సమావేశంలో మాట్లాడుతున్న ఐవైఆర్. చిత్రంలో వి. లక్ష్మణరెడ్డి, జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులంతా రాజీనామాలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా చేయాలని ప్రముఖులు పిలుపిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది పార్లమెంటు సభ్యులు రాజకీయాలకు అతీతంగా రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరగడంవల్ల కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తుంది’అని ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన, అధికార వికేంద్రీకరణ ప్రాధాన్యాలపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డు జడ్జి పి.లక్ష్మణరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అభివృద్ధి కేంద్రీకరణకు స్వస్తి చెప్పి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. కోస్తాంధ్రలో రాజధాని ఏర్పాటు చేసినందు న శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం రాయల సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రత్యేక హోదాకు చట్ట సవరణ అవసరం లేదు
ఏపీకి అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది. గతంలో పలు రాష్టాలకు కేబినెట్ తీర్మానాలతోనే ప్రత్యేక హోదా ఇచ్చారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్ట సవరణ అవసరం లేదు. రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అన్ని విధాలా వెనుకబడి ఉన్నాయి. వీటికైనా స్పెషల్ స్టేటస్ ఇచ్చి అభివృద్ధికి కేంద్రం సహకరించాలి.
– జస్టిస్ లక్ష్మణరెడ్డి
అభివృద్ధి కేంద్రీకరణ సరికాదు
గత నాలుగేళ్లుగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టినందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి తీరాల్సిందే. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం ఆ ప్రాంత న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాం. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, రాజధాని మరో చోట ఉన్నాయి.
– ఐవైఆర్ కృష్ణారావు
కొత్తవి అడగడం లేదు
పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రకటించిన హామీలు, చట్టంలోని అంశాలు అమలు చేయాలని మాత్రమే మనం కోరుతున్నాం. కొత్తవి ఏమీ కోరడంలేదు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన వైఖరిని ప్రకటించాలి. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమాలన్నింటినీ బలపరచాలని మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం పోరాడే రాజకీయ పార్టీలకు జన చైతన్య వేదిక మద్దతు ఉంటుంది.
– వి.లక్ష్మణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment