పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆట తొలి పోరులోనే ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–13, 17–21, 19–21తో వ్యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సైనా, ఆ తర్వాత ప్రత్యర్థి ముందు నిలబడలేకపోయింది. మరో వైపు డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట శుభారంభం చేసింది.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో కామన్వెల్త్ చాంపియన్స్, ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 21–9, 21–13తో క్రిస్టో పొపొవ్–తొమా జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ తర్వాతి గేమ్‌లలో పుంజుకొంది. రెండో గేమ్‌ను చకచకా ముగించగా, నిర్ణాయక గేమ్‌లోనూ ఇదే ఆటతీరు కొనసాగించడంతో స్థానిక ఆటగాళ్లకు పరాజయం తప్పలేదు.
ఒక గంటా 8 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జోడీ తేలిపోయింది. అయితే మిక్స్‌డ్, మహిళల డబుల్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. మహిళల డబుల్స్ మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట 21–23, 20–22తో ఆరో సీడ్ జాంగకొల్ఫన్ కిటితరకుల్–రవిండ ప్రజొంగ్జయ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో జోడీ 13–21, 16–21తో జపాన్‌కు చెందిన క్యోహెయ్ యమషిత–నరు షినొయా జంట చేతిలో పరాజయం చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment