అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్‌ పోస్ట్‌ వైరల్‌ | Pak vs Eng: Babar Azam Post for Kamran Ghulam's Debut Test Century Goes Viral | Sakshi
Sakshi News home page

అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్‌ ఆజం పోస్ట్‌ వైరల్‌

Published Wed, Oct 16 2024 10:30 AM | Last Updated on Wed, Oct 16 2024 10:58 AM

Pak vs Eng: Babar Azam Post for Kamran Ghulam's Debut Test Century Goes Viral

‘‘అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను.. కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. నాదైన రోజు వస్తుందని ఓపికగా వేచిచూశా’’.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన పాకిస్తాన్‌ క్రికెటర్‌ కమ్రాన్‌ గులామ్‌ అన్న మాటలు ఇవి. 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు.

అనూహ్య రీతిలో మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై వేటు పడగా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 224 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా కమ్రాన్‌ గులామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

శతక ధీరుడిపై బాబర్‌ పోస్ట్‌ వైరల్‌
ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజం కమ్రాన్‌ను కొనియాడుతూ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. శతకం బాదిన తర్వాత కమ్రాన్‌ నేలతల్లిని ముద్దాడుతూ సెలబ్రేట్‌ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన బాబర్‌.. ‘‘చాలా బాగా ఆడావు కమ్రాన్‌’’ అంటూ అభినందించాడు. కాగా పాకిస్తాన్‌ తరఫున అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 13వ క్రికెటర్‌గా కమ్రాన్‌ గులామ్‌ రికార్డు సాధించాడు.

తొలి ఆటగాడిగా మరో రికార్డు
గతంలో పాక్‌ తరఫున ఖాలిద్‌ ఇబాదుల్లా (ఆస్ట్రేలియాపై 1966లో), జావేద్‌ మియాందాద్‌ (న్యూజిలాండ్‌పై 1976లో), సలీమ్‌ మాలిక్‌ (శ్రీలంకపై 1982లో), మొహమ్మద్‌ వసీమ్‌ (న్యూజిలాండ్‌పై 1996), అలీ నక్వీ (దక్షిణాఫ్రికాపై 1997లో), అజహర్‌ మహమూద్‌ (దక్షిణాఫ్రికాపై 1997లో), యూనిస్‌ ఖాన్‌ (శ్రీలంకపై 2000లో), తౌఫీక్‌ ఉమర్‌ (బంగ్లాదేశ్‌పై 2001లో), యాసిర్‌ హమీద్‌ (బంగ్లాదేశ్‌పై 2003లో), ఫవాద్‌ ఆలమ్‌ (శ్రీలంకపై 2009లో), ఉమర్‌ అక్మల్‌ (న్యూజిలాండ్‌పై 2009లో), ఆబిద్‌ అలీ (శ్రీలంకపై 2019లో) ఈ ఘనత సాధించారు. అయితే, ఇంగ్లండ్‌పై ఓ అరంగేట్ర పాకిస్తాన్‌ ఆటగాడు శతకం బాదడం ఇదే తొలిసారి.

తొలిరోజు.. తడబడి.. నిలబడి
కమ్రాన్‌ గులామ్‌ (224 బంతుల్లో 118; 11 ఫోర్లు, ఒక సిక్సర్‌) శతకం కారణంగా రెండో టెస్టులో పాకిస్తాన్‌ మెరుగైన స్కోరు చేయగలిగింది. ముల్తాన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి  90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కాగా తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం పలు మార్పులు చేసిన పాకిస్తాన్‌ జట్టు... కమ్రాన్‌ గులామ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన  పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. ఓపెనర్‌ అయూబ్‌ (77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్‌ అబ్దుల్లా షఫీఖ్‌ (7), కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (3), సౌద్‌ షకీల్‌ (4) విఫలమయ్యారు. ఒకదశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయూబ్‌తో కలిసి కమ్రాన్‌ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది.

మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 29 ఏళ్ల కమ్రాన్‌ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసి గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న అతడికి ఎట్టకేలకు అవకాశం దక్కగా... తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 2, జాక్‌ లీచ్, కార్స్, పాట్స్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ (37 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), ఆఘా సల్మాన్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

బాబర్ స్థానంలో ఆడితే ఏంటి?
‘ఈ అవకాశం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... దాన్నే ఇక్కడ కూడా కొనసాగించా. బాబర్‌ ఆజమ్‌ ఓ దిగ్గజం. అతడి స్థానంలో ఆడుతున్నా అనే విషయం పక్కనపెట్టి కేవలం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. క్రీజులోకి వచ్చిన సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంది.

దీంతో ఆచితూచి ఆడాలనుకున్నా. దేశవాళీ అనుభవం బాగా పనికొచ్చింది’ అని కమ్రాన్‌ అన్నాడు. కాగా కమ్రాన్‌ గులామ్‌ ఇప్పటి వరకు 59 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 4377 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్‌ ఇస్తేనే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement