చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు | SA20 2025: Rashid Khan Became T20 Cricket Highest Wicket Taker | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు

Published Wed, Feb 5 2025 8:55 AM | Last Updated on Wed, Feb 5 2025 9:00 AM

SA20 2025: Rashid Khan Became T20 Cricket Highest Wicket Taker

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్‌ మరియు ఫ్రాంచైజీ క్రికెట్‌) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్‌ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో (SA20) భాగంగా పార్ల్‌ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో రషీద్‌ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్‌.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్‌) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చాడు.

26 ఏళ్ల రషీద్‌ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా..   అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్‌ ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్‌లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ సహా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌, అడిలైడ్‌ స్ట్రయికర్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌, ఎంఐ ఎమిరేట్స్‌, లాహోర్‌ ఖలందర్స్‌, ససెక్స్‌ షార్క్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు..
రషీద్‌ ఖాన్‌-633
డ్వేన్‌ బ్రావో-631
సునీల్‌ నరైన్‌-574
ఇమ్రాన్‌ తాహిర్‌-531
షకీబ్‌ అల్‌ హసన్‌-492

కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ తొలిసారి ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ పార్ల్‌ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.  

రాణించిన బ్రెవిస్‌, రికెల్టన్‌
ఈ మ్యాచ్‌లో ఎంఐ చేసిన స్కోర్‌.. ఈ సీజన్‌లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్‌. ఎంఐ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్‌ డర్‌ డస్సెన్‌ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్‌ బ్రెవిస్‌ (30 బంతుల్లో 44 నాటౌట్‌; 4 సిక్సర్లు), జార్జ్‌ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్‌గెటర్‌ (17 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. రాయల్స్‌ బౌలర్లలో దునిత్‌ వెల్లలగే 2, ఫోర్టుయిన్‌, డేవిడ్‌ గేలియమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

తలో చేయి వేసిన బౌలర్లు
200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్‌ బౌల్ట్‌, కగిసో రబాడ, కార్బిన్‌ బాష్‌, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్‌ లిండే ఓ వికెట్‌ పడగొట్టి రాయల్స్‌ పతనాన్ని శాశించారు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మిల్లర్‌ (45) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్‌ కార్తీక్‌ (31) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు.

ఓడినా మరో ఛాన్స్‌
ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌ చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంది.  రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్‌-2లో రాయల్స్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌.. జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్‌ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్‌ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement