టోక్యో: మూడు దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. తమ ఖాతాలో మూడో విజయం జమ చేసుకొని క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా గురువారం జరిగిన పూల్ ‘ఎ’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్జెంటీనాను ఓడించింది. క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున వరుణ్ కుమార్ (43వ నిమిషం), వివేక్ సాగర్ ప్రసాద్ (58వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా... అర్జెంటీనా తరఫున కాసెలా షుట్ (9వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు. తొలి క్వార్టర్‌లోనే గోల్ అప్పగించి వెనుకబడినా... భారత జట్టు ఆ తర్వాత చెలరేగి దూసుకుపోయింది. తాజా విజయంతో పూల్ ‘ఎ’ నుంచి కనీసం రెండో స్థానంలో భారత్ క్వార్టర్స్ చేరడం ఖాయమైంది. నేడు జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది.
మెరిసిన మనూ...
మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ క్వాలిఫయింగ్ విభాగం స్టేజ్–1 (ప్రెసిషన్)లో భారత షూటర్లు మనూ భాకర్ ఐదో స్థానంలో నిలువగా.... రాహీ సర్నోబత్ 25వ స్థానంలో నిలిచింది. మొత్తం 44 మంది షూటర్లు పాల్గొనగా... అందుబాటులో ఉన్న 300 పాయింట్లకుగానూ మనూ 292 పాయింట్లు సాధించింది. రాహీ 287 పాయిం ట్లు స్కోరు చేసింది. జొరానా అరునోవిచ్ (సెర్బియా– 296), అన్నా కొరకాకి (గ్రీస్– 294), ఆంటోనెటా కొస్టాడినోవా (బల్గేరియా–293) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నేడు క్వాలిఫయింగ్ స్టేజ్–2 (ర్యాపిడ్) జరగనుంది. ఈ రెండు అర్హత పోటీల్లో సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్ కూడా శుక్రవారమే
జరగనుంది.
11వ స్థానంతో సరి
రోయింగ్‌లో భారత ప్రయాణం ముగిసింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో మెడల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయిన అర్జున్ లాల్–అరవింద్ సింగ్ జంట 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 7–12 స్థానాల కోసం గురువారం జరిగిన రేసులో గ్రూప్ ’బి’ నుంచి బరిలోకి దిగిన భారత జోడీ 6ని:29.46 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఓవరాల్‌గా మాత్రం 11వ స్థానంలో నిలిచింది.
గోల్ఫ్: 8వ స్థానంలో అనిర్బన్
రెండోసారి ఒలింపిక్స్‌లో ఆడుతోన్న భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల గోల్ఫ్ తొలి రౌండ్‌ను అతడు ఎనిమిదో స్థానంతో ముగించాడు. 18 హోల్స్ కోర్సును 67 షాట్లల్లో పూర్తి చేసిన అనిర్బన్... సెబాస్టియన్ (కొలంబియా), పాల్ కేసీ (బ్రిటన్), అలెక్స్ నొరెన్ (స్వీడన్)లతో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరో భారత గోల్ఫర్ ఉదయన్ మానె 76 షాట్లల్లో కోర్సును ముగించి చివరి స్థానం (60వ)లో నిలిచాడు. ఈ ఈవెంట్ నాలుగు రౌండ్ల పాటు జరగనుండగా... 60 మంది పతకం రేసులో ఉన్నారు.
మన అశ్వం బాగుంది
ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ) ఈవెంట్‌లో పాల్గొనడానికి భారత రైడర్ ఫౌద్ మీర్జా కు లైన్ క్లియర్ అయింది. అతని ఈక్వైన్ (గుర్రం) సంపూర్ణ ఆరోగ్యం తో ఉందంటూ ఈవెంట్ జడ్జింగ్ కమిటీ తన రిపోర్టులో పేర్కొంది. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ జరగడానికి ముందు పోటీల్లో పాల్గొనే రైడర్ల గుర్రాలను జడ్జింగ్ కమిటీ పరిశీలిస్తుంది. వాటికి పోటీలో పాల్గొనేందుకు సరిపడా ఫిట్‌నెస్ ఉందా... ఏమైనా గాయాలు ఉన్నాయా అనే విషయాలను చూస్తారు. ఒకవేళ వారి పరిశీలనలో గుర్రానికి గాయాలు ఉన్నట్లు తేలితే... దానిని పోటీ నుంచి తొలగిస్తారు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనుండగా... ఫౌద్ మీర్జా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment