కంచే చేను మేస్తోంది.. | EAS Sharma comments on government officials | Sakshi
Sakshi News home page

కంచే చేను మేస్తోంది..

Published Wed, Sep 20 2017 2:34 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

కంచే చేను మేస్తోంది.. - Sakshi

కంచే చేను మేస్తోంది..

- ‘కృష్ణా’ను ఆక్రమించిన ప్రభుత్వ పెద్దలను శిక్షించాల్సిందే
రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ 
 
సాక్షి, అమరావతి: చట్టం ముందు అందరూ సమానమేనని, నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను శిక్షించాల్సిందేనని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, కేంద్ర విశ్రాంత కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ అన్నారు. కృష్ణా నది గట్లను ఆక్రమించి నిర్మించిన భవనాలను ఎందుకు కూల్చివేయరంటూ 57 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా నది తీరంలో నిర్మించిన అక్రమ కట్టడంలో బస చేస్తున్నారన్న వార్తలపై జూలై 18న రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ రాశాను.

నదీ తీర ప్రాంతంలో అలాంటి కట్టడాలు నిర్మించడం రివర్‌ కన్జర్వెన్సీ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అక్కడ అమలులో ఉన్న అర్బన్‌ డెవలప్‌మెంట్‌ వ్యవస్థ మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధం. ప్రభుత్వంలో పెద్దలే చట్టాలను అధిగమిస్తే.. కంచే చేను మేసినట్టవుతుంది. అలాంటప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద, చట్టాల మీద నమ్మకం తగ్గుతుంది. ఈ దృష్ట్యా ఎంత పెద్దవారైనా ఎలాంటి సడలింపు ఇవ్వకూడదు. అందరినీ ఒకేలా శిక్షించాలి.

ఈ విషయం హైకోర్టు దృష్టికి రావడం చాలా మంచిదైంది. ఎన్ని లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వ అధికారులు కనీసం కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. చట్టాలను ఇంతవరకు అమలు చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వ పెద్దలను కూడా చట్ట ప్రకారం శిక్షిస్తారని ఆశిస్తున్నాను. ఓ వైపు ఈ తతంగం జరుగుతుంటే మరో వైపు నదుల పరిరక్షణ, జలహారతులివ్వండంటూ ప్రభుత్వ పెద్దలు ప్రజలకు హితబోధ చేయడం హాస్యాస్పదం’ అన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement