పారిస్: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాఫెల్ నాదల్ ఒక్కడే అత్యధికంగా 14 సార్లు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. అయితే నాదల్ రికార్డును టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ సోమవారం సమం చేశాడు. ఈ సెర్బియా స్టార్ కూడా 14వ సారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని నాదల్ సరసన చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 6–3తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. ఈ టోర్నీలో వరుసగా 11వసారి క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
ఖచనోవ్‌తో 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన పోరులో జొకోవిచ్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. 28 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈసారి జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) రెండుసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 7–6 (11/9), 6–2తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 7–5, 6–4, 7–6 (7/3)తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి తమ కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.
క్విటోవా 2012 తర్వాత...
మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి లౌరా సిగెముండ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్విటోవా 6–2, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై, లౌరా సిగెముండ్ 7–5, 6–2తో పౌలా బడోసా (స్పెయిన్)పై గెలిచారు. కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న లౌరా తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. మరోవైపు క్విటోవా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 2–6, 6–2, 6–1తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్)పై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment