
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2025–2026 సీజన్‌కుగాను పన్నెండు మందితో కూడిన ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితాను ప్రకటించింది. భారత్‌కు చెందిన నితిన్ మేనన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా... మైకేల్ గాఫ్ (ఇంగ్లండ్), జోయల్ విల్సన్ (ట్రినిడాడ్) చోటు కోల్పోయారు.
మైకేల్ గాఫ్, జోయల్ విల్సన్ స్థానాల్లో అల్లావుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) తొలిసారి ఎలైట్ అంపైర్ల జాబితాలోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన 41 ఏళ్ల నితిన్ 23 ఏళ్లకే అంపైర్‌గా మారాడు. ఇప్పటి వరకు నితిన్ పురుషుల విభాగంలో 30 టెస్టులు, 60 వన్డేలు, 50 టి20 మ్యాచ్‌ల్లో... మహిళల విభాగంలో 20 టి20 మ్యాచ్‌ల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు.
ఇక భారత్‌కే చెందిన జయరామన్ మదనగోపాల్‌కు ఎమర్జింగ్ అంపైర్ల ప్యానెల్‌లోకి ప్రమోషన్ లభించింది. ‘ఎమర్జింగ్’ జాబితాలో ఉన్న వారికి విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా అంపైరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. తమిళనాడుకు చెందిన 50 ఏళ్ల జయరామన్ ఇప్పటి వరకు ఒక టెస్టు, 22 వన్డేలు, 42 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేశారు.
ఎలైట్ అంపైర్ల జాబితా
నితిన్ మేనన్ (భారత్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్), క్రిస్టోఫర్ గాఫ్నీ (న్యూజిలాండ్), ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా), రిచర్డ్ ఇలింగ్‌వర్త్ (ఇంగ్లండ్), ఎహసాన్ రజా (పాకిస్తాన్), పాల్ రీఫెల్ (ఆస్ట్రేలియా), షర్ఫుద్దౌలా షాహిద్ (బంగ్లాదేశ్), రాడ్నీ టకర్ (ఆ్రస్టేలియా), అల్లావుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్).
నిలకడగా తమీమ్ ఆరోగ్యం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) మ్యాచ్ ఆడుతున్న సమయంలో 36 ఏళ్ల తమీమ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలించగా... వైద్యులు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని... మరో 48 గంటలు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారు.
ఆ తర్వాత కూడా విశ్రాంతి అవసరమని వెల్లడించారు. ‘అతడి గుండె పనితీరు మెరుగ్గానే ఉంది. అయితే ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. తమీమ్ మా జాతీయ ఆస్తి. మరో రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచుతాం’ అని డాక్టర్ అబ్దుల్ వదూద్ అన్నారు.
ప్రస్తుతానికి విశ్రాంతి అవసరమని... ఎలాంటి అంశాలకైనా అతిగా స్పందించకూడదని సూచించాడు. మూడు నెలల తర్వాత తమీమ్ తిరిగి క్రికెట్ ఆడొచ్చని పేర్కొన్నారు. మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌కు తమీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం షినెపుకార్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా అస్వస్థతకు గురికాగా... వైద్య సిబ్బంది ఏంజియోప్లాస్టీ నిర్వహించారు.
క్లిష్ట సమయంలో అండగా నిలిచిన వారికి తమీమ్ ధన్యవాదాలు తెలిపాడు. ‘ఆ దేవుడి దయ, మీ అందరి ప్రార్థనలతో తిరిగి బతికాను. ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండటం నా అదృష్టం. తోటివాళ్లకు అండగా నిలవడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలి. అందరికీ ధన్యవాదాలు’ అని తమీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.