EAS Sharma
-
‘సీఎం వైఎస్ జగన్ ఆలోచన అభినందనీయం’
సాక్షి, విశాఖ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సూచనలు ఆహ్వానించదగినవని రిటైర్డ్ ఐఏఎస్ ఈఎఎస్ శర్మ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ నివేదిక అమలు అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అసమానతలు తొలగాలంటే రాజధాని పేరుతో ఒక్కచోటే అభివృద్ధి చేయకూడదని శర్మ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర, దక్షిణ, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కమిటీ సూచనలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కమిటీ సూచనలు అమలైతే పాలన చేరువ అవుతుందనే భావన ప్రజల్లోకి వస్తుందన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండటం మంచిదే అని అన్నారు. ‘గత ప్రభుత్వం అమరావతిలోనే అభివృద్ధి చేయాలని చూసి తప్పు చేసింది. అయితే జీఎన్ రావు కమిటీ నివేదికపై ప్రజల్లో చర్చ జరగాలి. గ్రామస్థాయి వరకూ పరిపాలన చేరువ అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. విశాఖలో తక్కువ ఖర్చుతోనే రాజధానిని అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వంలో అమరావతి పేరుతో భారీగా అవకతవకలు జరిగాయి. అందుకే మేము మొదటి నుంచి వ్యతిరేకించాం. అలాగే విశాఖలో నీటి సమస్యను అధిగమించాలి’ అని శర్మ పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
సీఎస్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు గర్హనీయం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఈసీకి లేఖ రాశారు. చంద్రబాబు.. ఎల్వీని సహ నిందితుడిగా, కోవర్టుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం పునేఠాను తప్పించి ఎల్వీని సీఎస్‌గా నియమించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీపై చేసినట్టుగానే భావించాలన్నారు. సీఎం వ్యాఖ్యలతో ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఐఏఎస్‌ల ప్రతిష్టకు భంగం కలిగిందని లేఖలో పేర్కొన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్– 324 ప్రకారం ఈసీకి సంక్రమించిన అధికా రాలను అవహేళన చేసిన ట్టేనన్నారు. ఎన్నికల సంఘం అధికారాలను అంగీకరించనట్టయితే భవిç ష్యత్తులో చట్టబద్ధంగా ఈసీ తీసుకునే నిర్ణయాలను రాజకీయ నేతలు, పార్టీలు ఇష్టపడరని వివరించారు. ఎన్నికల వేళ ఈసీ నిర్ణయాలు, ఆదేశాలను పదేపదే వ్యతిరేకించే అవకాశమూ ఉంటుందన్నారు. ఈసీ ఆదేశాలను పాటించిన ప్రభుత్వోద్యోగులు చంద్రబా బులాంటి వారి చేతుల్లో బాధితులయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈసీ తక్షణమే బాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని శర్మ తన లేఖలో కోరారు. -
‘చంద్రబాబుపై క్రిమినల్ కేసు, దావా వేయాలి’
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎన్నికల సంఘం తక్షణమే కేసు పెట్టాలని, క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమించిన అధికారిని కోవర్ట్ అంటారా అని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అధికారులంతా చెప్పుచేతల్లో ఉండాలన్నది చంద్రబాబు భావనలా ఉందన్నారు. రాజ్యాంగం ఈసీకి ఇచ్చిన హక్కును చంద్రబాబు ఎలా తప్పుబడతారంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలన్నారు. -
అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించాలి
-
ప్రజాస్వామ్యం అపహాస్యం
‘‘పాలకులు గడచిన ఐదేళ్లలో ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ.. మ«భ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం అభ్యంతరకరమైన విషయం. ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా ఇతర పథకాలకు ఎన్నికల కోసం నగదును బదిలీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే’’ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఇంధన శాఖ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ వ్యాఖ్యానించారు. విశాఖలో ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... నిష్పాక్షిక ఎన్నికలే శ్రీరామరక్ష జాతీయ ఎన్నికల కమిషన్ (ఈసీఐ) పార్లమెంట్, శాసన సభలకు నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి. ఓటర్ల జాబితాలో అర్హులైన అందరు ఓటర్ల పేర్లను, ముఖ్యంగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువ ఓటర్ల పేర్లను చేర్చటం, ఎన్నికల్లో మతపరమైన ప్రచారాలు లేకుండా చూడటం, డబ్బుతో ఓట్లను కొనే రాజకీయాలను నియంత్రించడం వంటి బాధ్యతలు ఉన్నాయి. ఏపీలో సుమారు 12 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నా.. వారి రిజిస్ట్రేషన్ నత్తనడకన సాగుతోంది. ఎన్నికలపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకుండా కఠినమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి. సమాచార చోరులపై కఠిన చర్యలు తీసుకోవాలి ‘ఆధార్ కార్డు వివరాలను, ఓటర్ల జాబితాలను కొన్ని రాజకీయ పార్టీలు అనధికారికంగా సేకరించి, ఫామ్–7 ముసుగులో దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపణలున్నాయి. సమాచార చౌర్యం చేసిన వాళ్లు ఎంతటి పెద్ద మనుషులైనా దోషులుగా పరిగణించాలి. ఎన్నికల చట్టాల కింద, ఐటీ చట్టాల కింద, ఐపీసీ చట్టం కింద ఆయా వ్యక్తులు, పార్టీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ ఏపీ ఐటీ సలహాదారుకు ‘ఆధార్’ చైర్మన్ పదవా! ‘ఏపీ ప్రభుత్వానికీ ఐటీ సలహాదారుగా పని చేస్తున్న వ్యక్తే ఆధార్ కార్డుల వ్యవస్థను పర్యవేక్షించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అధ్యక్షునిగా ఉన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు పదవులు ఎలా నిర్వర్తిస్తారు. ప్రజల వ్యక్తిగత సమాచారం (డేటా) చౌర్యంపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమే కదా. పైగా సదరు అధికారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాభం పొందడం తీవ్ర అభ్యంతరకరం. ఇటీవల సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో సుమారు 15 మంది ఐఏఎస్‌లకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టారు. ఎందుకిలా ఇచ్చారు, రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నది ఐఏఎస్‌లకు ఇచ్చేందుకా. ఎంత దారుణం. ఉచితంగా భూములు పొందిన వారిలో యూఐడీఏఐ చైర్మన్ కూడా ఉన్నారు. ప్రభుత్వం అలా స్థలాలు ఉచితంగా ఇవ్వడమంటే.. దానిని లంచగొండితనంగానే భావించాలి. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ఐటీ సెక్రటరీకి లేఖ రాశాను. ఏపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా సేవలందిస్తున్న వ్యక్తికి యూఐడీఏఐ చైర్మన్ పదవి ఇవ్వడమే తప్పు. ఆధార్‌పై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. ఆధార్ ద్వారా డేటా చోరీ అవుతోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఉచితంగా భూములు కట్టబెడితే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని ఆ లేఖలో పేర్కొన్నాను’ విదేశీ విరాళాలు ఆక్షేపణీయం రాజకీయ పార్టీలు విదేశీ ప్రైవేటు కంపెనీల నుంచి విరాళాలు తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరం, ఆక్షేపణీయం. కంపెనీల నియంత్రణ చట్టాన్ని సవరించి మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. విదేశీ విరాళాలు మాత్రం తీసుకోకూడదని.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో నిబంధన విధించింది. అయినప్పటికీ జాతీయ స్థాయి పార్టీలు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. చట్ట ఉల్లంఘన చేసిన పార్టీలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చాయి. అయినా పాలకులు లెక్క చేయకుండా ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని సవరణ చేయడం దారుణం.. పార్టీలు విదేశీ కంపెనీల నుంచి విరాళాల కోసం చట్టాలనే సవరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమే. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు జవాబుదారీ తనంతో వ్యవహరించాలి. – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
హెరిటేజ్ భూముల బాగోతంపై విచారణ జరిపించండి: ఈఏస్ శర్మ
సాక్షి, అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరీష్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. రాజధాని ఎంపికకు ముందే అదే ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ భూములు కొనడం వెనుక భారీ అవినీతి ఉందని శర్మ చెప్పారు. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
అక్రమాలు అడ్డుకున్నారని భన్వర్‌లాల్‌పై కక్ష
సాక్షి, విశాఖపట్నం: పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో భన్వర్‌లాల్ తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలను నియంత్రించారని, అందువల్లే ఆయనపై సర్కారు కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన రోజే ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు శర్మ.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకే జ్యోతికి గురువారం లేఖ రాశారు. భన్వర్‌లాల్ వ్యవహారంలో సీఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో రాష్ట్రాల ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేరని, తద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి మించి వ్యయం చేశారని, దీనిపై కూడా ఎన్నికల కమిషన్ చట్టపరంగా వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఇలా ఎన్నికల అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం, వారిపై వేధింపులకు దిగడం ఇదే తొలిసారి కాదన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని శర్మ కోరారు. -
‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’
-
‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతికి లేఖ రాశారు. నంద్యాల ఉప ఎన్నికలో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకే భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష గట్టిందని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బు పంపిణీ అక్రమాలను కూడా భన్వర్‌లాల్ అడ్డుకున్నారని లేఖలో శర్మ చెప్పారు. అందుకే ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని తెలిపారు. భన్వర్‌లాల్ లాంటి నిజాయితీ గల అధికారులను కాపాడేందుకు ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో బిహార్‌లో ఇలాగే జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుందని గుర్తు చేశారు. -
కంచే చేను మేస్తోంది..
- ‘కృష్ణా’ను ఆక్రమించిన ప్రభుత్వ పెద్దలను శిక్షించాల్సిందే - రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ సాక్షి, అమరావతి: చట్టం ముందు అందరూ సమానమేనని, నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను శిక్షించాల్సిందేనని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర విశ్రాంత కార్యదర్శి ఈఏఎస్ శర్మ అన్నారు. కృష్ణా నది గట్లను ఆక్రమించి నిర్మించిన భవనాలను ఎందుకు కూల్చివేయరంటూ 57 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా నది తీరంలో నిర్మించిన అక్రమ కట్టడంలో బస చేస్తున్నారన్న వార్తలపై జూలై 18న రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ రాశాను. నదీ తీర ప్రాంతంలో అలాంటి కట్టడాలు నిర్మించడం రివర్ కన్జర్వెన్సీ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అక్కడ అమలులో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ వ్యవస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధం. ప్రభుత్వంలో పెద్దలే చట్టాలను అధిగమిస్తే.. కంచే చేను మేసినట్టవుతుంది. అలాంటప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద, చట్టాల మీద నమ్మకం తగ్గుతుంది. ఈ దృష్ట్యా ఎంత పెద్దవారైనా ఎలాంటి సడలింపు ఇవ్వకూడదు. అందరినీ ఒకేలా శిక్షించాలి. ఈ విషయం హైకోర్టు దృష్టికి రావడం చాలా మంచిదైంది. ఎన్ని లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వ అధికారులు కనీసం కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. చట్టాలను ఇంతవరకు అమలు చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వ పెద్దలను కూడా చట్ట ప్రకారం శిక్షిస్తారని ఆశిస్తున్నాను. ఓ వైపు ఈ తతంగం జరుగుతుంటే మరో వైపు నదుల పరిరక్షణ, జలహారతులివ్వండంటూ ప్రభుత్వ పెద్దలు ప్రజలకు హితబోధ చేయడం హాస్యాస్పదం’ అన్నారు. -
పోలవరం కాంట్రాక్టర్లకు వరం
వాస్తవానికి నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమాలు సాగించడానికి అవకాశం కల్పించాయి. ఇదంతా చూస్తే ఈ ప్రాజెక్టు మీద ప్రజాధనాన్ని అక్రమంగా వ్యయం చేయడానికి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా రాష్ట్రంతో కేంద్రం కుమ్మక్కయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల గురించి ఎవరూ ప్రశ్నించలేదు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని తెలిసినా మూడు రాష్ట్రాలలో గిరిజనులను ఎందుకు నిరాశ్రయులను చేసినట్టు? బహుళ ప్రయోజనాలను ఆశించి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? విభజన తరువాత అనేక సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టును 2019 సంవత్సరానికే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కోస్తాంధ్రకు జలధారగా ప్రజానీకం భావిస్తున్న ఈ ప్రాజెక్టు చంద్రబాబు హామీ మేరకు నిజంగానే పూర్తవుతుందా? జరుగుతున్న పరిణామాలు, నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలు ఈ ప్రశ్నకు బలం చేకూరుస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల కలవరం కలిగిస్తున్నది. చాలా చట్ట వ్యతిరేక అంశాలు కనిపిస్తున్నాయి. ఇవి నేను గతంలో వివరించిన వాటికి అదనం. కొన్ని వారాలుగా పత్రికలలో ఇందుకు సంబంధించి వార్తలు వచ్చాయి. కలవరపెడుతున్న కొత్త నిర్ణయాలు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామన్న హామీతో ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న కాంట్రాక్టు నుంచి(ఈపీసీ) ఆ సంస్థను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మొదట్లో మధుకాన్/బీఎస్పీసీఎల్ ఈ పనులు చూసింది. 2013లో పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్‌గా ట్రాన్స్ట్రాయ్ రంగంలో దిగింది. ఈ ఆగస్ట్ మధ్యలో రాష్ట్రానికి వచ్చిన నీటిపారుదల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పురోగతిని గురించి చర్చించారు. నిర్మాణ వ్యయం రూ. 50,000 కోట్లు పెరి గిందని చెప్పి ఆయన స్థాయీ సంఘానికి వెల్లడించారు. ఇంతవరకు దీని మీద రూ. 12,000 కోట్లు ఖర్చు చేసిన సంగతిని కూడా తెలియచెప్పారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని కూడా కోరారు. నిర్మాణం పనుల పురోగతిని పరి శీలించడానికి స్వయంగా తానే పద్దెనిమిది పర్యాయాలు వెళ్లానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో జాప్యాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతోంది. ఇందులో మొదటి చర్యగా– స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, కాఫర్ డ్యాం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యాంలను సకాలంలో పూర్తి చేయడానికి తాజా టెండర్లు పిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెడితేగానీ తాజాగా టెండర్లు పిలవడానికి అవకాశం లేదు కూడా. ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకోవడానికి చెబుతున్న కారణం– నిర్మాణం పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన లక్ష్యంలో 27 శాతం మాత్రమే ట్రాన్స్ట్రాయ్ చేరుకోగలిగిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ ఇంతవరకు చాలా విరివిగా ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఆ సంస్థ ఖర్చు చేసినదంతా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వచ్చినదే. ఈ విషయాన్ని చాలా పత్రికలు వెల్లడించాయి కూడా. కానీ నిర్మాణంలో మాత్రం తీవ్ర జాప్యం కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వ పెద్దలకు, ట్రాన్స్ట్రాయ్ ప్రమోటర్స్కు మధ్య గూడుపుఠాని జరిగి నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. రూ. 50,000 కోట్లు వ్యయం పెరిగిందని ప్రభుత్వం చెప్పగానే దానిని విశ్వసించి, ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే కేంద్ర ఆర్థిక, జలవనరుల మంత్రిత్వ శాఖలు నిధులు మంజూరు చేస్తాయా? పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా చేర్చడం మరొక అంశం, నిజానికి వివాదం. పోలవరం ప్రాజెక్టుకే ఇంకా పర్యావరణ అనుమతులు లభించలేదు. కానీ పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను పోలవరం ప్రాజెక్టుకు అనధికారికంగా జోడించారు. ఈ అదనపు భారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖ భరించవు. ట్రాన్స్ట్రాయ్ గురించి ప్రశ్నలెన్నో! రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరే, అసలు ట్రాన్స్ట్రాయ్ గురించే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక్కడే ఆ సంస్థ ఘనత గురించి మరొక విషయం గుర్తు చేయాలి. ఇటీవల మన రిజర్వు బ్యాంక్ ప్రకటించిన రుణాల ఎగవేతదారుల జాబితాలో ఈ సంస్థ పేరు కూడా ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్ చివరన వెల్ల డించిన వివరాల ప్రకారం రిజర్వు బ్యాంక్‌లో పేరుకుపోయిన (2017 జూన్ వరకు) మొత్తం నిరర్ధక ఆస్తులలో 25 శాతం 12 సంస్థల నిర్వాకమేనని బ్యాంక్ వెల్లడించింది. ఇక ప్రశ్నల విషయానికి వస్తే, ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ట్రాన్స్‌ట్రాయ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించింది? రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్మును ట్రాన్స్ట్రాయ్ అనధికారికంగా మళ్లించిందా? ఒప్పందం మేరకే ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించిందా? ట్రాన్స్ట్రాయ్ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అనధికారికంగా ఈ నిధుల నుంచి కూడా ఏమైనా మళ్లించారా? ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తేవడం, నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చడానికి విన్యాసాలు చేయడం (మనీ ల్యాండరింగ్) వంటివి ఈ ప్రాజెక్టు విషయంలో చోటు చేసుకున్నాయా? ఇవన్నీ తప్పక వచ్చే ప్రశ్నలే. రిజర్వు బ్యాంక్ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసేవారి జాబితాలో ట్రాన్స్‌ట్రాయ్‌ని చేర్చింది. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం మిగిలిన ఎగవేత సంస్థల మీద అవినీతి కోణం నుంచి దర్యాప్తు జరిపినట్టే ట్రాన్స్ట్రాయ్ మీద కూడా దర్యాప్తు చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం చూపించిన వ్యయ అంచనాల పట్ల, విడుదల చేసే నిధుల విషయంలోనూ కేంద్ర ఆర్థిక, జలవనరుల మంత్రిత్వ శాఖలు జాగరూకతతో వ్యవహరించాలి. అనుమతులు లేని ప్రాజెక్టులకు, అనధికార ప్రయోజనాలకు నిధులు విడుదల చేస్తే కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అక్రమ చర్యలలోను, చట్ట విరుద్ధ కార్యకలాపాలలోనూ భాగస్వాములు కావలసి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున దీని నుంచి కేంద్రం తరువాత తప్పించుకోలేదు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేనందున ఈ రీతిలో దీని నిర్మాణం కొనసాగిం చడం అక్రమమే అవుతుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదట పోలవరం ప్రాజెక్టులో భాగం కాదు. అయినా కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లేకుండానే, రూ. 4,000 కోట్లతో వీటి పని ఆరంభించారు. అలాగే వీటికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లేవు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వీటి వ్యయాన్ని కూడా పోలవరం ప్రధాన పథకం అంచనాలలో అంతర్భాగం చేసింది. అందుకే పోలవరం కోసమే కేటాయించిన నిధులను ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లించింది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ప్రధానమైన పోలవరం ప్రాజెక్టుకు న్యాయం జరగదు. నిరాశ్రయులనూ పట్టించుకోలేదు పోలవరంతో నిరాశ్రయులైన కుటుంబాల రోదనను కూడా రాష్ట్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు వరకు అటవీహక్కుల చట్టాన్ని అమలు చేయలేదు. ఈ ప్రాజెక్టు కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది గిరిజనులకు పరి హారం అందలేదు. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఇదంతా తెలుసు. అయినా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. ఇవన్నీ కాకుండా, ఈ మధ్య సమాచార హక్కు చట్టం కింద సేకరించిన అంశాలు కూడా కొత్త వాస్తవాలను వెల్లడించేవిగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపునకు గురయ్యే గ్రామాల సంఖ్య మొదట పేర్కొన్న సంఖ్య కంటే చాలా ఎక్కువని ఆ సమాచారం వల్ల తెలుస్తున్నది. అంటే ముంపు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వారీ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. ఈ ఉల్లంఘనను కూడా చట్ట వ్యతిరేకం కిందనే భావిస్తారు. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు లొంగిపోయిన ప్రభుత్వం వారికి విరివిగా నిధులు మంజూరు చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. నిజానికి దీనితోనే ప్రాజెక్టు వ్యయం అనూహ్యంగా పెరి గింది. మొదట్లో ప్రాజెక్టు వ్యయం రూ. 16,000 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు చూపింది. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ వ్యయం రూ. 40,000 కోట్లు. నిజం చెప్పాలంటే, మొదట చూపించిన రూ. 16,000 కోట్ల అంచనాకే కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వలేదు. అయినా నెల తరువాత నెల కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా మంజూరు చేసిన నిధుల విషయం అందరినీ కలవరపెడుతోంది. ఇలా ఉండగా, పెరిగిన అంచనాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు, తీసుకోవలసిన చర్యలపై సిపారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఒక కమిటీని నియమించాలని నిర్ణయించింది. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు కూడా. ఈ కమిటీలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ప్రాజెక్టు సలహాదారు దినేశ్ప్రసాద్ భార్గవ సభ్యులు. జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని కూడా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ఈ జాతీయ ప్రాజెక్టు అధారిటీ కార్యదర్శి గుప్తాను రాష్ట్ర అధికారులు నియమించిన కమిటీలో సభ్యుడిని చేయడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే కాంట్రాక్టర్ల అక్రమాలకు కేంద్ర ప్రతినిధి కూడా ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. వాస్తవానికి నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమాలు సాగించడానికి అవకాశం కల్పించాయి. ఇదంతా చూస్తే ఈ ప్రాజెక్టు మీద ప్రజాధనాన్ని అక్రమంగా వ్యయం చేయడానికి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా రాష్ట్రంతో కేంద్రం కుమ్మక్కయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల గురించి ఎవరూ ప్రశ్నించలేదు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని తెలిసినా మూడు రాష్ట్రాలకు చెందిన గిరిజనులను ఎందుకు నిరాశ్రయులను చేసినట్టు? తాగునీరు, సాగునీరు కోసం కడుతున్న ఈ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగమే ఎక్కువ కనిపిస్తోంది. సరైన అనుమతులు ఏమీ లేకుండా పనులు జరుగుతుండటం ఒక అక్రమమైతే, అందులోనే అవినీతి చోటు చేసుకోవటం సహించరానిది. పోలవరం ప్రాజెక్టుపై ఇంతవరకు చేసిన వ్యయం మీద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేత ప్రత్యేకంగా ఆడిట్ జరిపిం చాలి. ఆ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఇంతవరకు జరిగిన దుర్వి నియోగాల మీద కేంద్రం దర్యాప్తు చేయించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం సరికాదు. సీబీఐ రంగంలోకి దిగి నిధుల విషయంలో జరిగిన అవకతవకలను కేంద్రానికి తెలియచేయాలి. వ్యాసకర్త భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి మొబైల్ : 98660 21646 ఈఏఎస్ శర్మ -
పూలింగ్‌లో కుంభకోణం
⇒ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ⇒ సీఆర్డీఏ అధికారులు చట్టాలు,రాజ్యాంగం చదవాలి సాక్షి, అమరావతి : సీఆర్డీఏ అధికారులకు ఇంగిత జ్ఞానం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. వారు చట్టాలు.. రాజ్యాంగాన్ని చదవాలని హితవు పలికారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనలు, ఆదేశాలపై వారు చెబుతున్న మాటలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట విరుద్ధంగా పనిచేస్తే ఇప్పుడు కాకపోయినా నాలుగేళ్ల తర్వాతైనా అధికారులు ఇబ్బంది పడక తప్పదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూ సమీకరణలో కుంభకోణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. విశాఖపట్నం పరవాడ భూ సమీకరణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, ఇక్కడా అలాంటి పరిస్థితి నెలకొందన్నారు. అమరావతిలో డి ఫారం పట్టా భూములు కొనుగోలు చేసిన వారికి పరిహారం ఇవ్వవచ్చని ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చిందని, అది చెల్లదని దానిపై ప్రభు త్వ సీఎస్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. అవసరం లేకున్నా వేలాది ఎకరా లు సేకరి స్తూ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తోందని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని మారిస్తే హైకోర్టులో సవాలు చేస్తామన్నారు. మంచినీళ్లు తాగినట్లు..: మంచినీళ్లు తాగినంత తేలిగ్గా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం – అమరావతి రహదారికి 26,800 ఎకరాలు, అమరావతి అవుటర్ రింగు రోడ్డుకు 8,500 ఎకరాలను నెలల వ్యవధిలో సేకరించాలని ముఖ్య మంత్రి ఆదేశించడం దారుణమన్నారు. -
స్విస్ ఛాలెంజ్‌పై ‘కాగ్’కు ఫిర్యాదు
స్విస్ ఛాలెంజ్ విధానం పేరిట రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధపడడం వెనుక భారీ కుంభకోణం ఉందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ విమర్శించారు. అందుకే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు కూడా వెల్లడించకుండా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని ఆరోపించారు. ‘రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి చట్టం ( ఏపీఈడీఈఏ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సింగపూర్ సంస్థలు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వర్తింపజేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్‌కు ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు. ప్రభుత్వం గాని, ప్రభుత్వ ఏజెన్సీకి గానీ కనీసం 52 శాతం వాటా ఉన్న సంస్థలకే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వర్తింపజేయాలని ఏపీఈడీఈఏ చట్టం స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. కానీ, అమరావతి నిర్మాణంలో సీఆర్డీఏకు 48 శాతం మాత్రమే వాటా ఇచ్చినందున స్విస్ ఛాలెంజ్ విధానం వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని శర్మ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఎవరైనా న్యాయస్థానంలో సవాల్ చేస్తే మొత్తం ప్రక్రియ నిలిచిపోయే అవకాశాలున్నాయన్నారు. అప్పుడు సింగపూర్ సంస్థలు తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే ఎంతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. అసలు స్విస్ ఛాలెంజ్ విధానం అన్నది భారీ అవినీతికి ఆస్కారమిస్తున్న లోపభూయిష్టమైన ప్రక్రియ అని కేల్కర్ కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌గా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకత్వానికి వివరించాల్సి బాధ్యత ప్రధాన కార్యదర్శి టక్కర్‌పై ఉందని కూడా ఆయన తేల్చిచెప్పారు. లేకపోతే ఈ భారీ కుంభకోణానికి, అక్రమాలకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకత్వంతోపాటు ఉన్నతాధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని శర్మ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నిగ్గు తేల్చాలని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్)కు ఫిర్యాదు చేస్తున్నానని కూడా ఆయన వెల్లడించారు. అవినీతి నిరోధక శాఖ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తానన్నారు. -
'జీవోలన్నీ బడా బాబుల లాభం కోసమే'
విశాఖపట్నం: రాజధాని ప్రాంతంలో భూదందాలపై సాక్షిలో వెలువడిన కథనాలపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్.శర్మ స్పందించారు. గత నెలలో ప్రభుత్వానికి తాను రాసిన లేఖలోని అంశాలు, ఈ రోజు సాక్షిలో వెలువడిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయని ఈ సందర్భంగా శర్మ వెల్లడించారు. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతి జీవో.. బడా బాబులకు లాభం చేకూర్చేలా ఉందని శర్మ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని భూదందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 22న ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. అజయ్ కలామ్‌కు రాజధాని ప్రాంతంలో భూదందాలపై శర్మ లేఖ రాసిన విషయం తెలిసిందే. -
అమరావతిపై ఎన్జీటీలో పిటిషన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఈఏఎస్ శర్మ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో యూనియన్ ఆఫ్ ఇండియా, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్ర అటవీశాఖ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రతివాదులుగా చేర్చారు. శర్మ తన పిటిషన్లో బహుళ పంటలు పండే ప్రాంతంతో పాటు సున్నితమైన పర్యావరణ ప్రాంతంలో విమానాలకు అనుమతికి రాష్ట్ర అథారిటీ లేదని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్‌కు ముప్పు పొంచివుందని, అంతే కాకుండా అమరావతి నిర్మాణ అనుమతులు ...నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కాగా గతంలో కూడా పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
కొవ్వాడ.. మరో ఫుకుషిమా అయ్యే ప్రమాదం!
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణుశక్తి కేంద్రం నిర్మిస్తే.. అక్కడ ఫుకుషిమా తరహా ప్రమాదం సంభవించే అవకాశాలు చాలా ఎక్కువని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను గత సంవత్సరం డిసెంబర్ 24న ప్రధానమంత్రికి రాసిన లేఖను ప్రస్తావించారు. కొవ్వాడలో అణుశక్తి కేంద్రాన్ని నిర్మించడం మీద అధ్యయనం చేయడానికి, కొన్నేళ్ల క్రితం కేంద్రంలోని అణు ఇంధన మంత్రిత్వ శాఖ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ కొవ్వాడ చుట్టుపట్ల భూతలం క్రింద చాలా బీటలు ఉన్నాయని, అందువలన అక్కడ భూమి కంపించే అవకాశాలు ఉన్నాయని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కొవ్వాడ చుట్టూ 300 కిలోమీటర్ల వరకు క్షుణ్ణంగా ఇంకా అధ్యయనం చేయడం అవసరమని తెలిపింది. కానీ అలాంటి పరిశీలన చేయకుండానే అక్కడ అణుశక్తి కేంద్రాన్ని నిర్మించే పనులను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టు వచ్చిన తర్వాత.. ఒకవేళ అక్కడ పెద్దస్థాయిలో భూకంపం వస్తే, జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన భయంకరమైన ప్రమాదం కొవ్వాడలోనూ సంభవించే ప్రమాదం ఉందని ఈఏఎస్ శర్మ తెలిపారు. అలాంటి ప్రమాదం సంభవిస్తే.. దాని భీభత్సం చుట్టుపక్కల వందలాది మైళ్ల వరకు ఉంటుందన్నారు. ఆ ప్రమాదం వల్ల వచ్చే అణుధార్మిక ప్రభావం తరతరాల మీదా ఉంటుందని హెచ్చరించారు. అణు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రధాని దృష్టికి ఈ విషయం తెచ్చారో లేదో గానీ.. గురువారం సాయంత్రం కూడా కొవ్వాడ ప్రాంతంలో భూమి కొన్ని సెకండ్లు కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. దీన్ని బట్టి కొవ్వాడలో భూకంపాల ప్రమాదం స్పష్టంగా ఉందని అర్థమవుతోందని శర్మ తెలిపారు. ఇప్పుడైనా అధికారులు కళ్లు తెరిచి, నిపుణుల కమిటీ చెప్పినట్లు కొవ్వాడ చుట్టూ కనీసం 300 కిలోమీటర్ల వరకూ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆయన కోరారు. ఎన్జీఆర్ఐ లాంటి సంస్థలకు ఈ బాధ్యతను అప్పగించాలన్నారు. ఏడాది క్రితం బంగాళాఖాతంలో వచ్చిన భూకంపం గురించి, తాజాగా కొవ్వాడలో వచ్చిన భూకంపం గురించి కూడా అధ్యయనం చేయడం అత్యవసరమని తెలిపారు. అసలు కొవ్వాడలో అణుశక్తి కేంద్రాన్ని నిర్మించడం సబబేనా అనే విషయాన్ని కుడా పునః పరిశీలించాలని ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం తగదని, ఈ విషయాన్ని ప్రధాని తప్పకుండా దృష్టిలో పెట్టుకొని కొవ్వాడ అణుశక్తి కేంద్రం గురించి అణు ఇంధన మంత్రిత్వ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
ఆంధ్రాలో రష్యా అణు ప్లాంట్!
► కూడంకుళం 5, 6 యూనిట్లకు ఏపీలో భూమి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వ్యవహారంలో మళ్లీ కదలిక మొదలైంది. రష్యా సహకారంతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌లో ఐదు, ఆరు యూనిట్ల స్థాపన కోసం ఏపీలో భూమి కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ చేపట్టనున్న రష్యా పర్యటనలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అణు ఇంధన సహకారంపై రష్యా, భారత్ మధ్య ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. దేశంలో మరికొన్ని అణు విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదిలావుంటే.. అమెరికాకు చెందిన అణు విక్రేత జీఈ-హిటాచి న్యూక్లియర్ ఎనర్జీ సాయంతో ఒక ప్రాజెక్టును నెలకొల్పేందుకు కేంద్రం ఇప్పటికే కొవ్వాడ స్థలాన్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ సంస్థల లబ్ధికే: కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంపై స్థానికుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు. ఇటీవల జపాన్ ప్రధాని భారత పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో గుజరాత్, కొవ్వాడ, మహారాష్ట్ర ప్రాంతాల్లో మూడు అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం చేస్తామని ఆ దేశం హామీ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమైంది. ప.బెంగాల్లో అణువిద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం చంద్రబాబు ఏపీలో ఎలాగైనా రెండు ప్లాంట్లు ప్రారంభించి కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడలా... ఇప్పుడిలా... 2010లో చంద్రబాబు కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రతిపాదనను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రేపటి నుంచి మోదీ రష్యా పర్యటన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాస్కోలో వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ 23, 24 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. పౌర అణు విద్యుత్ రంగంలో భారత్‌కు రష్యా కీలకమైన భాగస్వామిగా ఉంది. మోదీ, పుతిన్‌ల మధ్య జరిగిన గత శిఖరాగ్ర భేటీలో.. 2035 నాటికి భారత్‌లో కనీసం 12 అణు రియాక్టర్లను రష్యా నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రజలకు ముప్పు తప్పదు ‘‘అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల ప్రజలకు ముప్పు తప్పదు. వీటిలో విద్యుత్ ఉత్పత్తికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాభార్జన కోసమే విదేశీ సంస్థలు భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.’’ -ఈఏఎస్ శర్మ, మాజీ ఐఏఎస్ -
అనుమతులు లేకుండానే అమరావతి నిర్మాణమా?
-
'బిల్డింగులతోనే పాలన మారిపోతుందనుకోవడం భ్రమ'
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తామని ఆర్భాటం చేస్తున్నారని, అయితే బిల్డింగులతోనే పాలన మారిపోతుందని అనుకోవడం భ్రమ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సామాజికవేత్త ఈఏఎస్ శర్మ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతోనే రాజధానులు నిర్మించుకున్నారని చెప్పారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడు ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించడం సరికాదన్నారు. సస్యశ్యామలమైన భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నారని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టారని మండిపడ్డారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పూర్తి నిరంకుశంగా వ్యవహరించారని, ప్రతిపక్షాలు సమా ఎవరినీ సంప్రదించలేదని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూలను ఎందుకు బయటపెట్టరని సూటిగా ప్రశ్నించారు. రైతుల భూములను విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అని అడిగారు. పర్యావరణ అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయగానే అనుమతులు ఉన్నాయంటూ హడావుడిగా ప్రకటించారని శర్మ చెప్పారు. అనుమతులు వచ్చాయని చెబుతున్న సీఆర్డీఏ.. అందుకు సంబంధించిన పత్రాలను ఎందుకు చూపించడంలేదని నిలదీశారు. -
పుష్కరాల్లో వీఐపీల వికృతహేల
సందర్భం భారీ జనసందోహం పోగుపడే పుష్కరాల వంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావ కంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహించాలి. ప్రియమైన ఐ.వై.ఆర్. కృష్ణా రావు గారూ! గోదావరి పుష్కరాల సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు మెల గిన విధానం నన్ను చాలా బాధించింది, వ్యాకులపర్చింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుం బం యాత్రికుల వ్యథపై కాసింత సున్నితంగా వ్యవహరించి ఉంటే పుష్కరాల ప్రారంభ దినాన 30 మంది (పిల్లలతో సహా) తొక్కిసలాటలో అసు వులు బాసిన ఘటన జరిగి ఉండేది కాదు. ఇలాంటి ఘటనల్లో ఒక్కరంటే ఒక్క వీఐపీ ఉన్నా చాలు.. అది భద్రతా ఏర్పాట్లపై, ట్రాఫిక్‌పై, ఇతర సేవలపై ప్రభావం చూపుతుంది. ప్రముఖ వ్యక్తులు లేకున్నట్లయితే రాజమండ్రిలో పుష్కరాలకు తరలివచ్చిన లక్షలాది మంది యాత్రికులకు పైసేవలన్నీ అందుబాటులో ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అతి పెద్ద తొక్కిసలాట సందర్భంగా క్షమా ర్హం కాని ఘటన జరిగినప్పటికీ, స్వయం ప్రకటిత వీఐపీలు తమ కుటుంబాలు, ఇతర పరివారం తోడుగా పుష్కరాల్లో పాల్గొనడానికి కదం తొక్కారని వార్తలు. యాత్రికులు సొం త ఖర్చులు పెట్టుకోవాల్సివచ్చింది కానీ, తమ ప్రైవేట్ ఖర్చులను చెల్లించడానికి ప్రభుత్వ ఖజానా అన్ని వేళలా పుష్కరాల్లో అందుబాటులో ఉందన్న చందాన వీఐపీలు పుష్కరాలకు పోటెత్తారు. నాకు అర్థమయిందేమిటంటే, రాజమండ్రి చేరుకుని పుష్కర జలాల్లో మునగడానికి ఉత్తరాన తుని నుంచి, దక్షి ణాన ఏలూరు వరకు యాత్రికులు భారీ సంఖ్యలో క్యూ కట్టి వేచి ఉన్నారు. ఇంత భారీ జనసందోహం మున్నె న్నడూ కనీవినీ ఎరుగనిది. మామూలు పరిస్థితుల్లో అయితే బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా.. అతడు లేదా ఆమె క్యూలో నిల్చుని వేచి చూడటానికి సిద్ధపడితే తప్ప, ఈ స్వయం ప్రకటిత వీఐపీల ప్రవేశంపై నిషేధం విధించేది. వీఐపీలను కూడా ఇతర యాత్రికులలాగే భావించి వారు మామూ లుగా పుష్కరాల్లో పాలు పంచుకునేలా చేసేది. దురదృష్ట వశాత్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కనీస బాధ్య తతో అయినా వ్యవహరించినట్లు కనిపించలేదు. పైన పొందుపర్చిన చిత్రాన్ని చూసినట్లయితే, తొక్కిస లాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా గవర్నర్ తన కుటుంబంతోపాటు రాజమండ్రిని సం దర్శించి ప్రత్యేకంగా రూపొందించిన వీఐపీ ఘాట్‌లో మునకవెయ్యడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. మనలాం టి ప్రజాస్వామ్యవ్యవస్థలో, కొంతమందిని వీఐపీలుగా గుర్తించి ప్రజాధనంతో వారికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని వారు ఆక్రమించడానికి అనుమతించడం జరిగితే అలాంటి పరిస్థితి ఎవరికైనా అసహ్యం కలిగించ దా? పుష్కరాల సందర్శన కోసం రాజమండ్రి రావడానికి గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్‌ను ఉపయోగించారని నాకర్థమైంది. పూర్తిగా వ్యక్తిగతమైన ఇలాంటి సందర్శనలకు ఎవరు డబ్బు చెల్లిస్తున్నారు? గవ ర్నర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కారు. ప్రభు త్వ ఖజానా నుంచి వారికోసం ఎలాంటి చెల్లింపులు చేయ కూడదు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జవాబుదారీత నాన్ని తప్పక పాటించాలి. తమకు తాము పుణ్యం సంపా దిం చుకోవడం కోసం వీఐపీలు చెల్లింపులు జరిపేలా ప్రభు త్వ పన్ను చెల్లింపుదారును ఒత్తిడికి గురిచేయకూడదు. అలాంటి పుణ్యసాధన కోసం తాము ప్రజలను అసౌకర్యా నికి గురి చేయకూడదని వీఐపీలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర గవర్నర్ పాత్ర ఏమిటన్నది రాజ్యాంగంలో చక్కగా నిర్వచించారు. ఆయన పాత్రకు పరిమితులు న్నాయి. రాజ్యాంగంలో తమకు నిర్దేశించని పాత్రలను వారు చేపట్టనే కూడదు. పైగా, ఈ తొక్కిసలాట ఘటన మధ్యనే సింగపూర్ నుంచి అత్యున్నత స్థాయి బృందం రాజమండ్రిని సంద ర్శించిందని విన్నాను. ఈ బృందం సందర్శన కూడా యాత్రికులకు మరిన్ని ఇబ్బందులను కలుగజేసి ఉంటుం దని నా నమ్మకం. ప్రజలకు అసౌకర్యం కలిగించటమే కాక, ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారే వీఐపీలను ఇలాంటి పరిమాణాలకు పూర్తి బాధ్యత వహించేలా చేసి, వారిపై ఆరోపణలను బుక్ చేసే రోజొకటి వస్తుంది. టైమ్స్ టీవీ న్యూస్ చానల్లో వీఐపీల ఉపద్రవాన్ని విస్తృతంగా కవర్ చేయడం నా దృష్టికి వచ్చింది. కింది లిం కులో దాన్ని మీరు కూడా చూడవచ్చు. https://www.youtube.com/watch?t=75&v=WlLD0kF7DfQ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆర్నాబ్ గోస్వామి సంధించిన ప్రశ్నలకు నేరుగా సమా ధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆ ఘటనకు సంబం ధించి వాస్తవంగానే ఎలాంటి సమాధానాలు లేవు. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సమయంలో ముఖ్య మంత్రి విశాఖపట్నంలో ఉండిపోయిన ఘటన అసాధారణ మని, అది సహాయ చర్యలను వేగవంతం చేయడంలో ఎంతగానో తోడ్పడిందన్న భావం కలిగించడానికి సీఎం అప్పట్లో ప్రయత్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సహా య చర్యలకు నేతృత్వం వహించడం అభినందనీయమే కానీ బహుశా సీఎం తెలుసుకోని విషయం ఏమిటంటే, విశాఖపట్నంలోని 90 శాతం అధికారులు ఆ సమయంలో సీఎం వద్ద హాజరు వేయించుకోవడంలోనే కాలం గడిపేశా రు. పైగా నిజంగా తుపాను ప్రభావానికి గురైన గుడిసెవా సులను అధికారులు పలకరించలేకపోయారు. ఈ అధికా రుల్లో చాలామంది 5 స్టార్ హోటల్లో బస చేశారు. తుపా ను ముగిసిన తొమ్మిది నెలల తర్వాత కూడా పేదలలో కేవలం 15 శాతం మంది మాత్రమే తుపాను సహాయాన్ని అందుకోగలిగారు. మిగతావారు ఈనాటికీ సహాయం కోసం వేచి చూస్తూనే ఉంటున్నారు. హుద్ హుద్ తుపాను అనంతరం ప్రధానమంత్రి విశాఖపట్నం సందర్శన ఎంత ఇబ్బంది కలిగించిందంటే, బాధితులకు ఉద్దేశించిన ఆహార సామగ్రి మొత్తంగా పాడయిపోయింది, అధికారుల అప్ర మత్తత కూడా దారి తప్పింది. ఇలాంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావకంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలన్న సందేశాన్ని గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహిస్తారని ఆశిస్తు న్నాను. ప్రచారం పట్ల ఆత్రుత, రాజకీయ ప్రయోజనాలకు కూడా వీరు దూరంగా ఉంటేనే మంచిది. తాము ప్రజాస్వా మ్యంలో భాగమే కానీ జమీందారీ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని వారు తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. తన ఘోరమైన, అతిశయించిన వీఐపీ సంస్కృతిని భారతదేశం అధిగమించే రోజొకటి వస్తుందని నేను ఆశిస్తు న్నాను. ప్రజాస్వామ్యంలో వీఐపీలకు చోటు లేదు. ఈ ఉత్తరాన్ని గవర్నర్, ముఖ్యమంత్రుల ముందు ఉంచాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో వారు ఎలాంటి పాత్రలను నిర్వహించాలనే విషయంపై నా ఉత్తరం ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను. తొక్కిసలాటపై న్యాయవిచారణపై ఇకనయినా దృష్టి పెడతారని ఆశిస్తాను. ఈ ఘటనలో పోలీసులు, జూనియర్ అధికారుల పాత్రపైనే కాదు.. వీఐపీల పాత్రపై కూడా దృష్టి పెట్టగలరని ఆశిస్తున్నాను. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుకు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ రాసిన లేఖ) ఈఎఎస్ శర్మ (వ్యాసకర్త మొబైల్: 9866021646) ఈ మెయిల్:eassarma@gmail.com. -
పెట్టుబడిదారులపైనే పాలకుల ప్రేమ
మహారాణిపేట (విశాఖపట్నం): పెట్టుబడిదారులు, మాఫియాదారులే ప్రభుత్వాలకు మూలస్తంభాలుగా మారారని, అలాంటి వారి వ్యాపారాల కోసం పాలకులు ప్రజల భూములను లాక్కుంటున్నారని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్.శర్మ విమర్శించారు. మాఫియాదారుల వ్యాపార లావాదేవీల కోసం పచ్చని పంటలు పండే రైతుల భూములను పణంగా పెడుతున్న పాలకుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. మానవహక్కుల వేదిక విశాఖ జిల్లా 5వ మహాసభల సందర్భంగా సిరిపురం బిల్డర్స్ అసోషియేషన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శర్మ ప్రసంగించారు. అమరావతిలో ప్రభుత్వం కడుతున్న రాజధాని కార్పొరేట్ రాజధానా.. ప్రజా రాజధానా పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. రూ.లక్షల కోట్లతో వేల ఎకరాల్లో కడుతున్న రాజధానిలో సామాన్య ప్రజల జీవనానికి ఎంతవరకూ చోటుంటుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరూ ఎన్ఆర్ఐలేనని శర్మ వ్యంగ్యంగా అన్నారు. వీరిద్దరు డబ్బులు దండుకోవడానికి మాత్రమే విదేశాల్లో ఎన్ఆర్ఐలు, ఆ దేశ ప్రతినిధుల చుట్టూ చెక్కర్లు కొడుతున్నారన్నారు. అక్కడకు వెళ్లి స్మార్ట్‌సిటీ, వైఫై అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా వారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లినపుడు పేదప్రజలకు ఇబ్బందులు కలిగించే పర్యావరణ విధ్వంసం, ఉపాధి వంటి సమస్యలు ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడాలేవన్నారు. హుద్‌హుద్ తుపాను వెళ్లి తొమ్మిది నెలలు గడుస్తున్నా విశాఖనగరంలో ఇంతవర కు 15శాతం లబ్ధిదారులకు మాత్రమే రూ.5వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చారని, మిగతా 85 శాతం మంది ఇంకా అధికారులు వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకుంటారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షుడు ఎ.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.శరత్, పలువురు ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొవ్వొత్తులు ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఇవ్వండి
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్నం నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 60 శాతం కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 వేల మందితో నిర్వహిస్తున్న 40 వేల కొవ్వొత్తుల ప్రదర్శనపై ఆయన విరుచుకుపడ్డారు. అక్కడ ప్రదర్శన నిర్వహించే బదులు కరెంటు లేనిచోట వాటిని పంచిపెడితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలో విద్యుత్ సరఫరాను వారం రోజుల్లోనే పునరుద్ధరించేశామని, ప్రకృతి విలయాన్ని టెక్నాలజీతో అడ్డుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కూడా ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా చెట్లు తొలగించుకున్నారు తప్ప, సర్కారు ప్రకటించిన 200 పొక్లెయిన్లు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అంటున్నారు.