బాబర్‌ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్‌ అతడే: పాక్‌ మాజీ క్రికెటర్‌ | Pak vs Eng Tests Not Babar Target Was Always Shaheen Afridi: Basit Ali | Sakshi
Sakshi News home page

బాబర్‌ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్‌ అతడే: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published Mon, Oct 14 2024 2:07 PM | Last Updated on Mon, Oct 14 2024 4:12 PM

Pak vs Eng Tests Not Babar Target Was Always Shaheen Afridi: Basit Ali

ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్‌ కమిటీ వచ్చీ రాగానే స్టార్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.

బలిపశువు అతడే
పీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్‌ బాబర్‌ కాదన్న బసిత్‌ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్‌.. షాహిద్‌ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్‌ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన షాన్‌ మసూద్‌ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్‌ జావేద్, అసద్‌ షఫీక్, అజహర్‌ అలీ తదితరులతో నూతన సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

అది అతడి దురదృష్టం
ఈ నేపథ్యంలో బసిత్‌ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్‌ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్‌ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్‌ ఎల్లప్పుడూ షాహిన్‌ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్‌ ఆఫ్రిది.

షాహిన్‌ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్‌ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్‌’’ అని సందేశం ఇచ్చాడు.

అదే విధంగా.. బాబర్‌ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్‌, షాహిన్‌, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్‌ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్‌ ఆజంతో పాటు పేస్‌ బౌలర్లు షాహిన్‌ అఫ్రిది, నసీమ్‌ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.

ముగ్గురు కొత్త ఆటగాళ్లు
తొలి టెస్టులో జట్టు‌ మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్‌ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్‌ ముంతాజ్‌లను సెలక్ట్‌ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్‌ స్పిన్నర్లు సాజిద్‌ ఖాన్, నోమాన్‌ అలీలకు కూడా పాక్‌ జట్టులో చోటు దక్కింది.

చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement