సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. "గాడ్ ఆఫ్ క్రికెట్"గా పేరుగాంచిన సచిన్.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 34,000 పైచిలుకు పరుగులు, 200 టెస్టులు ఆడిన మొదటి ఆటగాడిగా, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా ఎన్నో చెక్కు చెరగని రికార్డులను మాస్టర్ బ్లాస్టర్ తన పేరిట లిఖించుకున్నాడు.
దాదాపు 24 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన సచిన్.. 2013లో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే సచిన్ రిటైర్మెంట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టెండూల్కర్ రిటైర్మెంట్‌కు ఏడాది ముందే అతని స్ధానాన్ని మరొకరితో భర్తీ చేయాలని బీసీసీఐ భావించిందంట.
ఈ విషయాన్ని అప్పటి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2012లో సచిన్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో జరిగిన ఓ సంభాషణను అతడు గుర్తు చేసుకున్నాడు.
"సచిన్‌ను మీ తదుపరి ప్రణాళికలు ఏంటి? అని అడిగాను. దీంతో అతడు ఎందుకు అలా అడుగుతున్నారు? ఆశ్చర్యపోయాడు. అందుకు బదులుగా మీ స్ధానంలో మరొకరికి అవకాశమివ్వాలని సెలెక్షన్ కమిటీ భావిస్తుందని నేను సూటిగా చెప్పాను. వెంటనే సచిన్ షాక్‌కు గురువుతూ.. మీరు సీరియస్‌గానే చెబుతున్నారా?" అని తిరిగి నన్ను అడిగాడని విక్కీ లాల్వానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాటిల్ పేర్కొన్నాడు. అదేవిధంగా సెలెక్టర్లు ఒక ఆటగాడిని జట్టు నుంచి పక్కన పెట్టగలరే తప్ప, రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేయలేరని పాటిల్ స్పష్టం చేశాడు.
సచిన్ తనంతట తానే..
"సచిన్‌ను తన ప్లాన్స్ అడిగాము, అందుకు ఆయన కొనసాగుతా అని చెప్పాడు. అందుకు మేము అంగీకరించాము. చివరికి సచినే స్వయంగా ఫోన్ చేసి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మాకు తెలిపాడు" అని పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా 2013లో సచిన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో 19 మ్యాచ్‌లు ఆడిన కేవలం ఒకే ఒక సెంచరీ చేశాడు.
చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం'


