'బిల్డింగులతోనే పాలన మారిపోతుందనుకోవడం భ్రమ'
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తామని ఆర్భాటం చేస్తున్నారని, అయితే బిల్డింగులతోనే పాలన మారిపోతుందని అనుకోవడం భ్రమ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సామాజికవేత్త ఈఏఎస్ శర్మ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతోనే రాజధానులు నిర్మించుకున్నారని చెప్పారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడు ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించడం సరికాదన్నారు. సస్యశ్యామలమైన భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నారని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టారని మండిపడ్డారు.
రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పూర్తి నిరంకుశంగా వ్యవహరించారని, ప్రతిపక్షాలు సమా ఎవరినీ సంప్రదించలేదని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూలను ఎందుకు బయటపెట్టరని సూటిగా ప్రశ్నించారు. రైతుల భూములను విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అని అడిగారు. పర్యావరణ అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయగానే అనుమతులు ఉన్నాయంటూ హడావుడిగా ప్రకటించారని శర్మ చెప్పారు. అనుమతులు వచ్చాయని చెబుతున్న సీఆర్‌డీఏ.. అందుకు సంబంధించిన పత్రాలను ఎందుకు చూపించడంలేదని నిలదీశారు.