అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంతకన్నా కిందికి దిగజారలేదు అనుకున్న ప్రతీసారి అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ అంతకుమించిన చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది.
ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఆకీబ్ జావేద్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ పేసర్లు... జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, రమీజ్ రాజా, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వంటి మేటి ఆటగాళ్లతో కళకళలాడిన ఆ జట్టు... ఇప్పుడు రెండున్నరేళ్లుగా స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలవలేక ఇబ్బంది పడుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం పాకిస్తాన్ జట్టు పతనావస్థను సూచిస్తోంది.
రావల్పిండి: సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన బంగ్లాదేశ్ జట్టు... పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గతంలో పాకిస్తాన్‌తో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 12 టెస్టుల్లో ఓడిన బంగ్లాదేశ్... తాజా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు నెగ్గి సొంతగడ్డపై పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
వరుసగా ఐదో టెస్టులో పరాజయం
బంగ్లాదేశ్‌కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా... వర్షం అంతరాయం మధ్య మూడున్నర రోజులే జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. రాజకీయ అనిశ్చితి కారణంగా దేశంలో అల్లర్లు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇలాంటి విజయం సాధించడం గమనార్హం.
మరోవైపు గత కొంతకాలంగా స్వదేశంలోనూ నిలకడగా విజయాలు సాధించలేకపోతున్న పాకిస్తాన్ జట్టు... ఈ ఏడాది వరుసగా ఐదో టెస్టు మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ ఐదింట్లోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన షాన్ మసూద్... తొలి ఐదు టెస్టుల్లోనూ ఓటములు ఎదుర్కొన్న తొలి పాకిస్తాన్ కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
ఈ సిరీస్‌లో నమోదైన పలు ఆసక్తికర రికార్డులను పరిశీలిస్తే..
👉బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. ఇంతకుముందు 2009లో వెస్టిండీస్‌పై, 2021లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లు నెగ్గింది.
👉ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పేస్ బౌలర్లే తీయడం బంగ్లాదేశ్‌కు ఇది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్, నహీద్ రాణా, తస్కీన్ అహ్మద్ కలిసి పాకిస్తాన్ పది వికెట్లు పడగొట్టారు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి బంగ్లా పేసర్లు 14 వికెట్లు పడగొట్టారు.
👉ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్–6 ప్లేయర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. టెస్టు మ్యాచ్ నెగ్గిన సందర్భంలో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు ఆటగాళ్లు చేసిన రెండో అత్యల్ప పరుగులివే. 1887లో ఆస్ట్రేలియా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్ నెగ్గింది.
👉సొంతగడ్డపై గత పది మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు గెలుపు రుచి చూడలేదు. ఇంతకుముందు 1969–1975 మధ్య పాకిస్తాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది.
👉షాన్ మసూద్ సారథ్యంలో ఆడిన ఐదు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. గతంలో ఏడుగురు కెప్టెన్‌లకు తొలి ఐదు టెస్టుల్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ జాబితాలో ఖాలెద్ మసూద్ (12 టెస్టులు; బంగ్లాదేశ్), ఖాలెద్ మహమూద్ (9 టెస్టులు; బంగ్లాదేశ్), మొహమ్మద్ అష్రఫుల్ (8 టెస్టులు; బంగ్లాదేశ్), నయీముర్ రహమాన్ (5 టెస్టులు; బంగ్లాదేశ్), గ్రేమ్ క్రీమర్ (6 టెస్టులు; జింబాబ్వే), కేన్ రూథర్‌ఫార్డ్ (5 టెస్టులు, న్యూజిలాండ్), బ్రాత్‌వైట్ (5 టెస్టులు; వెస్టిండీస్) ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment