
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ జెస్సికా పెగూలా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–1, 6–2తో అమెరికాకే చెందిన ప్రపంచ 58వ ర్యాంకర్ ఆన్ లీపై గెలుపొందింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జెస్సికా రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది.
నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన ఆమె 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్‌లో స్వియాటెక్ 7–6 (7/2), 6–4తో కలిన్‌స్కాయ (రష్యా)పై నెగ్గింది.
జ్వెరెవ్‌కు చుక్కెదురు
పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో జ్వెరెవ్ 6–4, 6–7 (7/9), 4–6, 4–6తో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్‌లో సినెర్ 5–7, 6–4, 6–3, 6–3తో షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు.
యూకీ జోడీ బోణీ
పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో యూకీ–వీనస్ 6–0, 6–3తో గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా)లపై గెలిచారు.