- విచారణకు స్వీకరణ
- కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలై న పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ఆదేశించారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయక పోవడం వివక్ష చూపడమేనని, అందువల్ల ఎస్సీ వర్గీకరణకు 2008లో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, 1999లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్‌లు ఇచ్చిన నివేదికలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమితి సంయుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళ వారం విచారణ జరిపారు. పిటిషనర్‌ల తరఫు న్యాయవాది అశోక్ అనందకుమార్ వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం సెక్షన్ 3(4) కింద కమిషన్ నివేదికలు సమర్పించిన 6 నెలల్లోపు వాటిని పార్లమెంట్ ఉభయ సభల ముందుం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నివేదికను అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించా రు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అవసరమని, జస్టిస్ ఉషా మెహ్రా, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ల నివేదికలను అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివా దులుగా ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.