Quarterfinals
-
క్వార్టర్స్‌లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: వరుస సెట్లలో గెలిచిన భారత జోడీ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–రామ్ ద్వయం 6–3, 7–6 (7/4)తో జాకోపో బెరెటిని–ఎన్రికో డల్లా వాలె (ఇటలీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 6–4, 6–4తో గంటా సాయికార్తీక్ రెడ్డి (భారత్)–సుల్తానోవ్ (ఉజ్బెకిస్తాన్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 6–4, 6–3తో నికీ కలియంద పునాచా (భారత్)–జాన్ లాక్ (జింబాబ్వే)లపై, ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్) 4–6, 6–3, 10–6తో ఎంజో కుకాడో (ఫ్రాన్స్)–మైకేల్ గీర్ట్స్ (బెల్జియం)లపై, ఆదిల్ కల్యాణ్‌పూర్–కరణ్ సింగ్ (భారత్) 1–6, 6–2, 10–4తో నితిన్ కుమార్ సిన్హా–మనీశ్ సురేశ్‌కుమార్ (భారత్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
ముంబైకు ఎదురుందా!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు హరియాణాతో పోరుకు సిద్ధమైంది. శనివారం ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తరఫున స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లపై అందరి దృష్టి నిలవనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ హరియాణాలోని లాహ్లీలో నిర్వహించాల్సింది. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ చేజిక్కించుకున్న ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... పెద్దగా అనుభవం లేని హరియాణా జట్టు ముంబైకి ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ముంబై 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 29 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాకౌట్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 456 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. రహానే, సూర్యకుమార్, శివమ్ దూబే, సిద్ధేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీలతో ముంబై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్ శార్దుల్ జోరు మీదున్నాడు. అతడు గత మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 84 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్‌లో శార్దుల్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీ, ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘సి’లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 4 ‘డ్రా’ చేసుకున్న హరియాణా 29 పాయింట్లతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోయినా... ప్రతిభకు కొదువలేదు. అంకిత్ కుమార్, నిశాంత్ సింధు, హిమాన్షు రాణా, యువరాజ్ సింగ్, అన్షుల్ కంబోజ్, అనూజ్ ఠక్రాల్, జయంత్ యాదవ్‌లపై ఆ జట్టు అధికంగా ఆధారపడుతోంది. కరుణ్ నాయర్‌పైనే దృష్టి తాజా రంజీ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విదర్భ జట్టు... క్వార్టర్స్‌లో తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచిన మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న విదర్భ 40 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ సెంచరీల మీద సెంచరీలతో జోష్‌లో ఉండగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, అథర్వ తైడె, హార్ష్ దూబేతో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్, ఆకాశ్, ఆదిత్య కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో క్వార్టర్స్ చేరిన తమిళనాడు జట్టు... విజయ్ శంకర్, జగదీశన్, బాబా ఇంద్రజీత్ ప్రదర్శనపై ఎక్కువ ఆధారపడుతోంది. పుణేలో జరిగే మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ నుంచి 35 పాయింట్లు సాధించిన జమ్మూకశ్మీర్‌తో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచిన కేరళ జట్టు తలపడుతుంది. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్, సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ జోరు
షెన్జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న తొలి టోర్నమెంట్ చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ జోడీగా ఈ టోర్నీలో ఆడుతున్న సాత్విక్–చిరాగ్ ద్వయం కష్టపడి గెలిచి ముందంజ వేసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–19, 21–15తో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం రస్ముస్ జార్–ఫ్రెడెరిక్ సొగార్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ చివర్లో సాత్విక్–చిరాగ్ పైచేయి సాధించారు. రెండో గేమ్‌లో స్కోరు 13–12 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 3–6తో వెనుకబడి ఉండటం గమనార్హం. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–16, 21–18తో అలవోకగా గెలిచాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో దూకుడుగా ఆడాడు. 13–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రస్ముస్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యాన్ని 13–10కి తగ్గించాడు. ఈ దశలో లక్ష్య సేన్ నిలకడగా రాణించి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య సేన్‌కు గట్టిపోటీ ఎదురైంది. పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. అయితే కీలకదశలో లక్ష్య సేన్ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న నాలుగో టోరీ్నలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం గమనార్హం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–4తో వెనుకంజలో ఉన్నాడు. ముగ్గురికీ నిరాశ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సింధు 16–21, 21–17, 21–23తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూసింది. గతంలో జియా మిన్తో ఆడిన ఐదుసార్లూ నెగ్గిన సింధుకు ఆరోసారి మాత్రం చుక్కెదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 13–9తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో జియో మిన్ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 15–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు జియా మిన్ కొట్టిన బాడీ స్మాష్‌కు సింధు జవాబివ్వలేకపోవడంతో ఆమె ఓటమి ఖరారైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక 9–21, 9–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో, అనుపమ 7–21, 14–21తో నత్సుకి నిదైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 16–21, 11–21తో రెండో సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట ‘వాకోవర్’ ఇచ్చింది. -
FIFA: మొరాకో సంచలనం.. స్పెయిన్‌కు షాక్! చెత్త రికార్డు.. టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup 2022 Morocco Vs Spain- దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 2010 విజేత స్పెయిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిముఖం పట్టింది. ఆఫ్రికా ఖండానికి చెందిన ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో జట్టు మొండి పట్టుదలతో ఆడి ఏడో ర్యాంకర్ స్పెయిన్‌ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ప్రిక్వార్టర్స్‌లో ఈ రెండు జట్లు నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ గోల్స్ చేయలేకపోయాయి. దాంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. వరుసగా మూడు షాట్లను లక్ష్యానికి పంపించలేకపోయారు. షూటౌట్లో ఇలా సరాబియా తొలి షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా... సోలెర్ రెండో షాట్‌ను.. బుస్క్వెట్స్ మూడో షాట్‌ను మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో నేర్పుతో నిలువరించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు పెనాల్టీ షూటౌట్లలో ఓడిన జట్టుగా స్పెయిన్ నిలిచింది. పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో ఈనెల 10న క్వార్టర్ ఫైనల్లో మొరాకో తలపడుతుంది. మొరాకో ఘనత ► ప్రపంచకప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో ఆఫ్రికా దేశం మొరాకో. గతంలో కామెరూన్ (1990లో), సెనెగల్ (2002లో), ఘనా (2010లో) ఈ ఘనత సాధించాయి. చదవండి: Virender Sehwags son: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జపాన్ ఓపెన్‌లో ముగిసిన ప్రణయ్ పోరాటం
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్లు పోరాటం ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా నిష్క్రమించగా.. చివరగా ఆశలు పెట్టుకున్న హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఇంటిబాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో 17-21, 21-15, 20-22 తేడాతో ప్రణయ్ ఓటమిపాలైయ్యాడు. కాగా ప్రణయ్ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్ ఆటగాడు కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) మట్టికరిపించి క్వార్టర్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు ఈ టోర్నీ తొలి రౌండ్లో లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా.. ఫ్రీ క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్‌ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు! -
Indonesia Masters 2022: సింధు నిష్క్రమణ
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పీవీ సింధు, లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధుకిది తొమ్మిదో ఓటమి. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో చివరిసారి రచనోక్‌పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్ ప్లేయర్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 62 నిమిషాల్లో 16–21, 21–12, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్‌లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
Indonesia Masters: క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11 స్కోరుతో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. 71 నిమిషాల పాటు ఈ పోరు సాగడం విశేషం. చివరి గేమ్‌లో మాత్రం సింధు ఏకపక్షంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ లక్ష్య సేన్ 21–18, 21–15తో రస్మస్ గెమ్కె (డెన్మార్క్)ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం సుమీత్ రెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి పరాజయంతో వెనుదిరిగింది. రెండో సీడ్ చైనా ద్వయం జెంగ్ సీ వీ– హువాంగ్ కియాంగ్ 21–18, 21–13తో భారత జంటను ఓడించారు. -
French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 13 సార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) తమ జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గగా... ఐదో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–4తో వాన్ డె జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. బెడెన్‌తో గంటా 44 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. జాండ్షుల్ప్తో జరిగిన పోరులో నాదల్ ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో 15వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–3, 6–1, 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), అజరెంకా (బెలారస్) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో బెన్‌చిచ్ 5–7, 6–3, 5–7తో 17వ సీడ్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా) చేతిలో, కెర్బర్ 4–6, సాస్నోవిచ్ (బెలారస్) చేతిలో, అజరెంకా 6–4, 5–7, 6–7 (5/10)తో జిల్ టెక్మన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయారు. -
Badminton Asia Championships: పతకానికి విజయం దూరంలో సింధు
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండో పతకం ఖరారు చేసుకోవడానికి భారత స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 100వ ర్యాంకర్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్)తో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–16తో విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 7–9తో వెనుకబడి ఉంది. సైనా, శ్రీకాంత్ పరాజయం భారత మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21–12, 7–21, 13–21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–17, 17–21తో ప్రపంచ 81వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–15తో అకీరా కోగా –తైచి సైటో (జపాన్) ద్వయంపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 18–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
2022 BMW Open: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. మ్యూనిక్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 4–6తో మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 4,950 యూరోల (రూ. 3 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
బాసెల్: భారత అగ్రశ్రేణి షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్‌లు కూడా క్వార్టర్స్ చేరగా... వెటరన్ స్టార్ సైన నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–19, 21–14తో నెస్లిహన్ యిగిట్ (టర్కీ)పై గెలుపొందగా, సైనా నెహ్వాల్ 21–17, 13–21, 13–21తో మలేసియా షట్లర్ కిసొన సెల్వదురై చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 13–21, 25–23, 21–11తో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపొవ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సీనియర్ షట్లర్ కశ్యప్‌కు అదృష్టం కలిసొచ్చి వాకోవర్‌తో ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్తో తలపడాల్సిన పోరులో ప్రత్యర్థి బరిలోకి దిగలేదు. దీంతో ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత కశ్యప్ ఒక టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 19–21, 21–13, 21–9తో కలే కోల్జొనెన్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట 19–21, 20–22తో ప్రముద్య కుసుమవర్దన–యెరెమియా రంబితన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. -
మెద్వెదెవ్ అద్భుతం
ఒకే ఒక్క తప్పిదం చేసి ఉంటే ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ బుధవారమే విమానమెక్కి స్వదేశం రష్యాకు వెళ్లిపోయేవాడు. కానీ కెనడా యువతార ఫిలిక్స్ అగుర్ అలియాసిమ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ రష్యా స్టార్ ఓటమి అంచులలో నిగ్రహం కోల్పోకుండా సమయస్ఫూర్తితో ఆడి నిలబడ్డాడు. నాలుగో సెట్లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. అదే జోరులో సెట్‌నూ గెలిచాడు. తుది ఫలితం కోసం మ్యాచ్‌ను ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. ఆఖరి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి బ్రేక్ చేశాడు. ఆ ఆధిక్యాన్ని చివరిదాకా నిలబెట్టుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో ఏడాది సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మెల్బోర్న్: కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా రష్యా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ మరో అడుగు వేశాడు. గత ఏడాది రన్నరప్, 25 ఏళ్ల మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 21 ఏళ్ల ఫిలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 6–7 (4/7), 3–6, 7–6 (7/2), 7–5, 6–4తో గెలుపొందాడు. 4 గంటల 42 నిమి షాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ 15 ఏస్‌లు సంధించాడు. తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 53 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 41 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచిన మెద్వెదెవ్ 49 విన్నర్స్ కొట్టాడు. కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఫిలిక్స్‌కు నాలుగో సెట్లో స్కోరు 5–4 (40–30) వద్ద మెద్వెదెవ్ సర్వీస్‌లో మ్యాచ్ పాయింట్ అవకాశం లభించింది. అయితే దానిని ఫిలిక్స్ చేజార్చు కున్నాడు. ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో మెద్వెదెవ్ పాయింట్ సాధించి గేమ్‌ను దక్కించుకొని స్కోరు ను 5–5తో సమం చేశాడు. ఫిలిక్స్ 11వ గేమ్‌లో మెద్వెదెవ్ బ్రేక్ పాయింట్ సాధించి 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని మెద్వెదెవ్ సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో మెద్వెదెవ్ మూడో గేమ్‌లో ఫిలిక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఫిలిక్స్ 18 ఏస్‌లు సంధించాడు. అయితే నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 75 అనవసర తప్పిదాలు ఫిలిక్స్ ఓటమికి బాట వేశాయి. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–4, 6–2తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి సెమీఫైనల్లో మెద్వెదెవ్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. సెమీస్‌లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కయా కనెపి (ఎస్తోనియా)తో 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 4–6, 7–6 (7/2), 6–3తో గెలిచి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. కొలిన్స్ గంటా 28 నిమిషాల్లో 7–5, 6–1తో అలిజె కార్నెట్ (ఫ్రాన్స్)పై నెగ్గి 2019 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ రెండు సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో మాడిసన్ కీస్ (అమెరికా); స్వియాటెక్‌తో కొలిన్స్ తలపడతారు. -
Australia Open: నాదల్ దూకుడు
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 14వ సారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 7–6 (16/14), 6–2, 6–2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2007 నుంచి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారీ నాదల్ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 2013లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న నాదల్ 2016లో మాత్రం తొలి రౌండ్లో ఓడిపోయాడు. మనారినోతో 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్కు తొలి సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 81 నిమిషాలపాటు సాగిన తొలి సెట్లో నాదల్ నాలుగుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకున్నాడు. 28 నిమిషాల 40 సెకన్లపాటు జరిగిన టైబ్రేక్‌లో తుదకు నాదల్ 16–14తో పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత నాదల్ జోరు పెంచగా, మనారినో డీలా పడ్డాడు. షపోవలోవ్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కెనడాకు చెందిన 14వ సీడ్ డెనిస్ షపోవలోవ్ 2 గంటల 21 నిమిషాల్లో 6–3, 7–6 (7/5), 6–3తో జ్వెరెవ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న షపోవలోవ్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 7–5, 7–6 (7/4), 6–4తో 19వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్)పై, 17వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 7–5, 7–6 (7/4), 6–3తో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. -
సెమీస్‌లో సింధు
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 12–21, 8–21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–19, 21–19తో గో జె ఫె–నూరూజుద్దీన్ (మలేసియా) జంటపై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సిక్కి–అశ్విని జంట అర్హత బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి–అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది. -
క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్ దేవ్ (71 కేజీలు), సంజీత్ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌ల్లో నిశాంత్ దేవ్ 3–2తో మార్కో అల్వారెజ్ వెర్డె (మెక్సికో)పై, సంజీత్ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ (భారత్) 1–4తో సెరిక్ (కజకిస్తాన్) చేతిలో.... ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 0–5తో కెవిన్ బ్రౌన్ (క్యూబా) చేతిలో ... సుమిత్ (75 కేజీలు) 0–5తో యోన్లిస్ (క్యూబా) చేతిలో... దీపక్ 0–5తో సాకెన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
సెమీస్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–14తో బుసానన్ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 15–21తో హెయో క్వాంగ్గీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–18, 18–21, 17–21తో ఆరోన్ చియా–సో వుయ్ యికి (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–9తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్‌లో 0–5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ (భారత్) 21–17, 21–13తో లో కీన్ య్యూ (సింగపూర్)పై నెగ్గాడు. హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్ నుంచి సమీర్ వర్మ (భారత్) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప–సాత్విక సాయిరాజ్ 21–15, 17–21, 19–21తో రెండో సీడ్ మెలాటి ఒక్తవియాంటి–ప్రవీణ్ జొర్డాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక..
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రష్మిక 6–2, 6–2తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములపై అలవోకగా గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం రెండో రౌండ్లో ముగిసింది. షర్మదా బాలు (కర్ణాటక)తో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 7–5తో గెలిచి, రెండో సెట్‌ను 1–6తో కోల్పోయింది. మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా శ్రావ్య శివాని వైదొలిగింది. మరో మ్యాచ్‌లో తటవర్తి శ్రేయ (ఆంధ్రప్రదేశ్) 6–2, 3–6, 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో... స్మృతి భాసిన్ (తెలంగాణ) 4–6, 1–6తో ఆకాంక్ష (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయారు. విష్ణు పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రెండో రౌండ్లో నిక్కీ 6–4, 6–3తో ఫైజల్ కమర్ (రాజస్తాన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ‘లండన్ ఒలింపియన్’ విష్ణువర్ధన్ (తెలంగాణ) 4–6, 1–6తో నితిన్ కుమార్ సిన్హా (పశి్చమ బెంగాల్) చేతిలో... కాజా వినాయక్ శర్మ (ఆంధ్రప్రదేశ్) 4–6, 6–7 (2/7)తో సిద్ధార్థ్ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయారు చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు
ఒడెన్స్: టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 36 నిమిషాల్లో 11–21, 12–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది. ఆన్ సెయంగ్‌తో పోరులో సింధు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలుత సింధు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఆన్ సెయంగ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఆన్ సెయంగ్ వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్‌లోనూ ఆన్ సెయంగ్ జోరు కొనసాగింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరు స్కోర్లు సమం కాకపోవడం ఆన్ సెయంగ్ ఆధిపత్యానికి నిదర్శనం. మరోవైపు టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ తొలి గేమ్‌ను 17–21తో చేజార్చుకున్నాక గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 12–21, 21–15తో బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్ (థాయ్‌లాండ్)పై పోరాడి గెలిచింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు సులభంగా చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న బుసానన్ వరుసగా పాయింట్లను సాధిస్తూ సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది. దాంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారి తీసింది. ఇక్కడ లయను అందుకున్న సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21–23, 9–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, లక్ష్యసేన్ 15–21, 7–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 15–21, 15–21తో గో జె ఫీ–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంట చేతిలో ఓడగా... మరో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 15–21, 21–17, 12–21తో ఫజార్ అల్ఫియాన్– మొహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం ధ్రువ కపిల–సిక్కి రెడ్డి 17–21, 21–19, 11–21తో తాంగ్ చున్మన్– త్సెయింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
‘రియో’ విజేతను ఓడించి...
టోక్యో: మూడు దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. తమ ఖాతాలో మూడో విజయం జమ చేసుకొని క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా గురువారం జరిగిన పూల్ ‘ఎ’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్జెంటీనాను ఓడించింది. క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున వరుణ్ కుమార్ (43వ నిమిషం), వివేక్ సాగర్ ప్రసాద్ (58వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా... అర్జెంటీనా తరఫున కాసెలా షుట్ (9వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు. తొలి క్వార్టర్‌లోనే గోల్ అప్పగించి వెనుకబడినా... భారత జట్టు ఆ తర్వాత చెలరేగి దూసుకుపోయింది. తాజా విజయంతో పూల్ ‘ఎ’ నుంచి కనీసం రెండో స్థానంలో భారత్ క్వార్టర్స్ చేరడం ఖాయమైంది. నేడు జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. మెరిసిన మనూ... మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ క్వాలిఫయింగ్ విభాగం స్టేజ్–1 (ప్రెసిషన్)లో భారత షూటర్లు మనూ భాకర్ ఐదో స్థానంలో నిలువగా.... రాహీ సర్నోబత్ 25వ స్థానంలో నిలిచింది. మొత్తం 44 మంది షూటర్లు పాల్గొనగా... అందుబాటులో ఉన్న 300 పాయింట్లకుగానూ మనూ 292 పాయింట్లు సాధించింది. రాహీ 287 పాయిం ట్లు స్కోరు చేసింది. జొరానా అరునోవిచ్ (సెర్బియా– 296), అన్నా కొరకాకి (గ్రీస్– 294), ఆంటోనెటా కొస్టాడినోవా (బల్గేరియా–293) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నేడు క్వాలిఫయింగ్ స్టేజ్–2 (ర్యాపిడ్) జరగనుంది. ఈ రెండు అర్హత పోటీల్లో సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్ కూడా శుక్రవారమే జరగనుంది. 11వ స్థానంతో సరి రోయింగ్‌లో భారత ప్రయాణం ముగిసింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో మెడల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయిన అర్జున్ లాల్–అరవింద్ సింగ్ జంట 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 7–12 స్థానాల కోసం గురువారం జరిగిన రేసులో గ్రూప్ ’బి’ నుంచి బరిలోకి దిగిన భారత జోడీ 6ని:29.46 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఓవరాల్‌గా మాత్రం 11వ స్థానంలో నిలిచింది. గోల్ఫ్: 8వ స్థానంలో అనిర్బన్ రెండోసారి ఒలింపిక్స్‌లో ఆడుతోన్న భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల గోల్ఫ్ తొలి రౌండ్‌ను అతడు ఎనిమిదో స్థానంతో ముగించాడు. 18 హోల్స్ కోర్సును 67 షాట్లల్లో పూర్తి చేసిన అనిర్బన్... సెబాస్టియన్ (కొలంబియా), పాల్ కేసీ (బ్రిటన్), అలెక్స్ నొరెన్ (స్వీడన్)లతో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరో భారత గోల్ఫర్ ఉదయన్ మానె 76 షాట్లల్లో కోర్సును ముగించి చివరి స్థానం (60వ)లో నిలిచాడు. ఈ ఈవెంట్ నాలుగు రౌండ్ల పాటు జరగనుండగా... 60 మంది పతకం రేసులో ఉన్నారు. మన అశ్వం బాగుంది ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ) ఈవెంట్లో పాల్గొనడానికి భారత రైడర్ ఫౌద్ మీర్జా కు లైన్ క్లియర్ అయింది. అతని ఈక్వైన్ (గుర్రం) సంపూర్ణ ఆరోగ్యం తో ఉందంటూ ఈవెంట్ జడ్జింగ్ కమిటీ తన రిపోర్టులో పేర్కొంది. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ జరగడానికి ముందు పోటీల్లో పాల్గొనే రైడర్ల గుర్రాలను జడ్జింగ్ కమిటీ పరిశీలిస్తుంది. వాటికి పోటీలో పాల్గొనేందుకు సరిపడా ఫిట్నెస్ ఉందా... ఏమైనా గాయాలు ఉన్నాయా అనే విషయాలను చూస్తారు. ఒకవేళ వారి పరిశీలనలో గుర్రానికి గాయాలు ఉన్నట్లు తేలితే... దానిని పోటీ నుంచి తొలగిస్తారు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనుండగా... ఫౌద్ మీర్జా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
ఫెడరర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రికార్డుస్థాయిలో 22వసారి బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గతంలో ఎనిమిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన 39 ఏళ్ల ఫెడరర్‌ను 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్) ఇంటిముఖం పట్టించాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల హుబర్ట్ 6–3, 7–6 (7/4), 6–0తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్‌పై హుబర్ట్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. హుబర్ట్ దూకుడైన ఆటకు ఫెడరర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. సునాయాసంగా గెలవాల్సిన పాయింట్లను కూడా ఫెడరర్ కోల్పోయాడు. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన ఫెడరర్ మూడు డబుల్ట్ ఫాల్ట్‌లు చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 81 కేజీల బరువున్న హుబర్ట్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఫెడరర్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. పదోసారి సెమీస్‌లో జొకోవిచ్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–4తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి పదోసారి సెమీఫైనల్లోకి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)తో జొకోవిచ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో షపోవలోవ్ 6–4, 3–6, 5–7, 6–1, 6–4తో 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరాడు. పోరాడి ఓడిన సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జంట 3–6, 6–3, 9–11తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)– క్లెపాక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తన కెరీర్లో ఫెడరర్ ప్రత్యర్థికి ఓ సెట్‌ను 0–6తో కోల్పోవడం ఇది ఐదోసారి మాత్రమే. గతంలో విన్సెంట్ స్పాడియా (1999లో మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ), ప్యాట్రిక్ రాఫ్టర్ (1999లో ఫ్రెంచ్ ఓపెన్), బైరన్ బ్లాక్ (1999లో క్వీన్స్ క్లబ్ టోర్నీ), నాదల్ (2008లో ఫ్రెంచ్ ఓపెన్) మాత్రమే ఫెడరర్‌ను ఓ సెట్లో 6–0తో ఓడించారు. గ్రాస్‌కోర్టులపై ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన నాలుగో ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్. గతంలో కఫెల్నికోవ్ (వింబుల్డన్ –2000), అన్చిచ్ (వింబుల్డ¯Œ –2002), ఆండీ ముర్రే (లండన్ ఒలింపిక్స్–2012) ఈ ఘనత సాధించారు. -
Arjun Erigaisi: క్వార్టర్ ఫైనల్లో అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాపిడ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ ప్రిలిమినరీ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత యువతార అర్జున్ ఇరిగైసి ఎనిమిదో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 16 మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ 15 రౌండ్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసి నాకౌట్ దశకు అర్హత సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచాడు. సోమవారం ఆడిన ఐదు గేమ్‌లను 17 ఏళ్ల అర్జున్ (2567 ఎలో రేటింగ్) ‘డ్రా’ చేసుకోవడం విశేషం. 14వ రౌండ్ గేమ్‌లో ప్రస్తుతం క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ (నార్వే–2847 రేటింగ్)ను అర్జున్ 63 ఎత్తుల్లో నిలువరించి ‘డ్రా’ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. సో వెస్లీ (అమెరికా–2770)తో 11వ గేమ్‌ను 11 ఎత్తుల్లో... స్విద్లెర్ (రష్యా– 2714)తో 12వ గేమ్‌ను 40 ఎత్తు ల్లో... సలీమ్ (యూఏఈ–2682)తో 13వ గేమ్‌ను 36 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్–2780)తో జరిగిన చివరిదైన 15వ గేమ్‌ను అర్జున్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అరోనియన్‌తో అర్జున్; కార్ల్సన్తో సో వెస్లీ; లిరెన్ డింగ్‌తో జాన్ క్రిస్టాఫ్; వ్లాదిస్లావ్తో అనీశ్ గిరి తలపడతారు. భారత్‌కే చెందిన విదిత్ 10వ ర్యాంక్‌లో, గుకేశ్ 12వ ర్యాంక్‌లో, ఆధిబన్ 15వ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయారు. -
ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) అతికష్టమ్మీద క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. డెనిస్ షపవలోవ్ (కెనడా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 3–6, 6–4, 7–6 (7/3)తో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు. రెండో సెట్లో 0–3తో... మూడో సెట్లో 1–3తో వెనుకబడిన నాదల్ చివరకు 5–6 స్కోరు వద్ద తన సర్వీస్‌లో ఏకంగా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని గట్టెక్కాడు. -
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 18–21, 21–15, 21–10తో మరీ బటోమెనె (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గింది. 51 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా... అనంతరం పుంజుకొని తర్వాతి రెండు గేముల్లోనూ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఐరా శర్మ (భారత్) 21–18, 21–13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై గెలిచి క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 22–20తో చెమ్ జునే వీ (మలేసియా)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ పోరుల్లో అర్జున్– ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–11, 21–12తో రోరీ ఇస్టోన్–జాక్ రస్ జంట (ఇంగ్లండ్)పై, కృష్ణ ప్రసాద్– విష్ణువర్ధన్ (భారత్) జోడీ 21–7, 21–13తో క్రిస్టియన్ క్రెమర్–మార్కస్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–12, 21–18తో కాల మ్ హెమ్మింగ్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరింది. సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 7–21తో నిక్లాస్ నోర్– అమలీ మెగెలండ్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడింది. -
నాదల్ కల చెదిరె..
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బుధవారం సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాలనుకున్న స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ కల చెదిరింది. మహిళల విభాగంలోనూ టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)కి చుక్కెదురైంది. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 13వ సారి క్వార్టర్స్ చేరిన నాదల్ గెలుపు అంచుల నుంచి ఓటమిని ఆహ్వానించాడు. 4 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–7 (4/7), 4–6, 5–7తో ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీక్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లను నెగ్గి, నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో అనవసర తప్పిదాలతో నాదల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైబ్రేక్ 3/3తో సమమైన దశలో 3 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 4/7తో సెట్‌ను సిట్సిపాస్‌కు కోల్పోయాడు. మరోవైపు అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్ జాగ్రత్తగా ఆడుతూ నాలుగో సెట్లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–4తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఐదో సెట్లో ఓ దశలో ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. అయితే పదకొండో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్... పన్నెండో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్‌తో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లలో వెనుకబడి తర్వాత విజయం సాధించిన రెండో ప్లేయర్‌గా 22 ఏళ్ల సిట్సిపాస్ ఘనత వహించాడు. 2015 యూఎస్ ఓపెన్‌లో ఫాబియో ఫాగ్నిని ఇదే తరహాలో నాదల్‌పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ 18, నాదల్ 15 ఏస్‌లు సంధించారు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 2019 యూఎస్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–3, 6–2తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో సిట్సిపాస్‌తో మెద్వెదెవ్ తలపడతాడు. బార్టీకి షాక్ మహిళల విభాగంలో సొంత మైదానంలో జరిగిన పోరులో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీకి 25వ సీడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) షాకిచ్చింది. గంటా 7 నిమిషాల పాటు సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బార్టీ 1–6, 6–3, 6–2తో ముచోవా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లు సంధించిన బార్టీ 3 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు 2 ఏస్‌లే సంధించిన ముచోవా... ప్రత్యర్థి సర్వీస్‌ను 4సార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను 3 సార్లు కోల్పోయింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) 4–6, 6–2, 6–1తో జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. నేడు జరిగే మహిళల తొలి సెమీస్‌లో సెరెనా (అమెరికా)తో నయోమి ఒసాకా (జపాన్), రెండో సెమీస్‌లో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు. -
నాదల్ జోరు
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పే దిశగా రాఫెల్ నాదల్ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ స్పెయిన్ టెన్నిస్ స్టార్ 13వసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ఏకపక్ష ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 6–4, 6–2తో ప్రపంచ 17వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై గెలుపొందాడు. 2015 యూఎస్ ఓపెన్‌లో నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఫాగ్నిని ఈసారి మాత్రం చేతులెత్తేశాడు. 2 గంటల 16 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ ఫాగ్నినికి అవకాశం ఇవ్వని నాదల్ ఆరు ఏస్‌లు సంధించి, ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో నాదల్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్‌కు తన ప్రత్యర్థి, తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) నుంచి వాకోవర్ లభించింది. రష్యా యువ స్టార్ ఆటగాళ్లు మెద్వెదేవ్, రుబ్లెవ్ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ 6–4, 6–2, 6–3తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై నెగ్గగా... ఏడో సీడ్ రుబ్లెవ్ 6–2, 7–6 (7/3)తో కాస్పెర్ రూడ్ (నార్వే)ను ఓడించాడు. రెండు సెట్లు ముగిశాక గాయం కారణంగా రూడ్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. యాష్లే బార్టీ దూకుడు... మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) క్వార్టర్ ఫైనల్ చేరగా... ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)కు అమెరికా యువతార జెస్సికా పగూలా షాక్ ఇచ్చింది. బార్టీ 6–3, 6–4తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలుపొందగా... జెస్సికా పగూలా 6–4, 3–6, 6–3తో స్వితోలినాను బోల్తా కొట్టించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–5తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా) 6–1, 7–5తో డొనా వెకిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. -
శ్రమించి... సాధించి
మెల్బోర్న్: తొలి మూడు రౌండ్లలో అంతగా కష్టపడకుండానే విజయాలు నమోదు చేసుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), సిమోనా హలెప్ (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్)లకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. అయితే ఈ ‘గ్రాండ్‌స్లామ్ విన్నర్స్’ కీలకదశలో తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పదో సీడ్ సెరెనా 2 గంటల 9 నిమిషాల్లో 6–4, 2–6, 6–4తో ఏడో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రెండో సీడ్ హలెప్ గంటా 50 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై... మూడో సీడ్ ఒసాకా గంటా 55 నిమిషాల్లో 4–6, 6–4, 7–5తో గత ఏడాది రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)పై అద్భుత విజయాలు సాధించారు. ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో ఒసాకా 3–5తో వెనుకబడింది. రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాచుకున్న ఆమె వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–4, 6–2తో 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, 19వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సె సువె సింగిల్స్ విభాగంలో మాత్రం తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో సీడ్ థీమ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన థీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 4–6, 0–6తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో థీమ్ ఏకంగా 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పది ఏస్‌లు సంధించడంతోపాటు థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన దిమిత్రోవ్ ఈ గెలుపుతో నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. జొకోవిచ్ @ 300 మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), క్వాలిఫయర్ అస్లాన్ కరాత్సెవ్ (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 7–6 (7/4), 4–6, 6–1, 6–4తో 14వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మరో మ్యాచ్‌లో కరాత్సెవ్ 3–6, 1–6, 6–3, 6–3, 6–4తో 20వ సీడ్ ఉజెర్ ఆలియాసిమ్ (కెనడా)ను ఓడించి అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారుడిగా ఘనత వహించాడు. మరో మ్యాచ్‌లో జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–3తో లజోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. -
శ్రీకాంత్ ఆరో‘సారీ’...
ఒడెన్స్: ఏడు నెలల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 22–20, 13–21, 16–21తో ఓడిపోయాడు. చౌ తియెన్ చెన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. శ్రీకాంత్ ఏకైకసారి 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్పై గెలిచాడు. ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో తలపడిన ఆరుసార్లూ (2015 వరల్డ్ సూపర్‌సిరీస్ ఫైనల్స్; 2017 వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్; 2018 చైనా ఓపెన్; 2019 ఫ్రెంచ్ ఓపెన్; 2020 మలేసియా మాస్టర్స్ టోర్నీ; 2020 డెన్మార్క్ ఓపెన్) శ్రీకాంత్‌ను పరాజయమే పలకరించింది. 62 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... రెండో గేమ్ నుంచి ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ తడబడ్డాడు. ఒకదశలో 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. నిర్ణాయక మూడో గేమ్ లోనూ తియెన్ చెన్ పైచేయి సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 4,125 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీకాంత్ జోరు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత అగ్రశ్రేణి షట్లర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా... లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–14తో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–15, 7–21, 17–21తో హాన్స్ క్రిస్టియాన్ సోల్బెర్గ్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. దూకుడే మంత్రంగా... 33 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే 9–4తో జోరు కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు 11–8తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 17–9తో దూసుకెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆరంభంలో శ్రీకాం త్ 5–8తో వెనుకబడ్డాడు. ఈ దశలో పుంజుకున్న అతను వరుసగా 6 పాయింట్లు స్కోర్ చేసి 11–8తో రేసులోకి వచ్చాడు. జేసన్ 10–11తో శ్రీకాంత్‌ను సమీపించాడు. మరోసారి ధాటిగా ఆడిన శ్రీకాంత్ 15–11... 19–11తో ప్రత్యర్థిపై దాడి చేసి విజయా న్ని దక్కించుకున్నాడు. నేడు జరుగనున్న క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్–2 ఆటగాడు చౌ టియాన్ చెన్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడతాడు. -
నాదల్ సరసన జొకోవిచ్
పారిస్: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రాఫెల్ నాదల్ ఒక్కడే అత్యధికంగా 14 సార్లు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. అయితే నాదల్ రికార్డును టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ సోమవారం సమం చేశాడు. ఈ సెర్బియా స్టార్ కూడా 14వ సారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని నాదల్ సరసన చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 6–3తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. ఈ టోర్నీలో వరుసగా 11వసారి క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఖచనోవ్‌తో 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన పోరులో జొకోవిచ్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. 28 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈసారి జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) రెండుసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 7–6 (11/9), 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 7–5, 6–4, 7–6 (7/3)తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి తమ కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. క్విటోవా 2012 తర్వాత... మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి లౌరా సిగెముండ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్విటోవా 6–2, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై, లౌరా సిగెముండ్ 7–5, 6–2తో పౌలా బడోసా (స్పెయిన్)పై గెలిచారు. కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న లౌరా తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. మరోవైపు క్విటోవా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 2–6, 6–2, 6–1తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్)పై నెగ్గింది. -
చైనాకు భారత్ షాక్
చెన్నై: సీనియర్ గ్రాండ్‌మాస్టర్ల ప్రదర్శనకు తోడు యువ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఆర్.ప్రజ్ఞానంద, మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యూఐఎం) దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయాల కారణంగా ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు పటిష్టమైన చైనాకు 4–2తో షాక్ ఇచ్చింది. లీగ్ దశలో అజేయంగా నిలిచి పూల్ ‘ఎ’లో 17 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు నెగ్గడం విశేషం. తొలుత భారత్ ఏడో రౌండ్లో 4–2తో జార్జియాపై... ఎనిమిదో రౌండ్లో 4.5–1.5తో జర్మనీపై... తొమ్మిదో రౌండ్లో 4–2తో చైనాపై విజయం సాధించింది. (చదవండి: అజహర్ అలీ సెంచరీ: పాక్ 273 ) భారత్ క్వార్టర్ ఫైనల్ చేరడంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించారు. చైనాతో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ 71 ఎత్తుల్లో జినెర్ జుపై; 15 ఏళ్ల ప్రజ్ఞానంద 66 ఎత్తుల్లో యాన్ లియుపై గెలుపొందారు. 32వ ర్యాంకర్ యాంగి యుతో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 63 ఎత్తుల్లో... మహిళల ప్రపంచ నంబర్‌వన్ యు ఇఫాన్‌తో జరిగిన గేమ్‌ను హంపి 42 ఎత్తుల్లో... ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ జూ వెన్జున్తో జరిగిన గేమ్‌ను హారిక 41 ఎత్తుల్లో... ప్రపంచ మూడో ర్యాంకర్ డింగ్ లిరెన్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈనెల 28న క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. (ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో కలిస్, లీసా, జహీర్ అబ్బాస్) -
శ్రీకాంత్ ఓటమి
కౌలాలంపూర్: తొలిరోజేమో సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్... రెండో రోజు సైనా నెహ్వాల్... మూడో రోజు పీవీ సింధు... ఇలా మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మొదలైన రోజు నుంచి ప్రతీ రౌండ్లో ఒకరిద్దరు భారత షట్లర్లు ఓడుతూ వచ్చారు. నేడు కిడాంబి శ్రీకాంత్ ఓటమితో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలివున్న ఒకే ఒక్క తెలుగుతేజం క్వార్టర్ ఫైనల్లో కంగుతిన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 18–21, 19–21తో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలిగేమ్ ఆరంభంలో 6–3తో జోరు పెంచిన శ్రీకాంత్ ఒక్కసారి మినహా 16–15స్కోరు దాకా ఆధిక్యంలోనే కొనసాగాడు. కానీ ఒలింపిక్ చాంపియన్ ఆఖర్లో జాగ్రత్తగా ఆడటం, ఏపీ ఆటగాడు అనవసర తప్పిదాలు చేయడం గేమ్‌ను చేజార్చింది. రెండో గేమ్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 7–8 వరకు చక్కగా పోరాడిన తెలుగు షట్లర్... చెన్ లాంగ్ జోరు పెంచడంతో 8–16తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్ వరుసగా పాయింట్లు గెలిచి 18–18తో ప్రత్యర్థిని నిలువరించాడు. చివర్లో మళ్లీ చైనా ఆటగాడు వరుసగా స్కోరు చేయడంతో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. వీళ్లిద్దరు ఇప్పటి వరకు ఏడు సార్లు ముఖాముఖీగా తలపడ్డారు. భారత స్టార్ ఒకే ఒక్కసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2017)లో గెలిచాడు. ఇది మినహా నేటి మ్యాచ్ సహా ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ ఆటగాడికి ఓటమి ఎదురైంది. -
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, మిథున్
న్యూఢిల్లీ: ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫ్రాన్స్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ కశ్యప్ 21–15, 21–17తో రొసారియో (ఇటలీ)పై గెలి చాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 18–21, 17–21తో అజయ్ జయరామ్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, గుమ్మడి వృశాలి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకృష్ణప్రియ 16– 21, 22–20, 13–21తో ముగ్ధ (భారత్) చేతిలో... వృశాలి 11–21, 12–21తో పొలికర్పోవా (ఇజ్రాయెల్) చేతిలో ఓడారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో మిథున్ 21–18, 21–16తో సిద్ధార్థ్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. నికొలోవ్ (బల్గేరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సిరిల్ వర్మ తొలి గేమ్‌ను 22–20తో నెగ్గి, రెండో గేమ్‌ను 14–21తో కోల్పోయాడు. మూడో గేమ్‌లో 3–14తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. -
క్వార్టర్స్‌లో ఇంగ్లండ్
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. సోమవారం జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 2–0తో న్యూజిలాండ్‌పై, ఫ్రాన్స్ 1–0తో చైనాపై గెలుపొందాయి. ఇంగ్లండ్ తరఫున విల్ కాల్నన్ (25వ ని.), లూక్ టేలర్ (44వ ని.) ఒక్కో గోల్ చేశారు. మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో చైనాపై గెలిచేందుకు ఫ్రాన్స్ చెమటోడ్చింది. ఈ పోరులో నమోదైన ఏకైక గోల్‌ను టిమోతీ క్లెమెంట్ (36వ ని.) మూడో క్వార్టర్లో సాధించిపెట్టాడు. ఈ 1–0 ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకున్న ఫ్రాన్స్ మ్యాచ్‌లో గట్టెక్కింది. మంగళవారం జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో బెల్జియంతో పాకిస్తాన్; కెనడాతో నెదర్లాండ్స్ తలపడతాయి. -
సింధు ప్రతీకారం
పారిస్: ఈ ఏడాది వరుసగా రెండుసార్లు బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మూడోసారి మాత్రం పైచేయి సాధించింది. మంగళవారం మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌పై గెలిచింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఇచ్చిన జాంగ్ రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో, గత వారం డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో సింధుపై నెగ్గిన జాంగ్ ఈసారి మాత్రం ఓటమి రుచి చూసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) జంట 14–21, 17–21తో లీ జున్హుయ్–లియు యుచెన్ (చైనా) జోడీ చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో సైనా
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ సైనా 21–18, 21–18తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో కొన్ని సార్లు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా... చివరి వరకు పట్టు సడలించకుండా ఆడిన సైనా విజయం సొంతం చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్)తో సైనా తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న జంట
ఫీవర్ ట్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్స్‌కు చేరింది. లండన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–3, 7–6 (7/3)తో కెవిన్ (దక్షిణాఫ్రికా)–జూలియన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇదే టోర్నీ సింగిల్స్ తొలి రౌండ్లో నేడు మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో బాంబ్రీ తలపడతాడు. -
సింధు... మళ్లీ శ్రమించి
బర్మింగ్‌హామ్ : ఎంతోకాలంగా భారత మహిళా క్రీడాకారిణులకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించే దిశగా తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 13–21, 21–18తో ప్రపంచ 11వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆటతీరులో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 12–16తో నాలుగు పాయింట్లు వెనుకబడింది. కానీ కళ్లు చెదిరే స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 17–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జిందాపోల్ రెండు పాయింట్లు నెగ్గి 18–17తో ముందంజ వేసింది. కానీ సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21–18తో మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్లోనూ సింధు మూడు గేముల్లో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. బుధవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) 9–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–19, 21–18తో యుగో కొబయాషి–హోకి టకురో (జపాన్) జంటను ఓడించింది. రెండో స్థానానికి శ్రీకాంత్ గురువారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ రెండోసారి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గతవారం మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్ ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గత నవంబర్‌లో తొలిసారి రెండో ర్యాంక్ చేరిన శ్రీకాంత్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ప్రపంచ నంబర్‌వన్ అవుతాడు. భారత్‌కే చెందిన సాయిప్రణీత్ రెండు స్థానాలు పురోగతి సాధించి 12వ ర్యాంక్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో సింధు మూడో ర్యాంక్‌లో, సైనా 12వ ర్యాంక్‌లో ఉన్నారు. -
చైనాకు భారత్ షాక్
ఆసియా చాలెంజ్ బాస్కెట్‌బాల్‌లో ఆశలు సజీవం టెహ్రాన్: ఫిబా ఆసియా చాలెంజ్ బాస్కెట్‌బాల్‌లో భారత జట్టు తమ క్వార్టర్‌ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. తమ గ్రూప్ ‘ఇ’ రెండో రౌండ్లో పటిష్ట చైనాకు షాక్‌నిస్తూ 70-64 తేడాతో నెగ్గింది. భారత్‌కు అమ్రిత్ పాల్ సింగ్ ఆల్‌రౌండ్ షోతో 23 పారుుంట్లు అందించాడు. ఈ గ్రూప్‌లో టాపర్‌గా ఉన్న చైనాకు ఇది తొలి ఓటమి. మరోవైపు భారత్‌కు ఇది రెండో విజయం. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్.. క్వార్టర్స్‌లో చోటు దక్కాలంటే టాప్-4లో నిలవాలి. నేడు (బుధవారం) జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో వికాస్
రియో డి జనీరో: ఇంకొక్క విజయం సాధిస్తే భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. శనివారం జరిగిన పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో వికాస్ 3-0తో (30-27, 29-28, 29-28) సిపాల్ ఒండెర్ (టర్కీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు చేరిన వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మూడు రౌండ్లపాటు జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో 24 ఏళ్ల వికాస్ ఆధిపత్యం కనబరిచాడు. దూకుడుగా ఆడుతూ తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. మూడో రౌండ్లో వికాస్ పంచ్‌లకు తట్టుకోలేక రక్తం కారుతున్న తన కంటికి చికిత్స చేయించుకునేందుకు సిపాల్ విరామం తీసుకోవడం గమనార్హం. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల బెక్తెమిర్ మెలికుజియెవ్ (ఉజ్బెకిస్తాన్)తో వికాస్ తలపడతాడు. బెక్తెమిర్ 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. ‘నా గ్రూప్‌లో బెక్తెమిర్ క్లిష్టమైన ప్రత్యర్థి. క్వార్టర్స్‌లో అతణ్ని ఓడిస్తే నేను స్వర్ణంతోనే తిరిగి వస్తాను. గత ఆసియా చాంపియన్‌షిప్ ఫైనల్లో నేను సరైన ఫామ్‌లో లేనందున బెక్తెమిర్ చేతిలో ఓడిపోయాను. ఈసారి అతణ్ని ఓడిస్తాననే నమ్మకం ఉంది’ అని వికాస్ వ్యాఖ్యానించాడు. -
క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ టీమ్
భారత మహిళల ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో భారత మహిళల టీమ్ విజయం సాధించింది. కొలంబియాపై 5-3 తేడాతో గెలుపొంది భారత మహిళల జట్టు క్వార్టర్ పైనల్లోకి ప్రవేశించింది. తొలి సెట్ 52-51తో గెలిచిన దీపికా కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి బృందం రెండో సెట్ లో 49-50 తో వెనుకంజ వేసింది. మూడో సెట్లో 52-52 తో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో నిర్ణయాత్మక సెట్ నిర్వహించారు. ఈ సెట్ లో భారత్ 52 పాయింట్లు కొల్లగొట్టగా, కొలంబియా మహిళల జట్టు కేవలం 44 పాయింట్లు స్కోరు చేయడంతో ఓటమి పాలైంది. భారత మహిళల ఆర్చరీ బృందం క్వార్టర్స్ లో రష్యాతో తలపడనుంది. -
భారత్ ప్రత్యర్థి బ్రిటన్
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఖరారైంది. గ్రూప్ ‘బి’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలిచిన భారత్... గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచిన బ్రిటన్ జట్టుతో తలపడుతుంది. మంగళవారంతో రెండు గ్రూప్‌ల లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బెల్జియంతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రిటన్ 3-3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. దాంతో మొత్తం ఏడు పాయింట్లతో బ్రిటన్ ఈ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6-0తో కెనడాను ఓడించి ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. నాలుగు పాయింట్లతో బెల్జియం మూడో స్థానంలో, పాయింట్లేమీ సాధించని కెనడా నాలుగో స్థానంలో నిలిచాయి. బుధవారం జరిగే రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో కెనడాతో నెదర్లాండ్స్; జర్మనీతో ఆస్ట్రేలియా తలపడతాయి. గురువారం జరిగే మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో భారత్; బెల్జియంతో అర్జెంటీనా ఆడతాయి. -
బ్యాడ్మింటన్‌లో భారతీయుల జయభేరి
-
సింధు సూపర్
మాజీ నంబర్‌వన్ లీ జురుయ్‌పై గెలుపు క్వార్టర్స్‌కు చేరిన భారత స్టార్ సైనా, జ్వాల జోడీ కూడా ముందుకు పోరాడి ఓడిన శ్రీకాంత్, ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు సంచలనం సృష్టించింది.లీజురుయ్ రూపంలో అడ్డొచ్చిన చైనా గోడను సింధు బద్దలు కొడితే... సైనాతో పాటు జ్వాల ద్వయం అలవోకగా నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. జకార్తా: గాయాల కారణంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-14తో 14వ సీడ్ సయాకి తకహషీ (జపాన్)పై అలవోకగా నెగ్గింది. తద్వారా ఈ ఇద్దరూ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో గెలిస్తే కనీసం కాంస్య పతకాలైనా లభిస్తాయి. ఆరంభంలో కాస్త తడబడటంతో తొలిగేమ్‌లో 0-7తో వెనుకబడిన సైనా తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. రెండో గేమ్‌లో ఓ దశలో స్కోరు 16-16, 18-18తో సమమైనా... మూడు వరుస పాయింట్లతో సైనా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు జురుయ్‌తో 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు అమోఘమైన ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి ఎదురుదాడి ఎదురైనా.. కీలక సమయంలో చెలరేగింది. తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడిన సింధు, జురుయ్‌కు అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో జురుయ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆకట్టుకుంది. కీలక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 13-13, 14-14తో సమంగా సాగింది. ఈ దశలో సింధు నాలుగు వరుస పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 18-14కు పెంచుకుంది. తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో 13వ సీడ్ జ్వాల-అశ్విని 21-15, 18-21, 21-19తో 8వ సీడ్ రెకా కకివా-మియుకీ మేధ (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 17-21, 21-23తో 13వ సీడ్ హు యున్ (హాంకాంగ్) చేతిలో; 11వ సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 16-21, 21-19, 18-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. -
బ్రయాన్ సోదరులకు షాకిచ్చిన బోపన్న జోడీ
లండన్ : మూడు సార్లు ఛాంపియన్లు బ్రయాన్ సోదరులకు, రోహన్ బోపన్న జోడీ షాకిచ్చి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లింది. మూడుసార్లు వింబుల్డన్ ఛాంపియన్లయిన బ్రయాన్ బ్రదర్స్ ద్వయాన్ని ప్రీక్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టించారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిదో సీడ్ ఆటగాళ్లు రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా) ద్వయం 5-7, 6-4, 7-6(9), 7-6(5) తేడాతో బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ (అమెరికా) సోదరులను మట్టికరిపించింది. సుమారు రెండు గంటల 34 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఇండో- రొమేనియా జోడీనే విజయం వరించింది. బోపన్న జోడీ మొత్తం 31 విన్నర్ షాట్లు ఆడగా, ఇందులో 17 ఏస్ లు సంధించడం విశేషం. సెమీస్ లో నాలుగో సీడ్ జీన్ - జులియన్ రోజర్, హోరియా టెక్యూ జోడీతో తలపడనున్నారు. -
నలుగురూ క్వార్టర్స్‌కు
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఒడెన్స్: సింగిల్స్ విభాగంలో బరిలో ఉన్న నలుగురు తెలుగు క్రీడాకారులు... డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి. సింధు 21-17, 21-19తో కిస్నియా పొలికర్పోవా (రష్యా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో ఏడోసీడ్ సైనా నెహ్వాల్ 21-12, 21-10తో మినత్సు మితానీ (జపాన్)ని ఓడించింది. కిస్నియాతో 31 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఆకట్టుకుంది. 4-0 ఆధిక్యంతో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన సింధు చివరి వరకు దాన్ని కొనసాగించింది. రెండో గేమ్‌లో 2-2తో స్కోరు సమమైనా హైదరాబాద్ అమ్మాయి దూకుడుగా ఆడి 19-15తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో రష్యా అమ్మాయి పుంజుకుని చకచకా పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 19-20కి తగ్గించింది. అయితే తన అనుభవాన్ని రంగరించిన సింధు ఓ చక్కని షాట్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల రెండో రౌండ్లో పారుపల్లి కశ్యప్ 21-17, 17-21, 22-20తో హోయామ్ రుంబాకా (ఇండోనేసియా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-12, 21-15తో జెన్ హో సు (చైనీస్ తైపీ)ని ఓడించాడు. రుంబాకాతో గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌కు గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో 13-13తో స్కోరు సమమైన తర్వాత భారత్ కుర్రాడు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గాడు. 17-13 స్కోరుతో వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌లో ఇండోనేసియా ప్లేయర్ 7-1 ఆధిక్యంతో చెలరేగాడు. ఈ దశలో కశ్యప్ వరుసగా 6 పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసినా.... ప్రత్యర్థి ముందు నిలువలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో ముందంజ వేసిన కశ్యప్ 20-20 స్కోరు వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించడం కలిసొచ్చింది. -
క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్