GT VS PBKS: నిస్వార్థమైన కెప్టెన్‌, సెంచరీ ముఖ్యం కాదన్నాడు: శ్రేయస్‌పై శశాంక్‌ ప్రశంసలు | IPL 2025, GT VS PBKS: Dont Worry About My Hundred,Shreyas Last Over Message To Shashank | Sakshi
Sakshi News home page

GT VS PBKS: నా సెంచరీ గురించి పట్టించుకోవద్దు.. శశాంక్‌కు శ్రేయస్ చివరి ఓవర్ సందేశం

Published Wed, Mar 26 2025 10:29 AM | Last Updated on Wed, Mar 26 2025 11:43 AM

IPL 2025, GT VS PBKS: Dont Worry About My Hundred,Shreyas Last Over Message To Shashank

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీని త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం శశాంక్‌ సింగ్‌కు స్ట్రయిక్‌ ఇచ్చి నిస్వార్దమైన కెప్టెన్‌ అనిపించుకున్నాడు. కెప్టెన్‌ త్యాగాన్ని శశాంక్‌ వృధా కానివ్వలేదు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ఫలితంగా పంజాబ్‌ భారీ స్కోర్‌ చేసింది. చివరి ఓవర్‌లో శశాంక్ చేసిన పరుగులే అంతిమంగా పంజాబ్‌ గెలుపుకు దోహదపడ్డాయి.

ఒకవేళ శ్రేయస్‌ జట్టు ప్రయోజనాలు పట్టించుకోకుండా సెంచరీనే ముఖ్యమనుకునే ఉంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓటమిపాలయ్యేది. ఎందుకంటే గుజరాత్‌, పంజాబ్‌ మధ్య పరుగుల తేడా కేవలం 11 పరుగులు మాత్రమే. శ్రేయస్‌ వ్యక్తిగత స్వార్దం చూసుకుని సెంచరీ కోసం ప్రయత్నించి ఉంటే చివరి ఓవర్‌లో మహా అయితే 10-15 పరుగులు వచ్చేవి. ఇదే జరిగి ఉంటే పంజాబ్‌ 230-235 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చేది. అప్పుడు గుజరాత్‌ సునాయాసంగా లక్ష్నాన్ని ఛేదించి ఉండేది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్‌ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్‌లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్‌ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్‌ కోసం పాకులాడలేదు. శశాంక్‌ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్‌ తీసుకోమన్నాడు. ​శశాంక్‌కు సైతం స్ట్రయిక్‌ రొటేట్‌ చేసే అవకాశం రాలేదు. భారీ షాట్టు ఆడే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్‌ స్ట్రయిక్‌ తీసుకుని (సింగిల్‌ తీసుంటే) ఉండవచ్చు.  కానీ అతను అలా చేయలేదు.

జట్టు ప్రయోజనాల కోసం​ సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శశాంక్‌ సింగ్‌ సైతం మ్యాచ్‌ అనంతరం తన కెప్టెన్‌ను కొనియాడాడు. 

శశాంక్‌ మాటల్లో.. టీ20ల్లో, ముఖ్యంగా ఐపీఎల్‌లో సెంచరీ చేసే అవకాశం అంత ఈజీగా రాదు. కానీ మా కెప్టెన్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. చివరి ఓవర్‌ మొత్తం నన్నే స్ట్రయిక్‌ తీసుకొని భారీ షాట్లు ఆడమన్నాడు. తన సెంచరీ గురించి ఆలోచించొద్దని చెప్పాడు. 

నేను స్వయంగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తానని చెప్పాను. కానీ అతను నాకు సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. ఇలా చెప్పాలంటే ఏ కెప్టెన్‌కు అయినా చాలా గట్స్‌ ఉండాలి. మా కెప్టెన్‌కు ఆ గట్స్‌ ఉన్నాయి. శ్రేయస్‌ నన్ను ప్రతి బంతిని సిక్సర్‌ లేదా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించమని చెప్పాడు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది. కెప్టెన్‌ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్‌తో నేను రెచ్చిపోయాను.

కాగా, శ్రేయస్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్‌), శశాంక్‌తో పాటు (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్‌), ప్రియాంశ్‌ ఆర్య  (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ 2, జన్సెన్‌, మ్యాక్స్‌వెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement