
అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జార్ఖండ్‌లోని పాలమూ డివిజన్‌కు చెందిన రవి కుమార్ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కిరాణ కొట్టు నడిపిస్తూ జీవనం సాగించే కుర్రాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీతోనో, జూదంతోనో కాదు. డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ అదృష్టం వరించింది. ఊహించని ఈ గెలుపుతో రవి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
పాలమూ హెడ్‌క్వార్టర్స్‌కి 7 కిలోమీటర్ల దూరంలో.. చియాంకి రైల్వే స్టేషన్ సమీపంలోని తెలియాబండ్ ప్రాంతం ఉంది. మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్ మెహతా ఎప్పుడు చూసినా కిరాణా షాపులో ఫోన్ పట్టుకుని ఇంట్లోవాళ్లతో తిట్లు తింటూ కనిపిస్తుంటాడు. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి మొన్నటిదాకా రూ.5 లక్షలు పొగొట్టాడు. ఈ విషయంపై ఇంట్లో రోజూ గొడవే. అయినప్పటికీ రవి తన ప్రయత్నం మాత్రం వీడలేదు. చివరగా.. ఆరోజు రానే వచ్చింది.
ఏప్రిల్ 9వ తేదీ అతని జీవితంలో మరుపురానిరోజు. గుజరాత్ టైటానస్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా, రషీద్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంచుకుని టీం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయం వర్కవుట్ అయ్యింది. డ్రీమ్11తో ఒక్క రాత్రిలోనే రూ.3 కోట్లు సంపాదించాడతను. అంతే..
అతని కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తప్పుడు పనులు డబ్బులు పొగొట్టావ్ అని తిట్టావ్ కదా అమ్మా.. ఇప్పుడు చూడు ఎంత సంపాదించానో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్‌మనీలో 30 శాతం జీఎస్టీ కిందకు పోయింది.మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాలోకి మళ్లించాడు. వచ్చిన డబ్బుతో సగంలో ఆగిపోయిన ఇంటిని కట్టుకోవడంతో పాటు కాస్త పొలం కొనుక్కోవాలని.. ఇలా ప్లానులు గీసుకుంటున్నాడు.
లోకల్ 18కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. రూ.49 పెట్టుబడితో లక్ష వస్తే చాలానుకున్నాడట. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలని చెబుతున్నాడతను . ఇక వచ్చిన ప్రైజ్‌మనీతో తమ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని అనుకుంటున్నాడతను. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి.. ఇప్పటిదాకా రెండు ఐడీలతో 621 టీంలను సృష్టించాడు. ఈ క్రమంలోనే కిరాణం షాపు ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.5 లక్షలు పొగొట్టాడు. చివరకు.. పడిన చోటే నిలబడి ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కలవాళ్ల నుంచి గ్రేట్ అనిపించుకున్నాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం జరిగిన ఘటన తెలియజేయడం కోసం మాత్రమే. బెట్టింగ్, ఫాంటసీ గేమింగ్‌లను ప్రోత్సహించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు