
తొలిసారి జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం
ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణాపై ‘షూటౌట్’లో విజయం
పంచ్‌కులా (హరియాణా): ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించింది. తొలిసారి జాతీయ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ‘షూటౌట్’ వరకు కొనసాగిన టైటిల్ సమరంలో అల్బెలా రాణి టొప్పో నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు 4–3 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా జట్టును ఓడించింది. 2011లో హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఆవిర్భవించాక 15 సార్లు జాతీయ చాంపియన్‌షిప్ జరిగింది. జార్ఖండ్ జట్టు ఆరుసార్లు (2012, 2013, 2014, 2022, 2023, 2024) మూడో స్థానాన్ని దక్కించుకోగా... ఒకసారి (2015) రన్నరప్‌గా నిలిచింది.
ఎనిమిదో ప్రయత్నంలో జార్ఖండ్ విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున కెప్టెన్ రాణి (42వ నిమిషంలో), జార్ఖండ్ తరఫున ప్రమోదిని లాక్రా (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జార్ఖండ్ తరఫున రజని కెర్కెట్టా, నిరాలి కుజుర్, బినిమా ధన్, అల్బెలా రాణి టొప్పో సఫలంకాగా... ష్యామీ బారా విఫలమైంది.
హరియాణ తరఫున సోనమ్, కెపె్టన్ రాణి గురి తప్పగా... పింకీ, అన్ను, మనీషా సఫలమయ్యారు. జార్ఖండ్ గోల్‌కీపర్ అంజలి బింజియా హరియాణా ప్లేయర్ల రెండు షాట్‌లను నిలువరించి తమ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిజోరం జట్టు తొలిసారి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మిజోరం జట్టు 2–1 గోల్స్ తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు అత్యధికంగా 8 సార్లు టైటిల్ దక్కించుకోగా... హరియాణా (3 సార్లు) రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రెండుసార్లు టైటిల్‌ను గెలవగా.. ఒడిశా, జార్ఖండ్ ఒక్కోసారి జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment