
మెల్‌బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది.
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్‌లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది.
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు.
‘మిక్స్‌డ్’ సెమీస్‌లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment