Haryana team
-
మెరిసిన షమ్స్, తనుశ్
కోల్‌కతా: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు చక్కటి పోరాట పటిమ కనబర్చింది. ఒక దశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆల్‌రౌండర్లు షమ్స్ ములానీ (178 బంతుల్లో 91; 10 ఫోర్లు), తనుశ్ కొటియాన్ (154 బంతుల్లో 85 బ్యాటింగ్) ఆదుకున్నారు. శనివారం హరియాణాతో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (9), శివమ్ దూబే (28) భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే (0), ఆకాశ్ ఆనంద్ (10), సిద్ధేశ్ లాడ్ (4) ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (15) ఒకరి వెంట ఒకరు పెవలియన్కుచేరారు. కెప్టెన్ అజింక్య రహానే (31) మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. అయితే చివర్లో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ జంట ఎనిమిదో వికెట్‌కు 165 పరుగులు జోడించి ముంబై జట్టును తిరిగి పోటీలోకి తెచ్చింది. హరియాణా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా... షమ్స్ ములానీ అవుట్ కాగా... తనుశ్తోపాటు మోహిత్ అవస్థి (0 బ్యాటింగ్) క్రీజులోఉన్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, సుమిత్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. కరుణ్ నాయర్ మరో సెంచరీ నాగ్‌పూర్: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (180 బంతుల్లో 100 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. తాజా సీజన్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ అజేయ శతకంతో విజృంభించడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అథర్వ తైడె (0), ధ్రువ్ షోరె (26), ఆదిత్య ఠాక్రే (5) విఫలమవడంతో ఒక దశలో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ జట్టును దానిశ్ మాలేవార్ (75; 13 ఫోర్లు)తో కలిసి కరుణ్ నాయర్ ఆదుకున్నాడు. ఇటీవల దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు శతకాలు బాది రికార్డు సృష్టించిన 33 ఏళ్ల కరుణ్ నాయర్... ఈ సెంచరీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 22వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు. యశ్ రాథోడ్ (13), కెపె్టన్ ఆకాశ్ వాడ్కర్ (24) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్‌తో పాటు హర్‡్ష దూబే (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర 216 ఆలౌట్ రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (26) విఫలమవడంతో గుజరాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. చిరాగ్ జానీ (148 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించగా, అర్పిత్ (39 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. పుజారా, హార్విక్ దేశాయ్ (22), షెల్డన్ జాక్సన్ (14), ప్రేరక్ మన్కడ్ (0), సమర్ గజ్జర్ (4) కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (14), ధర్మేంద్ర జడేజా (22) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కెపె్టన్ చింతన్ గాజా 4 వికెట్లు పడగొట్టగా... జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 195 పరుగులు వెనుకబడి ఉంది. జమ్ము కశ్మీర్ 228/8 పుణే: కేరళతో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో జమ్ము కశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జమ్ము కశ్మీర్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన జమ్ము కశ్మీర్ టాపార్డర్... నాకౌట్లో దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. నసీర్ (44), సాహిల్ (35), కన్హయ్య (48) కాస్త పోరాడారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
ముంబైకు ఎదురుందా!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు హరియాణాతో పోరుకు సిద్ధమైంది. శనివారం ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తరఫున స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లపై అందరి దృష్టి నిలవనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ హరియాణాలోని లాహ్లీలో నిర్వహించాల్సింది. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ చేజిక్కించుకున్న ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... పెద్దగా అనుభవం లేని హరియాణా జట్టు ముంబైకి ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ముంబై 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 29 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాకౌట్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 456 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. రహానే, సూర్యకుమార్, శివమ్ దూబే, సిద్ధేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీలతో ముంబై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్ శార్దుల్ జోరు మీదున్నాడు. అతడు గత మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 84 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్‌లో శార్దుల్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీ, ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘సి’లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 4 ‘డ్రా’ చేసుకున్న హరియాణా 29 పాయింట్లతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోయినా... ప్రతిభకు కొదువలేదు. అంకిత్ కుమార్, నిశాంత్ సింధు, హిమాన్షు రాణా, యువరాజ్ సింగ్, అన్షుల్ కంబోజ్, అనూజ్ ఠక్రాల్, జయంత్ యాదవ్‌లపై ఆ జట్టు అధికంగా ఆధారపడుతోంది. కరుణ్ నాయర్‌పైనే దృష్టి తాజా రంజీ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విదర్భ జట్టు... క్వార్టర్స్‌లో తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచిన మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న విదర్భ 40 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ సెంచరీల మీద సెంచరీలతో జోష్‌లో ఉండగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, అథర్వ తైడె, హార్ష్ దూబేతో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్, ఆకాశ్, ఆదిత్య కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో క్వార్టర్స్ చేరిన తమిళనాడు జట్టు... విజయ్ శంకర్, జగదీశన్, బాబా ఇంద్రజీత్ ప్రదర్శనపై ఎక్కువ ఆధారపడుతోంది. పుణేలో జరిగే మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ నుంచి 35 పాయింట్లు సాధించిన జమ్మూకశ్మీర్‌తో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచిన కేరళ జట్టు తలపడుతుంది. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్, సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. -
ఒడిశా పురుషుల హాకీ జట్టు సంచలనం... తొలిసారి జాతీయ టైటిల్ సొంతం
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షి ప్లో ఒడిశా జట్టు తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఒడిశా జట్టు 5–1 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ హరియాణా జట్టును బోల్తా కొట్టించి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ఒడిశా తరఫున శిలానంద్ లాక్రా (48వ, 57వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్ సాధించగా... రజత్ ఆకాశ్ టిర్కీ (11వ నిమిషంలో), ప్రతాప్ లాక్రా (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. హరియాణా జట్టుకు జోగిందర్ సింగ్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.96 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టుకిదే తొలి టైటిల్ కావడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 2–1తో మణిపూర్ జట్టును ఓడించింది. -
Vijay Hazare Trophy 2023: సెమీఫైనల్లో హరియాణా
రాజ్‌కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి. -
అఖిల భారత రవాణా కబడ్డీ టోర్నమెంట్ విజేత హర్యానా
సాక్షి, హైదరాబాద్: హకీంపేట ట్రాన్స్పోర్ట్ అకాడమీలో నిర్వహించిన అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ శనివారం సాయంత్రంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించగా.. ఈ పోటీలకు టీఎస్ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలకు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా.. తుది పోరులో హర్యానా రోడ్ వేస్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బి.ఎం.టి.సి) జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో హర్యానా జట్టు ఛాంపియన్‌గా .. బెంగళూరు జట్టు రన్నర్‌గా పతకాలు అందుకోగా మూడో స్థానంలో మహరాష్ట్ర ఆర్టీసీ జట్టు నిలిచింది. -
పట్టు బిగించిన హర్యానా
కల్నల్ సీకే నాయుడు అండర్-23 రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్ సోమవారం కడపలో ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్యానా జట్టు నిలకడగా రాణించింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 234 పరుగులతో పటిష్టస్థితిలో ఉంది. కడప స్పోర్ట్స్ : కల్నల్ సీకే నాయుడు అండర్-23 రాష్ట్రస్థాయి మ్యాచ్ సోమవారం కడపనగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో ప్రారంభమైంది. ఆంధ్రా-హర్యానా జట్ల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ హర్యానా జట్టును వరించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు జి.ఏ. సింగ్, ఎస్.జే బుద్వార్లు నిలకడగా రాణించడంతో మంచి ప్రారంభాన్నిచ్చారు. ఎస్జే బుద్వార్ను 58 పరుగుల వద్ద వినీల్ బౌల్డ్ చేయడంతో తొలివికెట్ పడింది. అనంతరం జి.ఏ. సింగ్ 43 పరుగులు, రోహిత్‌శర్మ 36 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన డాగర్ 79 పరుగులతో క్రీజులో ఉండగా ఈయనకు జతగా యాదవ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 234 పరుగులతో హర్యానా పటిష్టస్థితిలో ఉంది. కాగా ఆంధ్రా జట్టు బౌలర్ శశికాంత్ 2 వికెట్లు, వినీల్ 1 వికెట్ తీశారు. జాతీయజట్టులో చోటు సంపాదించాలి : వెంకటశివారెడ్డి జాతీయజట్టులో చోటు సంపాదించేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి అన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, సంయుక్త కార్యదర్శి ఎ. నాగసుబ్బారెడ్డి, సభ్యులు శివప్రసాద్, ఖాజా, మీడియాసెల్ మేనేజర్ నాగేష్కుమార్రాజు తదితరులు పాల్గొన్నారు.