రాఫెల్ నాదల్, బియాంక అండ్రిస్కూ
టాప్ సీడ్ సెర్బియన్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో నిష్క్రమించాడు. మూడో సీడ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టాడు. ఇక అందరికళ్లు రెండో సీడ్ నాదల్ మ్యాచ్‌పైనే పడ్డాయి. కానీ టాప్–3లో అతనొక్కడే నిలిచాడు. క్వార్టర్స్ అంచెదాటి సెమీఫైనల్ చేరాడు. ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2017) చాంపియన్‌గా నిలిచిన ఈ స్పెయిన్ స్టార్ నాలుగో టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో నిలిచాడు.
న్యూయార్క్: టాప్–3లో ఒకే ఒక్కడి అడుగు సెమీస్‌లో పడింది. స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. గురువారం జరిగిన పోరులో అతను 6–4, 7–5, 6–2తో అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డీగో ష్వార్జ్‌మన్‌పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌కు రెండో సెట్ మినహా ఎక్కడ పోటీ ఎదురవలేదు. ఆఖరి సెట్‌నైతే ఏకపక్షంగా ముగించేశాడు. 5 ఏస్‌లు సంధించిన నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను 8 సార్లు బ్రేక్ చేశాడు.
39 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 35 విన్నర్స్ కొట్టాడు. 4 ఏస్‌లు సంధించిన ష్వార్జ్‌మన్... 37 అనవసర తప్పిదాలు చేశాడు. అవతలివైపు నాదల్ జోరుతో కేవలం 26 విన్నర్సే కొట్టగలిగాడు. గతేడాది కూడా ఈ టోర్నీలో సెమీస్ చేరిన నాదల్ ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో 33 సార్లు సెమీఫైనల్ చేరాడు. ప్రస్తుతం అతని కంటే ముందు వరుసలో ఫెడరర్ (45), నొవాక్ జొకోవిచ్ (36) మాత్రమే ఉన్నారు. ఇక ఈ టోర్నీలో టైటిల్ నాదల్ చేతికే అందే అవకాశాలున్నాయి. సెమీస్ బరిలో నిలిచిన ఇతర ఆటగాళ్లెవరూ స్పానియార్డ్ జోరు ముందు నిలబడలేరు. దీంతో ఏదో సంచలనం జరిగితే తప్ప... ఈ టోర్నీలో నాదల్ చాంపియన్‌షిప్‌ను ఎవరూ అడ్డుకోలేరని చెప్పొచ్చు.
42 ఏళ్ల తర్వాత ఓ ఇటాలియన్
మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇటలీకి చెందిన 24వ సీడ్ మాటెయో బెరెటిని చెమటోడ్చి నెగ్గి సెమీస్ చేరాడు. మ్యాచ్ సాగే కొద్దీ పోటీ పెరిగిన ఈ పోరులో అతను 3–6, 6–3, 6–2, 3–6, 7–6 (7/5)తో ఫ్రాన్స్ ఆటగాడు, 13వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్‌పై విజయం సాధించాడు. సుమారు నాలుగు గంటల (3 గం. 57 ని.) పాటు ఐదు సెట్ల దాకా ఈ మ్యాచ్ సాగింది. ఈ విజయంతో 42 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి ఇటాలియన్‌గా బెరెటిని ఘనతకెక్కాడు. 1977లో కొరాడో బరజుటి సెమీస్ చేరిన తర్వాత మరో ఇటలీ ఆటగాడెవరూ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌దాకా వెళ్లలేకపోయాడు. సెమీఫైనల్లో నాదల్‌తో బెరెటిని తలపడతాడు.
కెనడా టీనేజ్ అమ్మాయి బియాంక అండ్రిస్కూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3–6, 6–2, 6–3తో బెల్జియంకు చెందిన ఎలైస్ మెర్టెన్స్‌ను ఓడించింది. తాజా ఫలితంతో దశాబ్దం తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన టీనేజ్ క్రీడాకారిణిగా (19 ఏళ్లు) ఆమె ఘనతకెక్కింది. 2009లో వోజ్నియాకి (డెన్మార్క్) ఈ ఘనత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment