కేంద్రానికి హైకోర్టులో చుక్కెదురు
టెక్ మహీంద్ర వ్యవహారంలో అప్పీళ్లు కొట్టివేత
రూ.10వేల జరిమానా విధింపు
ఇలాగైతే పారిశ్రామికవేత్తలకు
నిరుత్సాహం తప్పదు
సీఎల్‌బీ సభ్యుని తీరుపై హైకోర్టు మండిపాటు
అతని తీరుపై కన్నేసుంచాలని కేంద్రానికి ఆదేశం
హైదరాబాద్: టెక్ మహీంద్ర వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టెక్ మహీంద్ర, ఆ కంపెనీ సెక్రటరీ జయరామన్‌లపై వచ్చిన నేరారోపణలను మాఫీ(కాంపౌండ్) చేస్తూ చెన్నై కంపెనీ లా బోర్డు(సీఎల్‌బీ) ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ డెరైక్టర్ డి.ఎ. సంపత్ దాఖలు చేసిన కంపెనీ అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఒక్కో అప్పీల్‌కు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ కేసులో కంపెనీ లా బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును సైతం న్యాయమూర్తి తప్పుపట్టారు. టెక్ మహీంద్ర, ఆ కంపెనీ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలను మాఫీ (కాంపౌండ్) చేసే సమయంలో హైకోర్టు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, మాఫీ ఉత్తర్వులు జారీ చేయడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. అలాచేయకపోతే ప్రజల్లో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. చెన్నై కంపెనీ లా బోర్డు కార్యకలాపాలు సవ్యంగా సాగేందుకు ఆ సభ్యుని పనితీరుపై ఓ కన్నేసి ఉంచడం మంచిదని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శిని కూడా జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదేశించారు.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో టెక్ మహీంద్రకు, జయరామన్‌కు సంబంధం లేదని తెలిసినా కేంద్రం అనవసరంగా ఈ అప్పీళ్లను దాఖలు చేసిందని, ఈ వైఖరి ఎంత మాత్రం సరికాదన్నారు. ఇటువంటి వైఖరి వల్ల సత్యం కంప్యూటర్స్‌లా ఇబ్బందుల్లో కూరుకుపోయిన కంపెనీలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తారన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిని సీబీఐ కూడా ధ్రువీకరించినందున, తమపై మోపిన ఆరోపణలను మాఫీ చేయాలంటూ టెక్ మహీంద్ర, జయరామన్‌లు 2011లో చెన్నై కంపెనీ లా బోర్డులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కంపెనీ లా బోర్డు ఇందుకు అంగీకరించకుండా వారి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, తిరిగి ఈ వ్యాజ్యాలను కంపెనీ లా బోర్డుకు నివేదించి, నేరారోపణలను మాఫీ చేయాలా? వద్దా? అన్న విషయంపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కారణాలు వివరిస్తూ ఉత్తర్వులివ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కంపెనీ లా బోర్డు విచారణ జరిపి, నేరారోపణలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.