చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అంపైర్లు, మ్యాచ్ రిఫరీల వివరాలను ప్రకటించింది. మొత్తంగా పన్నెండు మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగం కానున్నట్లు వెల్లడించింది. అయితే, ఇందులో భారత్ నుంచి ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలుపొందిన పాకిస్తాన్ విజేతగా అవతరించింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఐసీసీ మళ్లీ ఈ వన్డే టోర్నీని ఇప్పటిదాకా నిర్వహించలేదు. తాజాగా మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడకు వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. ఈ క్రమంలో మ్యాచ్ అఫీషియల్స్‌లో భాగమైన అంపైర్ నితిన్ మీనన్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఇద్దరు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితిన్ మీనన్‌ను చాంపియన్స్ ట్రోఫీ రోస్టర్‌లో పెట్టాలని ఐసీసీ భావించింది. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన పాకిస్తాన్ పర్యటనకు నిరాకరించారు’’ అని పేర్కొన్నాయి.
ఇక జవగళ్ శ్రీనాథ్ కూడా సెలవులు తీసుకుంటున్న క్రమంలో పాక్ వెళ్లడం కుదరదని చెప్పినట్లు సమాచారం. కాగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ రిఫరీస్, అదే విధంగా ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నది వీళ్లిద్దరే.అయితే, ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నుంచి మాత్రం ఈ ఇద్దరూ దూరంగా ఉండటం గమనార్హం.
కాగా జవగళ్ శ్రీనాథ్ ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో ఇరుజట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌లకు శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ - దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం తలపడతాయి. ఇక క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో ఫిబ్రవరి 23న జరుగుతుంది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అంపైర్లు:
కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్ రిఫరీలు:
డేవిడ్ బూన్, రంజన్ మదుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్.
చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment