
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి రూ.350 కోట్ల నిధులు మంజూరు చేసి తిరిగి వెనక్కి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ శనివారం ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి,కొణతాల రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ రిట్ పిటషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం వుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోరుతూ రామకృష్ట పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అలాంటి ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన భాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉందని పిటిషన్‌లో తెలిపారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక సదుపాయాల కింద 2-9-18న జిల్లాకి రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు 350 కోట్లు కేటాయించి వెనక్కు తీసుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేసి వెనక్కు తీసుకునే హక్కు ఎవరికి లేదని అన్నారు. గతమూడు ఆర్థిక సంవత్సరాల్లో వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.1050 కోట్లు కేటాయిస్తే దానిలో రూ.946 కోట్లు మాత్రమే వినియోగించారని పిటిషన్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment