womens singles
-
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. -
సింధు శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–17, 21–15తో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన వలిశెట్టి శ్రేయాన్షి, మాళవిక బన్సోద్, రక్షిత శ్రీ, అనుపమ ఉపాధ్యాయ్, తస్నిమ్ మీర్, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్, ఐరా శర్మ కూడా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడా కారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–12, 21–12తో ఆదిల్ (మలేసియా)పై, ప్రియాన్షు 21–13, 21–12తో కార్తికేయ (భారత్)పై గెలిచారు. భారత్‌కే చెందిన మైస్నం మెరాబా, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి, రిత్విక్ కూడా తొలి రౌండ్లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సింధు శుభారంభం
కుమమోటో: జపాన్ ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుసానన్ ఒంగ్మమ్రుంగ్ఫన్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 21–8తో అలవోకగా గెలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న బుసానన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓవరాల్‌గా సింధు, బుసానన్ల మధ్య ఇది 20వ ముఖాముఖి పోరు కావడం విశేషం. సింధు ఏకంగా 19 సార్లు గెలుపొందగా... థాయ్‌లాండ్ ప్లేయర్ ఒక్కసారి మాత్రమే సింధును ఓడించింది. బుసానన్ ఆటతీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న సింధుకు తొలి గేమ్ ఆరంభంలో గట్టిపోటీ లభించింది. ఒకదశలో సింధు, బుసానన్ (11–10) మధ్య ఒక్క పాయింటే అంతరంగా నిలిచింది. అయితే నెమ్మదిగా సింధు జోరు పెంచగా... థాయ్‌లాండ్ ప్లేయర్ తడబడింది. స్కోరు 14–12 వద్ద సింధు చెలరేగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఏడు పాయింట్లతో అదరగొట్టిన సింధు తొలి గేమ్‌ను 21–12తో దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. స్కోరు 5–4 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ స్కోరు 10–7 వద్ద సింధు వరుసగా 10 పాయింట్లు సంపాదించి 20–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ ఒక పాయింట్ సాధించిన వెంటనే సింధు కూడా ఒక పాయింట్ నెగ్గడంతో భారత స్టార్ విజయం ఖరారైంది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రౌండ్లోనే ముగిసింది. భారత స్టార్ లక్ష్య సేన్ 74 నిమిషాల పోరులో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 17–21, 16–21తో ఓడిపోయాడు. గతంలో జున్ హావోపై మూడుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. -
కోకో గాఫ్‌దే చైనా ఓపెన్
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ చాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్ 6–1, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 76 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోకో ఆరు ఏస్‌లు సంధించింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ముకోవాకు 5,85,000 డాలర్ల (రూ. 4 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో గత 14 ఏళ్లలో ఈ టోర్నీ టైటిల్ సాధించిన పిన్న వయసు్కరాలిగా 20 ఏళ్ల కోకో గాఫ్ గుర్తింపు పొందింది. సెరెనా విలియమ్స్ (2004, 2013) తర్వాత చైనా ఓపెన్ సాధించిన రెండో అమెరికన్ ప్లేయర్‌గానూ కోకో గాఫ్ ఘనత వహించింది. ఓవరాల్‌గా కోకో కెరీర్లో ఇది ఎనిమిదో సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్‌తో సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు కోకో గాఫ్ చేరువైంది. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
తొలి రౌండ్ దాటలేకపోయారు
యోకోహామా: భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ముగ్గురు భారత యువ క్రీడాకారిణులకు జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నిరాశను మిగిల్చింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షట్లర్లు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.అషి్మత 16–21, 12–21తో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... మాళవిక 21–23, 19–21తో పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో... ఆకర్షి 13–21, 12–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జోడీ 10–21, 18–21తో రెహాన్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. -
Wimbledon 2024: కోకో గాఫ్ పరాజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్‌కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు. ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్‌స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నాలుగో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు. -
French Open 2024: క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెద్వెదెవ్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్‌ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
సబలెంకా బోణీ
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.27 విన్నర్స్ కొట్టిన సబలెంకా నెట్ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఈ బెలారస్ స్టార్ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ మరియా సాకరి (గ్రీస్) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), పదో సీడ్ దరియా కసత్కినా (రష్యా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై, కిన్వెన్ జెంగ్ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)పై, కసత్కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్ (పోలాండ్)పై గెలుపొందారు. రూడ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రూడ్ 6–3, 6–4, 6–3తో అల్వెస్ మెలెగిని (బ్రెజిల్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 23 విన్నర్స్ కొట్టిన రూడ్ నెట్ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కార్నె వీడ్కోలు... ఈ టోర్నీతో ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అలీజా కార్నె కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కిన్వెన్ జెంగ్ చేతిలో మ్యాచ్ ముగిశాక ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కార్నె 2007 ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తాజా ఫ్రెంచ్ ఓపెన్ వరకు వరుసగా 69 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో నాటి ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2009లో కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. -
Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అషి్మత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2022 ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్–500 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. సిమ్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి (భారత్) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్ షువో యున్–యు చెయున్ హుయ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్–థినా మురళీధరన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 9–21, 15–21తో టాప్ సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ హాన్ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్ జాంగ్ యి మాన్ (చైనా)తో అషి్మత తలపడతారు. -
సింధు శుభారంభం
బాసెల్ (స్విట్జర్లాండ్): మాజీ చాంపియన్ పీవీ సింధు స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–12, 21–13తో పోర్న్‌పిచా చొయ్కీవోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ తొమోకా మియజకీతో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. 2015లో స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ 21–17, 21–18తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గగా... లక్ష్య సేన్ 21–19, 15–21, 21–11తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. తొలి రౌండ్లో అశి్వని–తనీషా ద్వయం 21–18, 12–21, 21–19తో మెలీసా పుస్పితాసారి–రేచల్ రోజ్ (ఇండోనేసియా) జంటపై... గాయత్రి–ట్రెసా జోడీ 21–15, 21–12తో అనీ జు–కెరీ జు (అమెరికా) ద్వయంపై గెలుపొందాయి. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు ఏడో‘సారీ’...
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గత ఐదేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ కొరియా ప్లేయర్ ఆన్ సె యంగ్ చేతిలో సింధు వరుసగా ఏడోసారి ఓడిపోయింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింధు 19–21, 11–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ ఆన్ సె యంగ్ చేతిలో ఓటమి పాలైంది. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఆన్ సె యంగ్‌కు గట్టిపోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో మాత్రం తడబడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 3,900 డాలర్ల (రూ. 3 లక్షల 23 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రష్మిక సంచలనం
ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. ముంబైలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 374వ ర్యాంకర్ రష్మిక 6–3, 6–2తో ప్రపంచ 117వ ర్యాంకర్ వాలెంటిని గ్రామటికోపులు (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. మొర్వాయోవా (స్లొవేకియా)తో నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో మ్యాచ్‌లో రష్మిక గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తుంది. -
స్వియాటెక్‌కు షాక్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల లిండా నొస్కోవా తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేసి నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 50వ ర్యాంకర్ నొస్కోవా 3–6, 6–3, 6–4తో స్వియాటెక్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్), 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. -
Australian Open 2024: భళా బ్లింకోవా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఐదో రోజు గురువారం టాప్–10లోని ఇద్దరు క్రీడాకారిణులు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)... ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రస్తుతం టాప్–10లో నలుగురు క్రీడాకారిణులు టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మాత్రమే బరిలో నిలిచారు. 42 పాయింట్ల టైబ్రేక్... రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 2 గంటల 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6–4, 4–6, 7–6 (22/20)తో రిబాకినాపై గెలుపొందగా... క్లారా బురెల్ (ఫ్రాన్స్) 70 నిమిషాల్లో 6–4, 6–2తో పెగూలాను ఓడించి తమ కెరీర్లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. బ్లింకోవా–రిబాకినా మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నిర్ణాయక మూడో సెట్లో జరిగిన టైబ్రేక్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్గా నిలిచింది. 31 నిమిషాలపాటు సాగిన 42 పాయింట్ల టైబ్రేక్‌లో చివరకు బ్లింకోవా 22–20తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మూడో సెట్ ఏకంగా 93 నిమిషాలు సాగింది. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో లెసియా సురెంకో (ఉక్రెయిన్)–అనా బొగ్డాన్ (రొమేనియా) మధ్య మూడో రౌండ్ మ్యాచ్‌లోని మూడో సెట్లో టైబ్రేక్ 38 పాయింట్లపాటు జరిగింది. చివరకు సురెంకో ఈ టైబ్రేక్‌ను 20–18 పాయింట్లతో గెల్చుకుంది. రిబాకినాతో జరిగిన మ్యాచ్‌లో బ్లింకోవా ఏకంగా ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మరోవైపు రిబాకినా తొమ్మిదిసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా పదోసారి పరాజయం తప్పలేదు. శ్రమించి నెగ్గిన స్వియాటెక్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్ చేరడానికి 3 గంటల 14 నిమిషాలు శ్రమించింది. ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్వియాటెక్ రెండో రౌండ్లో 6–4, 3–6, 6–4తో 2022 రన్నరప్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో 14వ సీడ్ కసత్కినా 6–4, 3–6, 3–6తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) 4–6, 6–4, 4–6తో యాఫాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–0, 3–6, 6–4తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా)పై, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–3, 6–3తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో తొమోవా (బల్గేరియా)పై గెలిచారు. హోల్గర్ రూనెకు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) రెండో రౌండ్లో ని్రష్కమించాడు. ఆర్థర్ కజాక్స్ (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–4, 4–6, 6–3తో రూనెపై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 6–3, 7–6 (7/3)తో సొనెగో (ఇటలీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 3–6, 4–6, 7–6 (7/5), 7–6 (10/7)తో లుకాస్ క్లీన్ (స్లొవేకియా)పై, 11వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 6–7 (5/7), 6–3, 3–6, 7–6 (10/7)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై కష్టపడి గెలిచారు. పోరాడి ఓడిన సుమిత్ నగాల్ భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
అంకిత రైనా శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ లో భారత స్టార్ అంకిత రైనా శుభారంభం చేసింది. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 221వ ర్యాంకర్ అంకిత 6–4, 5–7, 7–6 (10/7)తో ప్రపంచ 158వ ర్యాంకర్ జెస్సికా బుజస్ మనెరో (స్పెయిన్)పై గెలిచింది. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ తమ సర్విస్లను ఎనిమిదిసార్లు కోల్పోయారు. నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో అంకిత పైచేయి సాధించి విజేతగా నిలిచింది. రెండో రౌండ్లో ప్రపంచ 132వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్)తో అంకిత తలపడుతుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్‌కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్‌లో ఉంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సబలెంకా vs కోకో గాఫ్
కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ 6–4, 7–5తో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్ జరుగుతుంది. ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల కోకో గాఫ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీస్‌తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. తొమ్మిదో గేమ్‌లో కీస్ తన సర్విస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్ సర్విస్‌ను సబలెంకా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్‌లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది. -
సుతీర్థ–ఐహిక జోడీ ఓటమి
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్ 9–11, 10–12, 5–11తో చైనా దిగ్గజం మా లాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సుతీర్థ 9–11, 6–11, 4–11తో ఒరావన్ పరానాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో... ఐహిక ముఖర్జీ 11–2, 11–6, 8–11, 9–11, 3–11తో చెన్ జింగ్టాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ (భారత్) జోడీ 5–11, 11–13, 10–12తో మాన్యు వాంగ్–చెన్ మెంగ్ (చైనా) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్–మనుష్ షా (భారత్) జంట 5–11, 3–11, 5–11తో ఫాన్ జెన్‌డాంగ్–లిన్ గావోయువాన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టుకు ఆరో స్థానం లభించింది. -
గట్టెక్కిన జొకోవిచ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తన దేశానికే చెందిన లాస్లో జెరె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి రెండు సెట్లను చేజార్చుకున్న జొకోవిచ్ 2006 తర్వాత యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లోనే ఇంటిదారి పడతాడా అనే సందేహం కలిగింది. అయితే అపార అనుభవం కలిగిన ఈ మాజీ చాంపియన్ పట్టుదలతో పోరాడి తేరుకున్నాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని ఈ టోర్నీలో వరుసగా 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 4–6, 4–6, 6–1, 6–1, 6–3తో ప్రపంచ 38వ ర్యాంకర్ లాస్లో జెరెపై గెలుపొందాడు. ఈ పోరులో 12 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. 34 విన్నర్స్ కొట్టిన అతను 36 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), పదో సీడ్ టియాఫో (అమెరికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫ్రిట్జ్ 6–1, 6–2, 6–0తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై, టియాఫో 4–6, 6–2, 6–3, 7–6 (8/6)తో 22వ సీడ్ మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ రిబాకినాకు షాక్ మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. గత ఏడాది వింబుల్డన్ చాంపియన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. 30వ సీడ్ సొరానా క్రిస్టియా (రొమేనియా) 2 గంటల 48 నిమిషాల్లో 6–3, 6–7 (6/8), 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాను బోల్తా కొట్టించి 15వ ప్రయత్నంలో యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి తన జోరు కొనసాగిస్తోంది. మూడో రౌండ్లో వొజ్నియాకి గంటా 58 నిమిషాల్లో 4–6, 6–3, 6–1తో జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)ను ఓడించి 2016 తర్వాత ఈ టోర్నీలో మరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో గాఫ్ 3–6, 6–3, 6–0తో 32వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. మూడో రౌండ్లో సబలెంకా 6–1, 6–1తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై, దరియా 6–3, 6–4తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై గెలిచారు. 8 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో తొలి రెండు సెట్లను కోల్పోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను దక్కించుకొని విజయం అందుకోవడం జొకోవిచ్‌కిది ఎనిమిదోసారి కావడం విశేషం. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌పై కూడా జొకోవిచ్ ఈ తరహాలోనే గెలిచాడు. -
సింధుకు చుక్కెదురు
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో ఈ మాజీ చాంపియన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్లో పోటీపడింది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆమె బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14–21, 14–21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లో కూడా ఆరంభంలో ప్రత్యర్థికంటే మెరుగ్గా, ప్రత్యర్థికి దీటుగా ఆడిన 16వ సీడ్ సింధు గేమ్ సాగే కొద్దీ డీలా పడటంతో వరుస గేముల్లోనే ఓడింది. రెండో గేమ్‌లో సింధు ఒకదశలో 9–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ జపాన్ షట్లర్ వరుసగా పాయింట్లు నెగ్గుకుంటూ రావడంతో మళ్లీ సింధు ఆధిక్యాన్ని, ఆ తర్వాత మ్యాచ్‌నే కోల్పోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ ప్రణయ్, లక్ష్యసేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21–11, 21–12తో జియోన్ హ్యోక్ (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–14తో చికొ అర వర్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో ప్రణయ్; కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో లక్ష్య సేన్ తలపడతారు. -
సింధు ర్యాంక్‌లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు రెండు స్థానాలు పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో సింధు 17 నుంచి 15వ స్థానానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 9వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్ 11వ ర్యాంకుల్లో కొనసాగుతుండగా...శ్రీకాంత్ ఒక స్థానం పడిపోయి 20వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
వింబుల్డన్‌కు ముందు అన్నీ అడ్డంకులే.. వండర్ వొండ్రుసోవా
అన్‌సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్‌లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్‌సీడెడ్‌గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాది రన్నరప్‌గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది. లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్‌గా ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నలుగురు గ్రాండ్‌స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్హ్యాండ్లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 6–4తో తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్‌లైన్ గేమ్‌తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది. తొమ్మిదో గేమ్‌లో పదే పదే నెట్‌పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది.