Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు.
అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.
వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌కు కూడా దూరంగా ఉన్నాడు.
ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్‌ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌కు 2-0తో కోల్పోయింది.


