కౌలాలంపూర్: తొలిరోజేమో సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్... రెండో రోజు సైనా నెహ్వాల్... మూడో రోజు పీవీ సింధు... ఇలా మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మొదలైన రోజు నుంచి ప్రతీ రౌండ్‌లో ఒకరిద్దరు భారత షట్లర్లు ఓడుతూ వచ్చారు. నేడు కిడాంబి శ్రీకాంత్ ఓటమితో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలివున్న ఒకే ఒక్క తెలుగుతేజం క్వార్టర్ ఫైనల్లో కంగుతిన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 18–21, 19–21తో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలిగేమ్ ఆరంభంలో 6–3తో జోరు పెంచిన శ్రీకాంత్ ఒక్కసారి మినహా 16–15స్కోరు దాకా ఆధిక్యంలోనే కొనసాగాడు. కానీ ఒలింపిక్ చాంపియన్ ఆఖర్లో జాగ్రత్తగా ఆడటం, ఏపీ ఆటగాడు అనవసర తప్పిదాలు చేయడం గేమ్‌ను చేజార్చింది. రెండో గేమ్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 7–8 వరకు చక్కగా పోరాడిన తెలుగు షట్లర్... చెన్ లాంగ్ జోరు పెంచడంతో 8–16తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్ వరుసగా పాయింట్లు గెలిచి 18–18తో ప్రత్యర్థిని నిలువరించాడు. చివర్లో మళ్లీ చైనా ఆటగాడు వరుసగా స్కోరు చేయడంతో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. వీళ్లిద్దరు ఇప్పటి వరకు ఏడు సార్లు ముఖాముఖీగా తలపడ్డారు. భారత స్టార్ ఒకే ఒక్కసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2017)లో గెలిచాడు. ఇది మినహా నేటి మ్యాచ్ సహా ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ ఆటగాడికి ఓటమి ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment