Jayaraman
-
‘అనన్య’ అద్భుత విజయం సాధించాలి
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రి రిలీజ్ వేడుకను హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్, యువ కథానాయకుడు సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకనిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్ తోపాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "అనన్య" అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిధులు అభిలషించారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న "అనన్య" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. -
చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...
సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు. అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జయ తండ్రిని ఆయన భార్యే చంపేసింది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నపుడే కాదు మరణించిన తరువాత కూడా ఆమె జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. జయ తండ్రి జయరామన్ ఆయన భార్య సంధ్య చేతిలోనే హత్యకు గురయ్యాడనే సంచలన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. జయ తండ్రిది హత్యే! వివాదాస్పదంగా మారిన జయ జీవితంపై బెంగళూరులో నివసిస్తున్న ఆమె అత్త లలిత ఇటీవల తమిళ చానల్ సన్న్యూస్తో మాట్లాడారు. జయకు ఒక ఆడశిశువు జన్మించిన మాట వాస్తవమేనని, తన పెద్దమ్మే ఆమెకు పురుడుపోసిందని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ప్రమాణం చేయించుకున్నారన్నారు. అయితే, సదరు అమృతనే ఆమె కుమార్తె అని చెప్పడానికి తన వద్ద ఆధారమేదీ లేదన్నారు. జయ తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావటంతో దూరంగా ఉంచారని, అతనికి తల్లి సంధ్యే విషమిచ్చి చంపినట్లు లలిత ఆరోపించారు. జయ ఈగోను భరించలేక, జయరామన్ హత్య వంటి సంఘటనలతో తామంతా దూరంగా వెళ్లిపోయామన్నారు. జయలలిత తండ్రి జయరామన్, సంధ్య దంపతులకు జయలలిత, జయకుమార్ సంతానం. స్వతహాగా సినీ నటి అయిన సంధ్య జయలలితను సైతం వెండితెర వైపునకు ప్రోత్సహించింది. ఆమె ఉన్నతిలో తల్లి సంధ్య ముఖ్య పాత్ర పోషించింది. జయలలిత ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైంది గోప్యంగా సాగిన ఆమె వ్యక్తిగత జీవితం. అజ్ఞాతంలో అమృత: శోభన్‌బాబుతో జయ సహజీవనం చేశారని వారికి కుమార్తె కూడా ఉందనే ప్రచారం జయ మరణం తరువాత జోరందుకుంది. ఇద్దరు యువతులు, ఒక యువకుడు తాము జయ సంతానం అంటూ చెప్పుకోవడం ప్రారంభించారు. కోర్టు కొరడా ఝుళిపించడంతో ఇద్దరు వెనక్కి తగ్గగా బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి మాత్రం..సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధం అని, జయ భౌతిక కాయాన్ని సమాధి నుంచి బయటకు తీసి పరీక్షలు జరపండంటూ సవాల్ చేశారు. అయితే, ముందుగా రాష్ట్రస్థాయిలో పరిష్కరించు కోవాలంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైన తరుణంలో తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నట్లు అమృత తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమృత అజ్ఞాతంలోకి వెళ్లారని, త్వరలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేస్తారని సమాచారం. -
రజనీ తరపున ఆశీస్సులందిస్తున్నా!
రజనీకాంత్‌తో పలు చిత్రాలు చేశాను. ఆయన సహాయకుడి జయరామన్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన నిర్మాతగా మారడం సంతోషం. యనకు, సహ నిర్మాతలకు నాతోపాటు రజనీకాంత్ తరపున కూడా శుభాశీస్సులు అందిస్తున్నానని సీనియర్ దర్శకుడు ఎస్పి.ముత్తురామన్ పేర్కొన్నారు. కే జయరామన్, ఎల్ పృథ్వీరాజ్, ఎస్ రాజేంద్రన్, రజనీ జయరామన్ సంయుక్తంగా జేపి ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం క్రిమి. మదయానై కూటం చిత్రం ఫేమ్ కదిర్, రేష్మీమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనుచరణ్ దర్శకుడు. కాక్కముట్టై చిత్ర దర్శకుడు మణికంఠన్ కథను అందించిన సంగీత దర్శకుడు కే సంగీత బాణీలు కట్టారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఆవిష్కరించి తొలి సీడీని నటుడు విజయ్‌సేతుపతికి అందించారు. ఎస్పీ ముత్తురామన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్ థాను, నక్కిరన్ గోపాల్, పీఎల్ తేనప్పన్, కదిరేశన్, కాక్కముట్టై చిత్ర దర్శకుడు మణికంఠన్, చిత్ర హీరోహీరోయిన్లు కదిర్, రేష్మీమీనన్ పాల్గొన్నారు. -
కేంద్రానికి హైకోర్టులో చుక్కెదురు
టెక్ మహీంద్ర వ్యవహారంలో అప్పీళ్లు కొట్టివేత రూ.10వేల జరిమానా విధింపు ఇలాగైతే పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం తప్పదు సీఎల్బీ సభ్యుని తీరుపై హైకోర్టు మండిపాటు అతని తీరుపై కన్నేసుంచాలని కేంద్రానికి ఆదేశం హైదరాబాద్: టెక్ మహీంద్ర వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెక్ మహీంద్ర, ఆ కంపెనీ సెక్రటరీ జయరామన్లపై వచ్చిన నేరారోపణలను మాఫీ(కాంపౌండ్) చేస్తూ చెన్నై కంపెనీ లా బోర్డు(సీఎల్బీ) ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ డెరైక్టర్ డి.ఎ. సంపత్ దాఖలు చేసిన కంపెనీ అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఒక్కో అప్పీల్‌కు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ కేసులో కంపెనీ లా బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును సైతం న్యాయమూర్తి తప్పుపట్టారు. టెక్ మహీంద్ర, ఆ కంపెనీ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలను మాఫీ (కాంపౌండ్) చేసే సమయంలో హైకోర్టు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, మాఫీ ఉత్తర్వులు జారీ చేయడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. అలాచేయకపోతే ప్రజల్లో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. చెన్నై కంపెనీ లా బోర్డు కార్యకలాపాలు సవ్యంగా సాగేందుకు ఆ సభ్యుని పనితీరుపై ఓ కన్నేసి ఉంచడం మంచిదని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శిని కూడా జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదేశించారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో టెక్ మహీంద్రకు, జయరామన్‌కు సంబంధం లేదని తెలిసినా కేంద్రం అనవసరంగా ఈ అప్పీళ్లను దాఖలు చేసిందని, ఈ వైఖరి ఎంత మాత్రం సరికాదన్నారు. ఇటువంటి వైఖరి వల్ల సత్యం కంప్యూటర్స్లా ఇబ్బందుల్లో కూరుకుపోయిన కంపెనీలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తారన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిని సీబీఐ కూడా ధ్రువీకరించినందున, తమపై మోపిన ఆరోపణలను మాఫీ చేయాలంటూ టెక్ మహీంద్ర, జయరామన్‌లు 2011లో చెన్నై కంపెనీ లా బోర్డులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కంపెనీ లా బోర్డు ఇందుకు అంగీకరించకుండా వారి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, తిరిగి ఈ వ్యాజ్యాలను కంపెనీ లా బోర్డుకు నివేదించి, నేరారోపణలను మాఫీ చేయాలా? వద్దా? అన్న విషయంపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కారణాలు వివరిస్తూ ఉత్తర్వులివ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కంపెనీ లా బోర్డు విచారణ జరిపి, నేరారోపణలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.