్ని విమర్శించాడు.
కాగా లక్నో బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయి మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మార్క్రమ్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది
The IMPACT player does it with MAX IMPACT 🤩
Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎
Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025