BCCI: రోహిత్‌ శర్మకు డెడ్‌లైన్‌?.. కోహ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్‌?! | Is Rohit Sharma To Quit After CT 2025 BCCI Drops Hint Kohli To Wait: Report | Sakshi
Sakshi News home page

ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్‌ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌!

Published Wed, Feb 5 2025 3:09 PM | Last Updated on Wed, Feb 5 2025 4:25 PM

Is Rohit Sharma To Quit After CT 2025 BCCI Drops Hint Kohli To Wait: Report

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం సమీపిస్తోందా?.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన తర్వాత అతడు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్‌-2024(T20 World Cup 2024)లో భారత్‌ను చాంపియన్‌గా హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న రోహిత్‌ శర్మ మునుపటిలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు 58, 64, 35. వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఈ మేర ఫర్వాలేదనిపించినా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.

కెప్టెన్‌గానూ చెత్త రికార్డు
తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తేలిపోయిన రోహిత్‌ శర్మ.. కెప్టెన్‌గానూ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో భారత్‌ కివీస్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా స్వదేశంలో ప్రత్యర్థి చేతిలో ఇంతటి పరాభవం చవిచూసిన తొలి భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

అనంతరం ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లోనూ రోహిత్‌ శర్మ వైఫల్యం కొనసాగింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఫామ్‌లేమి కారణంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి స్వయంగా తప్పుకొన్నాడు. ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-1తో ఓడిపోయింది.

రోహిత్‌ శర్మకు డెడ్‌లైన్‌
ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో తాను రిటైర్‌ కాబోనని ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ స్పష్టం చేశాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) రోహిత్‌ శర్మకు డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత అతడి అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం.

రోహిత్‌ శర్మ వయసుతో పాటు.. 2027 వన్డే వరల్డ్‌కప్‌ నాటికి జట్టును సన్నద్ధం చేసే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేర అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌తో వన్డేలు, చాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసిన సమయంలో సెలక్టర్లు, బోర్డు పెద్దలు రోహిత్‌ శర్మతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన తర్వాత భవిష్యత్‌ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. రానున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ సీజన్‌కు.. అదే విధంగా వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి జట్టును సిద్ధం చేసే విషయంలో యాజమాన్యానికి కొన్ని స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.

కోహ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్‌?!
కాబట్టి ఇప్పటి నుంచే జట్టు పరివర్తనపై దృష్టి పెట్టింది. అన్నీ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని పేర్కొన్నాయి. అయితే, మరో దిగ్గజ బ్యాటర్‌, 36 ఏళ్ల విరాట్‌ కోహ్లి విషయంలో మాత్రం బీసీసీఐ మరికొన్నాళ్ల పాటు వేచిచూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డేతో సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ మొదలుకానుంది. అంతకుముందు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. 

చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement