Retired IAS officer
-
అచ్యుతాపురం ఘటన.. చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ బహిరంగ లేఖ
సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ కాలంలోనే కాకుండా.. అంతకుముందు పాలించిన మీ హయాంలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ గుర్తుచేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా భవిష్యత్తులో ఈ తప్పిదాలు జరగకుండా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూ శర్మ శనివారం బహిరంగ లేఖ రాశారు.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసి లాభాలు గడిస్తూ అక్కడి కార్మికులు, స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానుల మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమని ఆరోపించారు.గత ప్రభుత్వ తప్పిదాలవల్లే ప్రమాదాలు జరిగాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ.. 2014లో తమరు అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రమాదాలు జరిగిన విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు. 2013 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం పరవాడ ఫార్మా సెజ్‌లోనే 24 ప్రమాదాలు సంభవించగా 21 మంది ప్రాణాలు కోల్పోయారనీ, 69 మంది గాయాలపాలయ్యారన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రమాదాలు సహజంగా మారిపోయాయని విమర్శించారు.మీరు వచ్చి వెళ్లగానే మరో ప్రమాదం.. ఎసైన్షియా ప్రమాద బాధితుల్ని పరామర్శించి వెళ్లిన రోజు రాత్రే మరో ప్రమాదం జరిగిన విషయం కూడా చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ఈఏఎస్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతమంది మృత్యువాత పడుతున్నా పరిశ్రమల యజమానులు ఎందుకు ఒక్కరోజైనా జైలుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం అభినందనీయమే అయినా.. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా నిబంధలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ విధానాల్లోనూ, వైఖరిలోనూ లోతైన మార్పులు రావాలన్నారు. ఎసైన్షియా యాజమాన్యాన్ని ప్రభుత్వం క్షమించకూడదనీ.. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల అమలులో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ శర్మ డిమాండ్ చేశారు. -
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
న్యూఢిల్లీ: గుజరాత్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా 1985 బ్యాచ్‌కు చెందిన(పంజాబ్ క్యాడర్) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్‌చంద్రపాడేతో కలిసి త్రిసభ్య కమిషన్‌లో చేరనున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మే 15న పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలు రాజీవ్‌కుమార్‌కు అప్పగించారు. పోల్ ప్యానెల్లో అప్పటి నుంచి ఇద్దరు సభ్యుల సంఘంగా ఉంది. చదవండి: భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే.. -
వెదురులో విరిసిన బతుకులు
సుచిత్ర సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆమె ఉద్యోగ జీవితం ఆదివాసీల కుటుంబాల జీవనస్థాయిని మెరుగుపరచడం, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంలోనే మునిగిపోయింది. ‘గడచిన యాభై ఏళ్లుగా ఏ ప్రభుత్వ అధికారి కానీ మంత్రి కానీ ఇక్కడ అడుగుపెట్టిన దాఖలా లేదు’ అంటున్నారు బురుడీహ్ గ్రామస్థులు. బురిడీహ్ గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో రాజధాని జమ్షెడ్పూర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉంది. బురుడీహ్తోపాటు చుట్టుపక్కల పాతిక గ్రామాల్లో ఆదివాసీ జాతులు... అవి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా జాతులు నివసిస్తున్నాయి. అందులో శబర కూడా ఒకటి. భూమి ఉంది కానీ! అడవి మధ్యలో ఊరు. ఊరి చుట్టూ భూమి ఉంది. కానీ సాగు చేసుకోవడానికి అది సొంత భూమి కాదు. తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేదు. అడవి మీద ఆధారపడి బతుకు సాగించే జీవితాలవి. కాలదోషం పట్టిన మన అటవీచట్టాలు అడవిబిడ్డల జీవితాల మీద కొరడా ఝళిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు ఏకైక ఆధారం అడవే. అటవీ చట్టాల ప్రకారం ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, కాయలనే కాదు... ఓ పూరిల్లు వేసుకోవడానికి అడవిలో చెట్టు నుంచి కలప కూడా సేకరించరాదు. అటవీ ఉద్యోగుల కళ్లు కప్పి కొమ్మలను నరికి పూరి పాక వేసుకోవడమే వాళ్లకు మిగిలిన మార్గం. అలాగే ఇల్లు కట్టుకుంటారు. దాంతో అటవీసంపదను దొంగలించిన నేరానికి అందరి మీద కేసులు నమోదై ఉంటాయి. అలాంటి జీవితాలను సుచిత్ర సిన్హా సమూలంగా మార్చేసింది. దశాబ్దాలు గడిచాయి కానీ! సుచిత్రా సిన్హా 1988లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసింది. ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో చిన్నప్పటి నుంచి ఆదివాసీల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెది. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయనే అభిప్రాయంతో కూడిన ప్రాణభయంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూసేవాళ్లు కాదు. ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన సుచిత్ర 1996లో జమ్షెడ్పూర్కి డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చింది. ఆ రావడం ఆమె జీవన గమనాన్ని మార్చేసిందనే చెప్పాలి. ‘‘నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితికి ఇక్కడికి అధికారిగా వచ్చిన నాటికి మధ్య రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచింది. కానీ ఏ మాత్రం మార్పు లేదు. పిల్లలు సరైన దుస్తులు లేకుండా, పోషకాహారం లోపంతో, పూరిళ్లలో బతుకీడుస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేనట్లు వాళ్ల లోకంలో వాళ్లు జీవిస్తున్నారు. ప్రభుత్వంలో ట్రై బల్ స్కీమ్‌లున్నాయి, నిధులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వాళ్ల దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే వాళ్ల జీవితాలు అలాగే ఉండిపోయాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. కొత్తగా ఏం నేర్పిద్దామన్నా, వాళ్లు ఒంటపట్టించుకునేటట్లు కనిపించలేదు. వాళ్లకు వచ్చిన పనినే మరింత మెరుగ్గా చేయడం నేర్పించడం, వాళ్లు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం మీద దృష్టి పెట్టాను. వెదురు వంద రకాలుగా ఆదివాసీలకు వెదురును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెదురు బుట్టలు అల్లడం అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్లకు మామూలు బుట్టలతోపాటు ల్యాంప్షేడ్లు, పెన్ హోల్డర్లు, బాస్కెట్లు చేయడం నేర్పించాం. ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రతినిధులను ఆదివాసీల గ్రామాల్లో పర్యటించమని కోరాను. వాళ్లు వచ్చి శబరులు తయారు చేస్తున్న వెదురు వస్తువులను కళాత్మకంగా చేయడంలో శిక్షణనిచ్చారు. మొత్తం కుటుంబాలు మూడు వందలకు పైగానే. ఒక్కో బృందంలో పదిమంది చొప్పున అందరినీ గ్రూప్‌లు చేశాం. ఒక్కొక్కరికి ఒక్కో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాం. మొదటి నెల ఒకరి భాష మరొకరు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోయింది. కానీ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు శబర ఆదివాసీల చేతుల్లో నూటనాలుగు రకాల హస్తకళాకృతులు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... మోడరన్ హౌస్‌లో కొలువుదీరుతున్న అనేక కళాకృతులు ఆదివాసీల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఢిల్లీలోని హస్తకళల ప్రదర్శన విక్రయకేంద్రం ‘ప్రగతి మైదాన్ ఢిల్లీ హట్’లో స్టాల్ ఏర్పాటు చేయించగలిగాను. ప్రతి ఒక్కరూ నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటున్నారు. ఆదివాసీల కోసం 2002లో స్థాపించిన అంబాలిక ఎన్జీవో సేవలను మరింత విస్తరించి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించాం. బ్రిక్స్ సమావేశాలకు అవసరమైన ఫైల్ ఫోల్డర్లను తయారు చేసింది ఈ ఆదివాసీలేనంటే నమ్ముతారా? అప్పటి వరకు ముందుండి వాళ్లను నడిపించాను. ఇప్పుడు అన్నీ వాళ్లే నిర్వహించుకోగలుగుతున్నారు. నేను వెనక ఉండి వాళ్లు నడుస్తున్న తీరును చూస్తూ సంతోషిస్తున్నాను. సర్వీస్‌లో ఉండగా నాటిన మొక్క ఇది. నేను నాటిన మొక్క శాఖోపశాఖలుగా విస్తరించింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అడవిలో చెట్ల నీడన హాయిగా సాగాల్సిన వారి జీవితాలను చట్టాలు భయం నీడలోకి నెట్టేశాయి. పోలీసుకు ఫారెస్ట్ ఉద్యోగికి తేడా తెలియని అమాయకత్వంలో ఖాకీ డ్రస్ కనిపిస్తే వణికిపోతుండేవాళ్లు. చట్టాల కోరల్లో భయం నీడలో బతుకీడుస్తున్న వాళ్లు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారు. నాగరక ప్రపంచం అంటేనే భయపడే స్థితి నుంచి నాగరికులకు తమ ఉత్పత్తులను వివరించి చెప్పగలుగుతున్నారు. వారిలో ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్ర సిన్హా. -
విశ్రాంత జీవనానికి ఏబీసీడీలు.. డాక్టర్ కిరణ్ చద్దా
‘పదవీ విరమణ తర్వాత సృజనాత్మకమైన నిధిని కనుక్కొన్నాను’ అంటున్నారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కిరణ్ చద్దా. ఏడుపదుల వయసు విశ్రాంత జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెట్రోలియం, ఇనుప ఖనిజం సబ్జెక్టులలో రెండు పీహెచ్‌డీలు చేసి డాక్టరేట్ పొందారు. రచయితగా, మోటివేషనల్ స్పీకర్‌గానూ కొనసాగుతున్న కిరణŠ చద్దా ముప్పై ఆరేళ్ల్ల ఉద్యోగ జీవితాన్నీ, ఆ తర్వాత విశ్రాంత జీవనాన్ని మన కళ్లకు కడుతున్నారు. పెట్రోలియం, వాణిజ్యం, రక్షణ, మహిళా–శిశు సంక్షేమ శాఖలలో పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఆడపిల్లలకు పెద్దగా ఉపాధి అవకాశాలు లేని కాలంలో కేంద్ర ప్రభుత్వ అధికారిగా రాణించింది. ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు తన జీవన విధానం గురించి వివరిస్తూ – ‘పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. కానీ, ఒంటరిగా వెళ్లలేను. నా భర్త హర్ష్ చద్దా పోలీస్ అధికారి అవడంతో నాతో వచ్చేంత సమయం అతనికి లేదు. కానీ, హిమాలయాలపై ఉన్న ప్రేమతో బృందాలతో కలిసి ట్రెక్కింగ్ చేశాను. పిల్లలు హాస్టల్లో చదివేవారు. సెలవులు ఉన్నప్పుడు వారితో గడిపేంత సమయం నాకు ఉండేదికాదు. ఎన్నో అభిరుచులుండేవి. కానీ, విధి నిర్వహణలో వాటన్నింటినీ పక్కన పెట్టేయాల్సి వచ్చింది’ అంటూ తీరిక లేకుండా విధులను నిర్వర్తించిన రోజులను గుర్తుకుతెచ్చుకుంటారు ఆమె. పేదను కాను... పదవీ విరమణ తీసుకున్నాక పరిస్థితులను వివరిస్తూ ‘రిటైర్ అయ్యాక ఢిల్లీ నుంచి డల్హౌసీకి కుటుంబంతో పాటు వెళ్లిపోయాం. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. నేనూ, నా భర్త హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీలో స్థిరపడ్డాం. అక్కడే చదవును కొనసాగించి రెండు పీహెచ్‌డీలు చేశాను. 2017లో ‘డల్హౌసీ త్రూ మై ఐస్’ పుస్తకం రాశాను. ‘క్లీన్ డల్హౌసీ క్లీన్ డల్హౌసీ’ పేరుతో ఎన్జీవో ఏర్పాటుచేశాను. దీని ద్వారా నేనున్న ప్రాంతంలో పరిశుభ్రత కోసం పనిచేశాను. రెండేళ్ల క్రితం నా భర్త గుండెపోటుతో మరిణించాడు. దాంతో చాలా కుంగిపోయాను. నా జీవితంలో అవి చాలా చెడు దినాలు. అయితే, ఈ ప్రపంచంలో నాకేమాత్రం నచ్చని పదాలు రెండు.. వితంతువు, పేదరికం. నేను దేంట్లోనూ ‘పేద’ కాదని నిరూపించుకోవాలనుకున్నాను. సాధనతోనే సాధ్యం వారానికి రెండు సార్లు యోగా, పియానో క్లాసులు తీసుకుంటాను. పంజాబీ పాటలు పాడతాను. యూ ట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోలను తయారుచేసి అప్లోడ్ చేస్తాను. నా కవితలను చదువుతాను. నేను ఇప్పుడు ఎబిసిడి లను అమలులో పెడుతున్నాను. ఎ– (ఎబిలిటీ) సామర్థ్యం, బి–(బింజ్ అలెర్ట్) అప్రమత్తం, సి–(కమిట్మెంట్) నిబద్ధత, డి–(డిసిప్లీన్) క్రమశిక్షణ. ఈ నియమాలను ఆచరణలో పెడితే ఏమైనా సాధించవచ్చు. ఈ నాలుగు విషయాలను అస్సలు అలక్ష్యం చేయను. అందువల్లే చదవాలనే నా అభిరుచిని కొనసాగించాను. ఈ కొత్త సంవత్సరంలో కూడా చాలా పుస్తకాలు చదవాలని, రాయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ వార్తాపత్రికలు చదువుతుంటాను. లాక్డౌన్ సమయంలో 23 రోజుల్లో 150 కవితలు రాశాను. రోజూ నాకు తెలుసున్నవారితో కొంత సమయమైనా గడపడానికి కేటాయిస్తాను. లేటెస్ట్గా వస్తున్న డ్రెస్సులను ధరిస్తున్నాను. నాకు నచ్చిన లిపిస్టిక్ వేసుకుంటున్నాను. నా గోళ్లకు రంగురంగుల పాలిష్ వేసుకుంటున్నాను. నా వయసు ఏడుపదులు దాటి ఉండవచ్చు. కానీ, నా అభిరుచులన్నీ 17 ఏళ్ల అమ్మాయికి తక్కువేమీ లేవు. టీవీ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోను. ఏదైనా ఉపయుక్తమైన పని చేయాలనుకుంటున్నాను. నాకు పంజాబీ సంగీతం, గజల్స్, జోక్స్ అంటే చాలా ఇష్టం. విచారంగా ఉండటానికి సమయమే లేదు’’ అని వివరిస్తారు ఈ విశ్రాంత ఉద్యోగి. విధి నిర్వహణలో ఉన్నవారూ ఆచరణలో పెట్టదగిన అమూల్యమైన విషయాలను కిరణ్ చద్దా తన జీవితం ద్వారా కళ్లకు కడుతున్నారు. నా వయసు ఏడుపదులు దాటి ఉండవచ్చు. కానీ, నా అభిరుచులన్నీ 17 ఏళ్ల అమ్మాయికి తక్కువేమీ లేవు. టీవీ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోను. ఏదైనా ఉపయుక్తమైన పని చేయాలనుకుంటున్నాను. నాకు పంజాబీ సంగీతం, గజల్స్, జోక్స్ అంటే చాలా ఇష్టం. విచారంగా ఉండటానికి సమయమే లేదు. – కిరణ్ చద్దా -
విశ్రాంత ఐఏఎస్ ప్రేమ్ చంద్రారెడ్డి సర్వీసు పొడిగింపు
సాక్షి, అమరావతి : విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి సర్వీసును మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2023 మార్చి 31 తేదీ వరకూ సాధారణ పరిపాలన శాఖలో ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శిగా సర్వీసును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన సర్వీసును మూడు దఫాలు ప్రభుత్వం పొడగించింది. -
శశికళకు జైల్లో ప్రత్యేక మర్యాదలు
-
ఐదు గదులు... ప్రత్యేక కిచెన్
బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి దాఖలుచేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళకు ప్రత్యేక కిచెన్‌తో పాటు, ఐదు గదులు కల్పించారని అప్పటి డీఐజీ(జైళ్లు) డి. రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ కమిటీ నివేదిక ధ్రువీకరించింది. ఆర్టీఐ అర్జీ ద్వారా ఆ కమిటీ నివేదికను సంపాదించానని, శశికళకు ప్రత్యేక మర్యాదలు జరిగిన సంగతి నిజమేనని దీని ద్వారా తెలుస్తోందని నరసింహ మూర్తి చెప్పారు. కాగా ఈ పరిమాణంపై రూప స్పందిస్తూ..తాను ఆనాడు చెప్పిన విషయాల్నే విచారణ కమిటీ ధ్రువీకరించిందని పేర్కొన్నారు. వినయ్ కుమార్ తన నివేదికను 2017లో ప్రభుత్వానికి సమర్పించారు. జైలులో శశికళ తనకు నచ్చిన దుస్తులు ధరించి వంట చేసుకునేవారని, ఆమె సెల్లో సుగంధ ద్రవ్యాలు లభించాయని ఆ నివేదిక పేర్కొంది. జైలులో ఆమె స్వేచ్ఛగా సంచరించేవారని, తన సహచరిణి ఇళవరసితో కలసి బయటికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందని తెలిపింది. 2017 జూన్ 11న తెలుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించిన ఓ వ్యక్తితో శశికళ సుమారు నాలుగు గంటలు మాట్లాడినట్లు పేర్కొంది. కానీ, ఆ వ్యక్తితో శశికళ 45 నిమిషాలే మాట్లాడినట్లు రిజిస్టర్లో నమోదైంది. -
మధుకర్‌ది హత్యే!
♦ నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెల్లడి ♦ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం, ఖానాపూర్‌లో మృతి చెందిన మధుకర్ ఆత్మహత్య చేసుకోలేదని అది హత్యేనని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు అన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మర్మాంగాలు కోసుకుని యాసిడ్ పోసుకుంటారా..? కన్ను తీసుకుంటారా..? ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారు ఇప్పటివరకూ ఊరిలోనే లేరని అన్నారు. ఇవన్ని చూస్తుంటే మధుకర్‌ది హత్యే అని నిర్ధారణ అవుతుందన్నారు. మధుకర్ ఉదంతంపై ఆఫీసర్స్ ఫోరం, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఫ్యాకల్టీ, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేసుకుని.. అక్కడ సేకరించిన విషయాలు మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రక టించారు. కమిటీ సభ్యులు భరత్‌భూషణ్, ప్రొఫెసర్లు కె.వై.రత్నం, విజయ్, సిద్దోజి, కరు ణాకర్లతో కలసి మాధవరావు మాట్లాడారు. తమ కమిటీ ఘటన జరిగిన చోటును సంద ర్శించి అక్కడి స్థానికులతో, బాధితుని కుటుం బ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడిందని.. మధుకర్‌ది హత్యే అని చెప్పడానికి సాక్ష్యాలు లభించాయని వారు పేర్కొన్నారు. దళితుడైన మధుకర్ అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడ ని, అమ్మాయి బంధువులు, కుటుంబీకులకు విషయం తెలిసి బెదిరింపులకు దిగారన్నారు. పోలీసులూ బెదిరించారు కుటుంబసభ్యులు మధుకర్‌ది హత్యే అని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులూ బెదిరింపులకు పాల్పడ్డారని కమిటీ సభ్యులు చెప్పారు. కేవలం అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడన్న కోపంతోనే చంపేశారని, నిజాలు వెలికి తీసి నిందితులను శిక్షించాలన్నారు. దళితులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఆరోపణలు ఎదు ర్కొంటున్న ప్రజాప్రతినిధి ఆ కేసుతో తనకు సంబంధం లేదని.. ఆ అమ్మాయి తన బంధు వు కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఊరు వదిలి ఎందుకు వెళ్లిపోయారో కూడా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. విషం తాగితే మర్మాంగాలు ఎందుకు కోసుకుంటాడు? మధుకర్ చనిపోవడానికి 2 రోజుల ముందు స్థానిక ప్రజాప్రతినిధి, అమ్మాయి బంధువు మధుకర్‌కు ఫోన్ చేసి చంపుతా నని బెదిరించాడని, ఈ విషయం మధుకర్ తమకు చెప్పినట్లు ఆయన తల్లిదండ్రులు చెప్పారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. చనిపోయే ముందురోజు మధుక ర్ను ఓ అగ్రకుల యువకుడు తీసుకుని వెళ్లా డని, ఆ తర్వాతి రోజు ప్రేమించిన అమ్మా యే మధుకర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెట్లపొదల్లో మృతదేహం ఉందని చెప్పినట్లు వెల్లడించారు. విషం తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారని.. కాని విషం తాగిన వ్యక్తి మర్మాంగాలు ఎందుకు కోసు కుంటాడని, మృతదేహం వెనుక భాగం లోనూ యాసిడ్ పోశారని.. తనకు తానుగా ఎలా పోసుకుంటాడని వారు అడిగారు. -
PVRK ప్రసాద్‌తో మనసులో మాట
-
47 ఏళ్ల తర్వాత సాధించాడు!
జైపూర్: మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటుంటారు. రాజస్థాన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 81 ఏళ్ల అజిత్ సింగ్ సింఘ్వి విషయంలో ఇదే జరిగింది. ఎల్ఎల్ బీలో సాధించిన గోల్డ్ మెడల్ 47 ఏళ్ల తర్వాత ఆయన అందుకున్నారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి 1969లో ఆయన ఎల్ ఎల్ బీ చేశారు. పరీక్షల్లో అందరికంటే ఆయన ఎక్కువ మార్కులు సాధించారు. అయితే ప్రతిభాసామర్థ్యాల ఆధారంగా ఆయన రెండో స్థానంలో నిలిచినట్టు యూనివర్సిటీ ప్రకటించింది. మార్కులు ఒకటే కొలమానం కాదని తెలిపింది. యూనివర్సిటీ నిర్ణయంపై కోర్టుకెక్కారు. అత్యధిక మార్కులు సాధించిన తనకు మొదటి స్థానం ఇవ్వాలని, దీనికి అనుగుణంగా ఫలితాన్ని తిరిగి ప్రకటించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. చివరకు రాజస్థాన్ హైకోర్టులో కేసు గెలిచారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో సింఘ్వికి రాజస్థాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేపీ సింఘాల్ గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. -
'బిల్డింగులతోనే పాలన మారిపోతుందనుకోవడం భ్రమ'
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తామని ఆర్భాటం చేస్తున్నారని, అయితే బిల్డింగులతోనే పాలన మారిపోతుందని అనుకోవడం భ్రమ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సామాజికవేత్త ఈఏఎస్ శర్మ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతోనే రాజధానులు నిర్మించుకున్నారని చెప్పారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడు ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించడం సరికాదన్నారు. సస్యశ్యామలమైన భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నారని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టారని మండిపడ్డారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పూర్తి నిరంకుశంగా వ్యవహరించారని, ప్రతిపక్షాలు సమా ఎవరినీ సంప్రదించలేదని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూలను ఎందుకు బయటపెట్టరని సూటిగా ప్రశ్నించారు. రైతుల భూములను విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అని అడిగారు. పర్యావరణ అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయగానే అనుమతులు ఉన్నాయంటూ హడావుడిగా ప్రకటించారని శర్మ చెప్పారు. అనుమతులు వచ్చాయని చెబుతున్న సీఆర్డీఏ.. అందుకు సంబంధించిన పత్రాలను ఎందుకు చూపించడంలేదని నిలదీశారు. -
20న ‘వెంగమాంబ’ గ్రంథావిష్కరణ
వర్ధన్నపేట : మండలకేంద్రానికి చెందిన సుతారి రాధిక రచించిన తరి గొండ వెంగమాంబ వేంకటాచల మహత్యం గ్రంథావిష్కరణ ఈనెల 20న హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ప్రభాకర్‌రావు, కార్యదర్శి మద్దాళి రఘురాం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో సుతారి రాధికకు ఈ గ్రంథ పరిశీలనలో డాక్టరేట్ లభించింది. రాధిక కేయూలో ఎంఏ తెలుగు చదివి తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటాచల మహాత్మ్యంపై పీహెచ్డీ చేశారు. కేయూ ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య నేతృత్వంలో పరిశోధన నిర్వహించి రెండు సంవత్సరాల క్రితం అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరత్నం చేతుల మీదుగా కాన్వొకేషన్ అందుకున్నారు. గ్రంథావిష్కరణను కిన్నెర ఆర్ట్స్ థియటర్స్, త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి, సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత డాక్టర్ ఆర్.అనంతపద్మనాభరావు, ప్రముఖ రచయిత్రి ఎన్.అనంతలక్ష్మి, త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వేంకటదీక్షితులు పాల్గొననున్నారు.