ధోనితో జడేజా (PC: CSK/BCCI)
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...
కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్‌కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకోనుందట.
ధోని వారసుడి కోసం
అయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్‌కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?
ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్‌కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్‌కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వరల్డ్ కప్ విన్నర్.. కానీ
కాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్‌టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్‌కే భావిస్తోందట.
అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్‌టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.
అందుకే రిలీజ్ చేయాలనే యోచనలో
అలా అయితే, వేలంలో పంత్‌ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్‌కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్‌లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!!
కెప్టెన్‌గా నియమించినా..
కాగా జడ్డూకు సీఎస్‌కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్‌గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ అదే టీమ్‌లో ఉన్నాడు.
అయితే, 2022లో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్‌లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.
చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
Comments
Please login to add a commentAdd a comment