టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.
కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయింది. కేవలం రాజ్‌కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.
ఓపెనర్లుగా వారే
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు.
దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్‌స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.
ముగ్గురు సీమర్లతో
మరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఆడించనుంది.
మ్యాచ్ ఆరంభ సమయం ఇదే
ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్‌లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.
వరుస చేదు అనుభవాల తర్వాత
ఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్‌కు తొలుత టీ20 సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్‌మెంట్ చెప్పడం విశేషం.
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.
చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్!
Comments
Please login to add a commentAdd a comment