
Photo Courtesy: BCCI
దేశ రాజధాని ఢిల్లీని నిన్న (ఏప్రిల్ 11) సాయంత్రం గాలి దుమారం వణికించింది. ఇది సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలి దూమారం ప్రభావం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌పై కూడా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ నిమిత్తం ఆ జట్టు నిన్న సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది.
Straight out of a 🌪️ movie#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMI pic.twitter.com/Tv7j3ILf9v
— Mumbai Indians (@mipaltan) April 11, 2025
ఈ క్రమంలో గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై ఇండియన్స్ బృంద సభ్యులు భయంతో వణికిపోయారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కేకేలు పెడుతూ బృంద సభ్యులను మైదానం నుంచి తిరిగి రమ్మంటూ అభ్యర్థించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ కేకేలు పెడుతుండగా.. దీపక్ చాహర్, కోచ్‌లు మహేల జయవర్ధనే, లసిత్ మలింగ డగౌట్ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు.
రోహిత్.. సహచరులను మైదానం వీడి సురక్షితంగా డగౌట్‌కు చేరుకోవాలని కేకేలు పెడుతూనే తన సహజ శైలిలో జోక్‌లు వేశాడు. తనవైపు ఫోకస్ పెట్టిన కెమెరామెన్‌ను "నా ముఖం ఏం చూపిస్తున్నావు. ఆ వీడియో తీసుకో" అంటూ అరిచాడు. గాలి దూమారం ధాటికి స్టేడియంలో వస్తువులు గాల్లో ఎగురుతూ కనిపించాయి.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికి ఢిల్లీలోని వాతావరణం క్లియర్‌గా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు వర్షం నుంచి కాని, గాలి దుమారం నుంచి కాని ఎలాంటి ముప్పు లేదని ప్రకటన విడుదల చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.
ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి గుజరాత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో, రాజస్థాన్ వరస స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్, సీఎస్‌కే చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి.
ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో లక్నోతో గుజరాత్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది.