పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
బాబర్‌పై వేటు
ముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్‌తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ అయింది.
ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట
ఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.
మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్‌గా బాబర్ భేష్
తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
గడ్డుకాలం
చివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్‌పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్‌పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.
కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్‌ను తప్పించాలని నిర్ణయించారు.
అయితే, టాప్ బ్యాటర్ బాబర్‌పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.
ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment