సుచిత్ర సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆమె ఉద్యోగ జీవితం ఆదివాసీల కుటుంబాల జీవనస్థాయిని మెరుగుపరచడం, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంలోనే మునిగిపోయింది.
‘గడచిన యాభై ఏళ్లుగా ఏ ప్రభుత్వ అధికారి కానీ మంత్రి కానీ ఇక్కడ అడుగుపెట్టిన దాఖలా లేదు’ అంటున్నారు బురుడీహ్ గ్రామస్థులు. బురిడీహ్ గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో రాజధాని జమ్‌షెడ్‌పూర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉంది. బురుడీహ్‌తోపాటు చుట్టుపక్కల పాతిక గ్రామాల్లో ఆదివాసీ జాతులు... అవి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా జాతులు నివసిస్తున్నాయి. అందులో శబర కూడా ఒకటి.
భూమి ఉంది కానీ!
అడవి మధ్యలో ఊరు. ఊరి చుట్టూ భూమి ఉంది. కానీ సాగు చేసుకోవడానికి అది సొంత భూమి కాదు. తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేదు. అడవి మీద ఆధారపడి బతుకు సాగించే జీవితాలవి. కాలదోషం పట్టిన మన అటవీచట్టాలు అడవిబిడ్డల జీవితాల మీద కొరడా ఝళిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు ఏకైక ఆధారం అడవే. అటవీ చట్టాల ప్రకారం ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, కాయలనే కాదు... ఓ పూరిల్లు వేసుకోవడానికి అడవిలో చెట్టు నుంచి కలప కూడా సేకరించరాదు. అటవీ ఉద్యోగుల కళ్లు కప్పి కొమ్మలను నరికి పూరి పాక వేసుకోవడమే వాళ్లకు మిగిలిన మార్గం. అలాగే ఇల్లు కట్టుకుంటారు. దాంతో అటవీసంపదను దొంగలించిన నేరానికి అందరి మీద కేసులు నమోదై ఉంటాయి. అలాంటి జీవితాలను సుచిత్ర సిన్హా సమూలంగా మార్చేసింది.
దశాబ్దాలు గడిచాయి కానీ!
సుచిత్రా సిన్హా 1988లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసింది. ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో చిన్నప్పటి నుంచి ఆదివాసీల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెది. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయనే అభిప్రాయంతో కూడిన ప్రాణభయంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూసేవాళ్లు కాదు. ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన సుచిత్ర 1996లో జమ్‌షెడ్‌పూర్‌కి డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చింది. ఆ రావడం ఆమె జీవన గమనాన్ని మార్చేసిందనే చెప్పాలి. ‘‘నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితికి ఇక్కడికి అధికారిగా వచ్చిన నాటికి మధ్య రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచింది.
కానీ ఏ మాత్రం మార్పు లేదు. పిల్లలు సరైన దుస్తులు లేకుండా, పోషకాహారం లోపంతో, పూరిళ్లలో బతుకీడుస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేనట్లు వాళ్ల లోకంలో వాళ్లు జీవిస్తున్నారు. ప్రభుత్వంలో ట్రై బల్ స్కీమ్‌లున్నాయి, నిధులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వాళ్ల దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే వాళ్ల జీవితాలు అలాగే ఉండిపోయాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. కొత్తగా ఏం నేర్పిద్దామన్నా, వాళ్లు ఒంటపట్టించుకునేటట్లు కనిపించలేదు. వాళ్లకు వచ్చిన పనినే మరింత మెరుగ్గా చేయడం నేర్పించడం, వాళ్లు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం మీద దృష్టి పెట్టాను.
వెదురు వంద రకాలుగా
ఆదివాసీలకు వెదురును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెదురు బుట్టలు అల్లడం అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్లకు మామూలు బుట్టలతోపాటు ల్యాంప్‌షేడ్‌లు, పెన్ హోల్డర్‌లు, బాస్కెట్‌లు చేయడం నేర్పించాం. ఢిల్లీ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రతినిధులను ఆదివాసీల గ్రామాల్లో పర్యటించమని కోరాను. వాళ్లు వచ్చి శబరులు తయారు చేస్తున్న వెదురు వస్తువులను కళాత్మకంగా చేయడంలో శిక్షణనిచ్చారు. మొత్తం కుటుంబాలు మూడు వందలకు పైగానే. ఒక్కో బృందంలో పదిమంది చొప్పున అందరినీ గ్రూప్‌లు చేశాం. ఒక్కొక్కరికి ఒక్కో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాం. మొదటి నెల ఒకరి భాష మరొకరు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోయింది.
కానీ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు శబర ఆదివాసీల చేతుల్లో నూటనాలుగు రకాల హస్తకళాకృతులు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... మోడరన్ హౌస్‌లో కొలువుదీరుతున్న అనేక కళాకృతులు ఆదివాసీల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఢిల్లీలోని హస్తకళల ప్రదర్శన విక్రయకేంద్రం ‘ప్రగతి మైదాన్ ఢిల్లీ హట్’లో స్టాల్ ఏర్పాటు చేయించగలిగాను. ప్రతి ఒక్కరూ నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటున్నారు. ఆదివాసీల కోసం 2002లో స్థాపించిన అంబాలిక ఎన్‌జీవో సేవలను మరింత విస్తరించి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించాం. బ్రిక్స్ సమావేశాలకు అవసరమైన ఫైల్ ఫోల్డర్‌లను తయారు చేసింది ఈ ఆదివాసీలేనంటే నమ్ముతారా? అప్పటి వరకు ముందుండి వాళ్లను నడిపించాను.
ఇప్పుడు అన్నీ వాళ్లే నిర్వహించుకోగలుగుతున్నారు. నేను వెనక ఉండి వాళ్లు నడుస్తున్న తీరును చూస్తూ సంతోషిస్తున్నాను. సర్వీస్‌లో ఉండగా నాటిన మొక్క ఇది. నేను నాటిన మొక్క శాఖోపశాఖలుగా విస్తరించింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అడవిలో చెట్ల నీడన హాయిగా సాగాల్సిన వారి జీవితాలను చట్టాలు భయం నీడలోకి నెట్టేశాయి. పోలీసుకు ఫారెస్ట్ ఉద్యోగికి తేడా తెలియని అమాయకత్వంలో ఖాకీ డ్రస్ కనిపిస్తే వణికిపోతుండేవాళ్లు. చట్టాల కోరల్లో భయం నీడలో బతుకీడుస్తున్న వాళ్లు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారు. నాగరక ప్రపంచం అంటేనే భయపడే స్థితి నుంచి నాగరికులకు తమ ఉత్పత్తులను వివరించి చెప్పగలుగుతున్నారు. వారిలో ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్ర సిన్హా.
Comments
Please login to add a commentAdd a comment