టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు... అదే జోరులో సిరీస్ చేజిక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అద్వితీయ ఆట తీరుతో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ చేసింది.
చెలరేగిన బంగ్లా పేసర్లు
బంగ్లా రైటార్మ్ పేసర్లు హసన్ మహమూద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నషీద్ రాణా 4 వికెట్లు కూల్చాడు. మరో కుడిచేతి వాటం పేసర్ టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాక్ బ్యాటర్లలో ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆఘా సల్మాన్ 47 పరుగులతో అజేయంగా ఉండటంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ 28, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించారు. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు దాటలేక చతికిలపడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసిన బంగ్లాదేశ్.. టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయానికి 148 పరుగుల దూరంలో నిలిచింది.
లిటన్ దాస్ వీరోచిత ఇన్నింగ్స్
కాగా పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 78.4 ఓవర్లలో 262 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్. పాకిస్తాన్ పేసర్ల ధాటికి 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను లిటన్ దాస్ ఆదుకున్నాడు.
ఎదురుదాడితో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. లిటన్ దాస్ 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాటిగా పరుగులు రాబట్టాడు. అతడికి ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (124 బతుల్లో 78; 12 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు.
ఖుర్రమ్ షెహజాద్‌కు 6 వికెట్లు
వీరిద్దరూ ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ నజ్ముల్ షాంటో (4), మోమినుల్ హక్ (1), ముష్ఫికర్ రహీమ్ (3), షకీబ్ అల్ హసన్ (2), జాకీర్ హసన్ (1), షాద్‌మన్ ఇస్లామ్ (10) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6, మీర్ హమ్జా, సల్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (3), నైట్ వాచ్‌మన్ ఖుర్రం షెహజాద్ (0) అవుటయ్యారు.
గెలిస్తే సరికొత్త చరిత్ర
బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో సంపాదించింది. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా బంగ్లాదేశ్.. ఆతిథ్య పాక్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు. 172 పరుగులకే ఆలౌట్ చేసి మరోసారి షాకిచ్చింది.
ఇక వర్షం కారణంగా పాక్-బంగ్లా తొలిరోజు(శుక్రవారం) ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.
ఈ క్రమంలో అనూహ్య రీతిలో తొలి టెస్టులో గెలుపొందిన బంగ్లాదేశ్.. రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment