![Ranji Trophy quarterfinals from today](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/surya.jpg.webp?itok=ywXI97p6)
నేటి నుంచి రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్
హరియాణాతో రహానే బృందం మ్యాచ్
విదర్భతో తమిళనాడు ‘ఢీ’
జమ్మూకశ్మీర్‌తో కేరళ పోరు
సౌరాష్ట్రతో గుజరాత్ సమరం
కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు హరియాణాతో పోరుకు సిద్ధమైంది. శనివారం ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తరఫున స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్‌లపై అందరి దృష్టి నిలవనుంది.
షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ హరియాణాలోని లాహ్లీలో నిర్వహించాల్సింది. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ చేజిక్కించుకున్న ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... పెద్దగా అనుభవం లేని హరియాణా జట్టు ముంబైకి ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం.
ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ముంబై 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 29 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాకౌట్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 456 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. రహానే, సూర్యకుమార్, శివమ్ దూబే, సిద్ధేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీలతో ముంబై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
ఆల్‌రౌండర్ శార్దుల్ జోరు మీదున్నాడు. అతడు గత మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 84 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్‌లో శార్దుల్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీ, ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కీలకం కానున్నారు.
మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘సి’లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 4 ‘డ్రా’ చేసుకున్న హరియాణా 29 పాయింట్లతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోయినా... ప్రతిభకు కొదువలేదు. అంకిత్ కుమార్, నిశాంత్ సింధు, హిమాన్షు రాణా, యువరాజ్ సింగ్, అన్షుల్ కంబోజ్, అనూజ్ ఠక్రాల్, జయంత్ యాదవ్‌లపై ఆ జట్టు అధికంగా ఆధారపడుతోంది.
కరుణ్ నాయర్‌పైనే దృష్టి
తాజా రంజీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విదర్భ జట్టు... క్వార్టర్స్‌లో తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచిన మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న విదర్భ 40 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ సెంచరీల మీద సెంచరీలతో జోష్‌లో ఉండగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, అథర్వ తైడె, హార్ష్ దూబేతో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్, ఆకాశ్, ఆదిత్య కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో క్వార్టర్స్ చేరిన తమిళనాడు జట్టు... విజయ్ శంకర్, జగదీశన్, బాబా ఇంద్రజీత్ ప్రదర్శనపై ఎక్కువ ఆధారపడుతోంది. పుణేలో జరిగే మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ నుంచి 35 పాయింట్లు సాధించిన జమ్మూకశ్మీర్‌తో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచిన కేరళ జట్టు తలపడుతుంది. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్, సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment